సీబీఐకి పరీక్షాసమయం | exam time for cbi, editorial | Sakshi
Sakshi News home page

సీబీఐకి పరీక్షాసమయం

Published Thu, Jan 26 2017 12:42 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM

సీబీఐకి పరీక్షాసమయం - Sakshi

సీబీఐకి పరీక్షాసమయం

చేసిన తప్పులు శాపాలై వెంటాడతాయని సీబీఐ మాజీ డైరెక్టర్‌ రంజిత్‌సిన్హాకు ఆలస్యంగా అర్ధమై ఉంటుంది. బొగ్గు కుంభకోణం దర్యాప్తును రంజిత్‌ ప్రభావితం చేయడానికి ప్రయత్నించారన్న అభియోగాన్ని పరిగణనలోకి తీసుకున్న సుప్రీం కోర్టు ఆయనపై పాత్రపై దర్యాప్తు చేయాలని సీబీఐని ఆదేశించడం ఆ సంస్థకు, ప్రత్యేకించి కొత్తగా దాని సారథ్య బాధ్యతలు స్వీకరించిన అలోక్‌ కుమార్‌ వర్మకు అగ్నిపరీక్షలాంటిది. గత కొన్నేళ్లుగా సీబీఐ తీరుతెన్నులు ప్రజాస్వామికవాదుల్ని కలవరపరుస్తున్నాయి. అది పాలకుల చేతిలో పనిముట్టుగా మారిందని సాక్షాత్తూ సుప్రీంకోర్టే వ్యాఖ్యానించినా, సక్రమంగా వ్యవహరించాలని హెచ్చరించినా దానిలో మార్పు రాలేదు. దేశంలోని దర్యాప్తు సంస్థలన్నిటికీ తలమానికంగా ఉండాల్సిన ఆ సంస్థ పాలకుల చేతిలో కీలుబొమ్మ అయింది. దేశాన్ని పట్టి కుదిపిన లక్షా 86 వేల కోట్ల రూపాయల బొగ్గు కుంభకోణాన్ని దర్యాప్తు చేయమని సర్వో న్నత న్యాయస్థానం ఆదేశిస్తే... ఆ దర్యాప్తు క్రమాన్నే కుంభకోణంగా మార్చిన ఘనత సీబీఐదే!

బొగ్గు కుంభకోణంలో సుప్రీంకోర్టుకు ఎప్పటికప్పుడు అందించాల్సిన పురో గతి నివేదికలను అంతకన్నా ముందు నిందపడినవారికే చూపుతున్నదని మీడియా వెల్లడించినప్పుడు అందరూ నిర్ఘాంతపోయారు. అందులో ఆవగింజంత నిజం కూడా లేదని వాదిస్తూ వచ్చిన సీబీఐ తీరా ఆ మాటే అఫిడవిట్‌ రూపంలో ఇవ్వా లని సుప్రీంకోర్టు ఆదేశించాక లొంగివచ్చింది. ‘చూపించడం నిజమే...ఇకపై ఆ పని చేయబోమని రంజిత్‌సిన్హా అంగీకరించాల్సి వచ్చింది. ఆ చూపినవేమిటో కాస్త వివ రించమని నిలదీశాక పరువు బజారున పడింది. ఫలానా అఫిడవిట్‌లో ఫలానా వాక్యాలు మారాయని సీబీఐ ఇచ్చిన జాబితాను అధ్యయనం చేశాక నివేదిక మౌలిక స్వరూపమే మారిపోయిందని న్యాయమూర్తులు నిర్ధారణకొచ్చారు.

ఇదింకా చల్లా రకముందే సీబీఐ విశ్వసనీయతనూ, ప్రత్యేకించి రంజిత్‌సిన్హా వ్యక్తిత్వాన్ని ప్రశ్నా ర్ధకం చేసే మరో కథనం వెలుగులోకొచ్చింది. వివిధ కుంభకోణాల్లో నిందితులుగా ఉన్నవారు ఆయనను వచ్చి కలుస్తున్నారని ప్రశాంత్‌భూషణ్‌ నేతృత్వంలోని కామన్‌ కాజ్‌ సంస్థ సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేసింది. అదంతా అబద్ధమని, తన ఇంటి వద్ద ఉంచే లాగ్‌ బుక్‌లో గుర్తు తెలియని వ్యక్తులు కావాలని కొందరి పేర్లు చేర్చారని మొదట్లో కొట్టిపారేసిన సిన్హా, ‘అలా కలిస్తే తప్పేముంది... నా ఇంటి తలుపులు ఎవరికైనా తెరిచే ఉంటాయ’ని చెప్పేవరకూ వచ్చారు. పైగా ఆ వచ్చినవారు కేసుల్లో నిందితులైతే కావొచ్చు... అంతకన్నా ముందు వారు నా స్నేహితులు అని అడ్డగోలు వాదన మొదలుపెట్టారు. ఇప్పుడు ఆ అంశంలోనే సుప్రీంకోర్టు రంజిత్‌సిన్హాపై దర్యాప్తునకు ఆదేశించింది.
 
సీబీఐ స్థాయి అత్యున్నత సంస్థకు సారథ్యం వహించిన మాజీ డైరెక్టర్‌పై కేసు పెట్టి దర్యాప్తు జరపాలనడం దేశ చరిత్రలో ఇది తొలిసారి. ఇది ప్రస్తుత డైరెక్టర్‌ అలోక్‌ కుమార్‌ వర్మకు వ్యక్తిగతంగా కూడా పెద్ద సవాలే. ఎందుకంటే ఆ దర్యా ప్తునకు నేతృత్వం వహించాల్సింది ఆయనే. అయితే ఉన్నంతలో సుప్రీంకోర్టు సీబీఐ పరువు నిలిపినట్టే. ఎందుకంటే ఈ దర్యాప్తును మరో సంస్థకు అప్పజెప్పి ఉంటే సీబీఐకి అదో మచ్చగా మిగిలిపోయేది. సర్వోన్నత న్యాయస్థానం దాన్ని విశ్వ సించడం లేదన్న సందేశం వెళ్తే ఆ సంస్థ గౌరవ ప్రతిష్టలకు భంగం వాటిల్లేది. తన మాజీ డైరెక్టర్‌పై వచ్చిన ఆరోపణల విషయంలో సీబీఐ నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయకపోవచ్చునన్న సందేహాలను కొట్టిపారేస్తూ సారథి మారారు గనుక సంస్థపై తమకు నమ్మకమున్నదని న్యాయమూర్తులు చెప్పారు. దాన్ని సీబీఐ నిలబెట్టుకోగ లుగుతుందా? ఇది ఆ సంస్థకు జీవన్మరణ సమస్య. సిన్హా తప్పు చేశారని న్యాయ మూర్తులు ప్రాథమికంగా నిర్ధారణకొచ్చారు. ఆ విషయంలో మరింత కూలంక షంగా దర్యాప్తు జరపాలని భావించారు.

నిజానికి రంజిత్‌సిన్హా నియామకం సమ యంలోనే అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ప్రధాని, విపక్ష నేత తదితరులుండే కమిటీ ద్వారానే అత్యున్నత స్థాయి సంస్థల సారథులను ఎంపిక చేయాలన్న ప్రతి పాదన రూపుదిద్దుకుంటున్న సమయంలోనే ఆనాటి యూపీఏ ప్రభుత్వం హడా వుడిగా రంజిత్‌ నియామకాన్ని పూర్తి చేసింది. సీబీఐని అధికారంలో ఉన్నవారు పంజరంలో చిలుకగా మార్చారని సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను ఆసరా చేసుకుని తనకు విస్తృత అధికారాలు రావడం కోసం ఆయన చాలా ప్రయత్నాలు చేశారు. సంస్థ డైరెక్టర్‌కు సంపూర్ణ అధికారాలిస్తే తప్ప సమర్ధవంతంగా పనిచేయడం సాధ్యపడదని సుప్రీంకోర్టు ముందు దాఖలు చేసిన అఫిడవిట్‌లో చెప్పారు. అలా చెప్పిన వ్యక్తి అందుకు తగ్గట్టు ఉన్నత వ్యక్తిత్వాన్ని కనబరిస్తే, విశ్వసనీయతను సాధించే విధంగా ప్రవర్తిస్తే వేరుగా ఉండేది. కానీ సిన్హా పనితీరు అడుగడుగునా సందేహాలనే మిగిల్చింది.

అయితే ఇది కేవలం సీబీఐకి, రంజిత్‌సిన్హాకు మాత్రమే సంబంధించిన, పరిమితమైన సమస్య కాదు. దేశంలో దాదాపు అన్ని సంస్థల పనితీరు అలాగే ఉంటున్నది. వాటి సారథులు ఆ సంస్థల పరువు ప్రతిష్టలను దిగజారుస్తున్నారు. నిజానికి అలాంటి ‘సమర్థత’ ఉన్నవారికే ఉన్నత పదవులొస్తున్నాయి. అవార్డులు, రివార్డులు లభిస్తున్నాయి. ఈ ధోరణిని ఆపాలంటే ఎక్కడో ఒకచోట కఠినంగా వ్యవహరించక తప్పదు. నిర్దిష్టమైన ఆరోపణలు వచ్చినప్పుడు చర్యలు తీసుకోక తప్పదు. 2జీ స్పెక్ట్రమ్‌ కుంభకోణమైనా, బొగ్గు కుంభకోణమైనా స్వయంగా సుప్రీం కోర్టే పర్యవేక్షించిన కేసులు.

కనీసం అందుకోసమైనా జాగ్రత్తగా వ్యవహరించాలని, నింద పడకుండా చూసుకోవాలని సీబీఐగానీ, రంజిత్‌సిన్హాగానీ అనుకోలేదు. పాలకుల కటాక్షవీక్షణాలుంటే తమకేమీ కాదన్న భరోసాయే దీనికి కారణం. ప్రస్తుతం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు అలాంటి మనస్తత్వం ఉన్నవారిలో నిస్సం దేహంగా పరివర్తన తీసుకొస్తాయి. ప్రజాస్వామ్యంలో తాము ఎవరికి జవాబు దారీగా ఉండాలో, తమ విధులను ఎంత జాగ్రత్తగా నిర్వహించాలో గ్రహించేలా చేస్తాయి. ఇప్పుడు సర్వోన్నత న్యాయస్థానం తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత సీబీఐదే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement