సాక్షి, గుంటూరు : దాచేపల్లిలో మృగాడి దాడిలో తీవ్రంగా గాయపడిన మైనర్ బాలికకు న్యాయం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆర్కే రోజా, ముస్తఫా, గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి గుంటూరు ప్రభుత్వాసుపత్రి ముందు శుక్రవారం రాస్తారోకోకు దిగారు. ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అక్కడి చేరుకున్న పోలీసులు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలను అరెస్టు చేశారు. న్యాయం కోసం నినదిస్తున్న ఎమ్మెల్యే రోజాను మహిళా పోలీసులు ఈడ్చుకెళ్లారు.
అంతకుముందు గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను ఎమ్మెల్యే రోజా పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. బాలికకు నాలుగు కుట్లు పడ్డాయని, తీవ్ర కడుపు నొప్పితో బాధపడుతోందని రోజా చెప్పారు. మనం రాష్ట్ర రాజధాని ప్రాంతంలో బతుకుతున్నామా? లేక అడవిలో ఉన్నామా? అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు.
మగాళ్లు అంటేనే బాలిక భయపడి ఏడుస్తోందని చెప్పారు. ఆసుపత్రి సూపరిటెండెంట్ గది లోపలికి వచ్చినా హడలిపోతోందని, మనషులకు ఇంత చీప్ మెంటాలిటీ ఉంటుందని తెలిసి కుమిలిపోతోందని తెలిపారు. మగాళ్లు మృగాళ్లలా ప్రవర్తిస్తారని చిన్నారి మనసులో ముద్రించుకుపోయిందని వివరించారు. ఇంతవరకూ నిందితుడిని అరెస్టు చేయకపోవడం ప్రభుత్వ వైఫల్యమేనని అన్నారు. ‘పేదల ప్రాణాలంటే ప్రభుత్వానికి లెక్కలేదు. ఇలాంటి ఘటన జరిగితే బాలికను పరామర్శించని చంద్రబాబు పెళ్లి వేడుకకు వెళ్లారు.
ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు భద్రత లేకుండా పోయింది. ఇందుకు బాధ్యత వహిస్తూ చంద్రబాబు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి. దాచేపల్లిలో ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే తునిలో టీడీపీ నాయకుడు ఒకరు బాలికపై అత్యాచారానికి యత్నించారు. ఎమ్మార్వో వనజాక్షిపై దాడి చేసిన చింతమనేనిపై చర్యలు లేవు. కాల్‌మనీ సెక్స్ రాకెట్‌లో ఉన్న టీడీపీ నేతలపై చర్యలు తీసుకోలేదు. మహిళా వ్యతిరేక నేరాల్లో ఐదుగురు టీడీపీ నాయకులు ఉన్నట్లు అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) రిపోర్టులో పేర్కొంది.
కేసుల్లో ఇరుక్కున్న నేతలకు పదవులు అప్పగిస్తూ చంద్రబాబు వారికి మద్దతుగా నిలుస్తున్నారు. చంద్రబాబుకు ఆడవాళ్లు ఉసురు కచ్చితంగా తగులుతుంది. ఒక ముఖ్యమంత్రి, డీజీపీ ఉన్న చోట ఈ ఘటనలు జరుగుతున్నాయి. ఈ ఘోరాలకు పాల్పడుతున్న వారిలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, వారి మద్దతుదారులే ఎక్కువ మంది ఉన్నారు. రాష్ట్ర డీజీపీ ఓ రబ్బరు స్టాంప్‌లా ప్రవర్తిస్తున్నారు. ఒక ముసలివాడు అమ్మాయిని గంటపాటు రేప్ చేసి వెళ్తుంటే మన పోలీసులు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నార’ని రోజా ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment