రోడ్డు ప్రమాదాల్లో మృతుల సంఖ్యను తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కార్యాచరణకు ఉపక్రమించాయి. ప్రధానంగా ప్రమాదం సంభవించిన వెంటనే కీలకమైన గోల్డెన్ అవర్‌లో క్షతగాత్రులకు ప్రథమ చికిత్స/అత్యవసర చికిత్సను వెంటనే అందించేలా పోలీసులు, ప్రభుత్వోద్యోగులు, కాలేజీ విద్యార్థులకు శిక్షణనిచ్చేందుకు ప్రణాళికను ఆమోదించాయి. త్వరలో పైలట్ ప్రాజెక్టును అనంతరం రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని భావిస్తున్నాయి.
మృతుల సంఖ్య సగానికి తగ్గింపే లక్ష్యం
2021లో దేశవ్యాప్తంగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 1.73 లక్షల మంది మృత్యువాత పడ్డారు. 2020తో పోలిస్తే ఇది 18.8% అధికం. అలాగే, 2021లో జరిగిన ప్రతి 100 రోడ్డు ప్రమాదాల్లో 38 మంది మరణించారు. దీంతో రోడ్డు ప్రమాదాలు, వాటిల్లో మృతుల సంఖ్య తగ్గించేలా కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి కార్యాచరణకు ఉపక్రమిస్తోంది. 2024నాటికి మృతుల సంఖ్యను కనీసం 50 శాతం తగ్గించడం, 2030 నాటికి ఎవరూ మృతిచెందకుండా చూడటం లక్ష్యంగా నిర్దేశించుకుంది. మరోవైపు.. రోడ్డు ప్రమాదం సంభవించిన వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించేవరకు వారికి వైద్య సహాయం అందడంలేదన్నది వాస్తవం.
ఎందుకంటే.. క్షతగాత్రులను ఆదుకునేందుకు ప్రయత్నించేవారు కేసుల దర్యాప్తులో భాగంగా పోలీస్‌స్టేషన్లు, న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సి వస్తుందనే భయం వారిని వేధిస్తోంది.. దీనికి పరిష్కారంగా కేంద్ర ప్రభుత్వం ‘గుడ్ సమారిటన్’ విధానాన్ని తీసుకొచ్చింది. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించే వారిని ప్రోత్సహించి నగదు బహుమతులు ప్రకటించింది. పోలీస్‌స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా చేసింది. ఇక క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించేలోగా ప్రథమ చికిత్స/అత్యవసర చికిత్స అందించడం మరో కీలక అంశం. అందుకే వివిధ వర్గాలకు ఈ చికిత్స అందించడంలో శిక్షణనివ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి.
శిక్షణ కార్యక్రమం ఇలా..
►పోలీసులు, ప్రభుత్వోద్యోగులు, విద్యార్థులతోపాటు ఆసక్తి ఉన్న వారికి కూడా శిక్షణనిస్తారు.
►ప్రథమ/అత్యవసర చికిత్సకు సంబంధించిన అంశాల్లో ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లలో శిక్షణనివ్వాలని నిర్ణయించారు.
►శిక్షణ తరగతులు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సిమ్యులేటర్లను నెలకొల్పుతుంది.
►అందులో క్షతగాత్రుల గుండె కొట్టుకునేలా చేసేందుకు కార్డియో పల్మనరీ రీససిటేషన్ (సీపీఆర్) అందించడంతోపాటు వైద్యులు నిర్దేశించిన ఇతర విధానాలపై శిక్షణనిస్తారు.
►పోలీసులు, ప్రభుత్వోద్యోగులు, విద్యార్థులకు బ్యాచుల వారీగా తర్ఫీదునిస్తారు.
►గాయాలను పరిశీలించడం, ఊపిరి ఆడుతోందీ లేనిదీ పరీక్షించడం, గొంతు, నోటిలో ఏమైనా అడ్డంపడ్డాయేమోనని పరిశీలించడం, మెడ/వెన్నెముక గాయాలైతే క్షతగాత్రులను కదపకుండా చూడటం, క్షతగాత్రుల శరీరానికి తగిన ఉష్ణోగ్రతను అందించడం, క్షతగాత్రులకు వెంటనే తాగునీరుగానీ ఆహారంగానీ అందించకుండా చూడటం, గాయాలకు ప్రథమ చికిత్స అందించడం, రక్తస్రావాన్ని నిరోధించడం, ఇతరుల సహాయంతో ఆసుపత్రికి ఎలా తరలించాలి.. మొదలైన అంశాల్లో శిక్షణనిస్తారు.
►ఒక్కో బ్యాచ్‌కు మూడ్రోజులపాటు శిక్షణనివ్వాలని భావిస్తున్నారు. అనంతరం సర్టిఫికెట్లను ప్రదానం చేస్తారు.
►అనంతరం ఫలితాలను విశ్లేషించి భవిష్యత్ ప్రణాళికను రూపొందిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment