సార్వత్రిక ఎన్నికల్లో ఆరు దశలు దాటి ఏడో దశకు వచ్చేసరికి పరస్పర దూషణలు కాస్తా ప్రతీకార భాషగా రూపాంతరం చెందాయి. ‘మేం అధికారానికి రావడం ఖాయం. మీ సంగతి చూడటమే తరవాయి’ అన్నట్టు ప్రతివారూ మాట్లాడుతున్నారు. చిత్రమేమంటే వీరంతా అందుకోసం అన్నివిధాలా అప్రదిష్టపాలైన సీబీఐ బూచినే చూపిస్తున్నారు. అవతలివారిని బెదరగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. తాము అధికారంలోకొచ్చిన వెంటనే సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాను జైలుకు పంపుతామని మొదట్లో బీజేపీ నేత ఉమాభారతి చెప్పినప్పుడు ఆ పార్టీలోనే చాలామంది ఆమెను వారించారు. తమకు అలాంటి ఉద్దేశాలేమీ లేవని, అది ఆమె వ్యక్తిగత అభిప్రాయమని పార్టీ నేతలు సంజాయిషీ ఇచ్చారు. ఇప్పుడు ఆ పార్టీ ధోరణి కొంత మారింది.
చట్టం తన పని తాను చేసుకుపోతుందంటున్నారు. అధికార పీఠం ఇంకా చేతికందకుండానే పాలకుల భాష అలవడిందన్న మాట! తమకు ప్రతీకారేచ్ఛలేదని ఆమధ్య నరేంద్ర మోడీ కూడా చెప్పారు. కానీ, ఆయనే ఇటీవలే జామ్‌నగర్ సభలో మాట్లాడుతూ ‘మీరు అన్నిరకాలుగా నన్ను వేధిస్తున్నారు. ఇంకెంత... 20 రోజుల వ్యవధి ఉంది. అటు తర్వాత ప్రతీకారం తప్పదు’ అని మాట్లాడారు. ప్రతీకారం తీర్చుకోవడమంటే ఏమిటని అడిగితే ఆయన అందుకు వేరే భాష్యం చెప్పినా చెప్పవచ్చు. అలా అనడంలో తన ఉద్దేశమే వేరని అనవచ్చు. కానీ, ఇలాంటి మాటల వెనకుండే ఆంతర్యం ఏమిటన్నది ఎవరికీ తెలియనిది కాదు. మన రాష్ట్రంలో ఇది ఇంకొంచెం ముదిరింది. ఇలాంటి దూషణలు బాబు నోటివెంట అలవోకగా వెలువడుతున్నాయి. కేసీఆర్‌ను ఆయన దుర్మార్గుడు, అవినీతిపరుడు, సన్నాసి వంటి పదాలతో తూలనాడటమే కాదు...ఇలాంటి తిట్లు ఇంకెన్ని తిట్టినా తక్కువేనని సెలవిచ్చారు. సైకిల్‌తో తొక్కించి పచ్చడి పచ్చడి చేస్తానని హెచ్చరించారు. ఆయన కుటుంబం మొత్తాన్ని జైలుకు పంపుతానని బెదిరించారు. ఇలాంటి మాటలతో ఓటర్లను ఆకట్టుకోగలమని, ప్రత్యర్థుల్ని హడలెత్తించగలననుకుంటున్నారు గానీ, తన అంతరాంతరాల్లో గూడుకట్టుకుని ఉన్న హింసాప్రవృత్తిని బయటపెట్టుకుంటున్నానని గుర్తించడం లేదు.
గత పదేళ్ల పాలనలో ప్రత్యర్థులను వేధించడానికి సీబీఐని రెండు చేతలా వినియోగించుకున్న యూపీఏ సర్కారు దిగిపోయే క్షణాల్లో కూడా ఆ తరహా చేష్టలను కొనసాగించదల్చుకున్నది. అందువల్లే గుజరాత్‌లో ఒక మహిళపై నిఘా ఉంచిన ఉదంతంపై సిట్టింగ్ జడ్జితో కమిషన్ నియామకం కోసం పావులు కదుపుతున్నది. ఈ విషయంలో ఎన్నికల కోడ్‌కు ముందే కేంద్ర కేబినెట్‌లో స్థూలంగా నిర్ణయం తీసుకున్నందువల్ల తదుపరి చర్యకు ఎలాంటి ప్రతిబంధకాలూ ఉండవని భావిస్తోంది. కొత్తగా ఏర్పడబోయే ప్రభుత్వం ఈ విషయంలో మరో ముందడుగు వేయకతప్పని స్థితిని కల్పించాలని చూస్తోంది. గుర్తు తెలియని ఒక మహిళపై నరేంద్ర మోడీ నిఘా ఉంచారని, ఆమెను నీడలా వెన్నాడేందుకు పోలీసులను వినియోగించారని అభియోగం. ఒక మహిళ వ్యక్తిగత జీవితంలోకి తొంగిచూడటం, అందుకోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని వినియోగించడం క్షమార్హం కాని నేరమే. ఈ ఉదంతానికి బాధ్యులెవరైనా తగిన చర్యలు తీసుకోవాల్సిందే. కానీ, ఈ సంగతి రెండేళ్లక్రితమే వెల్లడైనా యూపీఏ సర్కారు ఉలుకూ పలుకూ లేకుండా ఉండిపోయింది. సార్వత్రిక ఎన్నికలు మరికొన్ని రోజుల్లో పూర్తికానుండగా ఇప్పుడు దాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఒక సీరియస్ అంశాన్ని తన చవకబారు ఎత్తుగడలతో పలచన చేస్తోంది.
యూపీఏ సర్కారు సీబీఐని ఇలాంటి పనులకు ఎడాపెడా వాడుకుంది. ఎన్నోసార్లు ఇది సరికాదని సుప్రీంకోర్టు మందలించినా ఈ వైఖరిలో అణుమాత్రమైనా మార్పురాలేదు. ఈమధ్యే సీబీఐ ఆధ్వర్యంలో ఒక సదస్సు జరిగినప్పుడు పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ, బీజేపీ నాయకుడు అరుణ్ జైట్లీ ఆ సంస్థ పనితీరును నిశితంగా విమర్శించారు. దాన్ని దుర్వినియోగం చేస్తున్న తీరును దుయ్యబట్టారు. స్వతంత్ర ప్రతిపత్తి కలిగివుంటూనే ప్రజలకు జవాబుదారీగా ఉండటం అవసరమని సూచించారు. సమాచార హక్కు చట్టం పరిధిలోకి తీసుకొస్తే ఆ సంస్థ పనితీరు మెరుగుపడవచ్చునని అభిప్రాయపడ్డారు. సీబీఐ డెరైక్టర్‌ను ప్రభుత్వమే ఎంపిక చేసే విధానంవల్ల ఆ సంస్థ అప్రదిష్టపాలవుతున్నదని అరుణ్‌జైట్లీ అన్నారుగానీ...తాము వస్తే ఈ వ్యవస్థను ఎలా ప్రక్షాళన చేస్తామన్నది ఆయన చెప్పలేదు. నరేంద్ర మోడీ తదితర నేతలు కూడా సీబీఐని యూపీఏ సర్కారు స్వీయ ప్రయోజనాలకోసం వినియోగించుకున్నదని విమర్శించడమే తప్ప తాము వస్తే అలా చేయబోమని చెప్పడంలేదు. పైగా ‘ప్రతీకార భాష’ మాట్లాడుతున్నారు.
కనుక ఆ సంస్థ ఒకరి నియంత్రణ నుంచి మరొకరి నియంత్రణలోకి వెళ్లడం మినహా మొత్తంగా పనితీరు మారదని దీన్నిబట్టి చూస్తే అర్ధమవుతుంది. సాధారణ సమయాల్లో ఎలాగూ కీలకమైన అంశాలపై చర్చ జరగడంలేదు. చట్టసభలు సైతం బలప్రదర్శన వేదికలుగా మారుతున్నాయి తప్ప ఆరోగ్యకరమైన చర్చలే జరగడంలేదు. కనీసం ఎన్నికల సమయంలోనైనా ఇలాంటి అంశాలపై చర్చ జరుగుతుందనుకుంటే పరస్పర దూషణలు తప్ప మరేమీ ఉండటంలేదు. ఆ దూషణలు కాస్తా ఇప్పుడు ప్రతీకార స్థాయికి చేరాయి. ఇలాంటి ధోరణులు మంచిదికాదని అన్ని పక్షాలూ గ్రహించాలి. హుందాతనంతో వ్యవహరించాలి. సంయమనం పాటించాలి. తమ మాటలైనా, చేతలైనా మంచి ప్రమాణాలను నెలకొల్పేందుకు దోహదపడాలని గుర్తించాలి.
ప్రతీకార’ భాష!
Published Wed, Apr 30 2014 12:13 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement
Advertisement