సాక్షి, గుంటూరు : మైనర్ బాలికలపై దారుణాలకు పాల్పడే వారికి ఉరిశిక్ష విధిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో ఇదే ఆఖరి ఘటన కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. శనివారం దాచేపల్లి ఘటనలో బాధితురాలైన బాలికను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయన పరామర్శించారు. అనంతరం సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. అన్నెంపున్నె ఎరుగని పసిబిడ్డలపై అఘాయిత్యాలు జరిగితే తల్లిదండ్రులకు ఎంత బాధ ఉంటుందో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని అన్నారు.
ఇలాంటి అమానవీయ ఘటనలను చూసి నాగరిక ప్రపంచం సిగ్గుతో తలదించుకోవాలన్నారు. ఘటనపై స్సందించి వెంటనే 17 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని చెప్పారు. ఘోరంపై స్పందించిన ప్రజలను సీఎం అభినందించారు. సోమవారం ఆడబిడ్డకు రక్షణగా కదులుదాం అనే ర్యాలీని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్నట్లు చెప్పారు. సాంకేతికత కారణంగా విచ్చలవిడితనం పెరిగిపోతోంది.
అవసరమైన మేరకు టెక్నాలజీని వాడకుండా చెడు మార్గాల్లో వినియోగిస్తున్నారు. టెక్నాలజీ కారణంగా పోర్న్ చిత్రాల వ్యాప్తి పెరుగుతూ వస్తోంది. దాని నుంచే సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. పోర్న్ చిత్రాలను నియంత్రించాలని, అత్యాచారానికి పాల్పడితే భూమ్మీద ఉండమనే భయం కల్పించాలని చంద్రబాబు అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment