సీబీఐ డెరైక్టర్ రంజిత్‌సిన్హా నివాసంలోని లాగ్ బుక్‌ను బయటపెట్టిన వ్యక్తుల వివరాలివ్వాలంటూ కొన్నిరోజులక్రితం ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు పునరాలోచన చేయడం అవినీతి, అక్రమాలను వెల్లడించేందుకు ముందుకొచ్చేవారికి ఊరటనిస్తుంది. సిన్హాను కలిసిన ప్రముఖుల్లో 2జీ స్కాం మొదలుకొని అనేక కేసుల్లో కీలక నిందితులైనవారున్నారు. వీరి వివరాలన్నీ సిన్హా ఇంటివద్ద నిర్వహిస్తున్న లాగ్‌బుక్‌లో నమోదై ఉన్నాయి. ఒకపక్క సీబీఐకి ఇవ్వాల్సిన స్వయం ప్రతిపత్తి, దానికి ఉండాల్సిన జవాబుదారీతనంపై చర్చ నడుస్తుంటే రంజిత్ సిన్హా ఇలా నిందితులుగా ఉన్నవారితో సమావేశంకావడం దిగ్భ్రాంతిపరిచింది. ఈ విషయంలో నిజానిజాలు తేలేవరకూ కీలక కేసుల దర్యాప్తు బాధ్యతలనుంచి సిన్హాను తప్పించాలని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌భూషణ్ సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు. పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తులు... ఈ సమాచారం ఎవరిచ్చారో తమకు సీల్డ్ కవర్‌లో అందజేయాలని ఆదేశించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. సాధారణంగా అవినీతి, అక్రమాలు జరిగాయని తమ దృష్టికొచ్చినప్పుడు దర్యాప్తునకు ఆదేశించడం తప్ప అందుకు సంబంధించిన నిర్దిష్ట సమాచారం పిటిషనర్లకు ఎలా వచ్చిందన్న లోతుల్లోకి న్యాయస్థానాలు వెళ్లవు. వారు లేవనెత్తిన అంశాల్లో నిజానిజాలేమిటో పరిశీలిస్తాయంతే. అయితే, రంజిత్‌సిన్హా కలిసినవారి విషయంలో ఇలా ఆదేశించడానికి ఒక కారణం ఉంది.
సిన్హా ఇంటివద్ద సందర్శకుల వివరాలను నమోదుచేసే లాగ్‌బుక్ ఉన్నమాట వాస్తవమే అయినా... న్యాయస్థానానికి సమర్పించిన జిరాక్స్ కాపీలోని కొన్ని పేజీలు అందులోనివి కాదని ఆయన తరఫు న్యాయవాది ఆరోపిస్తు న్నారు. సిన్హాను అప్రదిష్టపాలు చేసేందుకు కొందరు నిందితుల పేర్లను కావాలని చేర్చి ఈ పేజీలను సృష్టించారని ఆయన వాదన. ఈ క్రమంలో అసలు ఈ జాబితా మీకు ఎవరి ద్వారా వచ్చిందో చెప్పాలని ప్రశాంత్ భూషణ్‌నూ, ఆయనతో పాటు పిటిషన్ దాఖలు చేసిన మరో స్వచ్ఛంద సంస్థనూ న్యాయమూర్తులు ఆదేశించారు.
ఏదైనా సంస్థలోనో, ప్రభుత్వంలోనో అక్రమాలు జరిగాయని సమాచారం ఇచ్చేవారు నూటికి నూరుపాళ్లూ నిజాయితీపరులే కానక్కరలేదు. అక్రమాలకు పాల్పడుతున్న వ్యక్తులు తమకు వ్యతిరేకులు కావడంవల్ల కావొచ్చు, ఆ అక్రమాల్లో తమకు దక్కాల్సిన వాటా దక్కడంలేదని కావొచ్చు, తమకు రావల్సింది మరొకరు తన్నుకు పోయారన్న దుగ్ధ కావొచ్చు...ఏదో ఒక కారణంతో అందుకు సంబంధించిన సమాచారాన్ని బయటివారికి వెల్లడించేవారుంటారు. కామన్వెల్త్ స్కాం అయినా, మరొకటైనా లోకానికి వెల్లడైంది ఈ విధంగానే. ఇలాంటి కుంభకోణాల్లో తీగలాగితే డొంకంతా కదులుతుంది. దర్యాప్తు ఊహించని మలుపులు తీసుకుంటుంది. ఇప్పుడు రంజిత్‌సిన్హా నివాసగృహానికి సంబంధించిన లాగ్‌బుక్‌లోని పేజీలుగా చెబుతున్నవి కూడా ఆ విధంగా బయటపడినవే. గుజరాత్‌లో జరిగిన ఇష్రాత్ జహాన్ ఎన్‌కౌంటర్ కేసులో తమను ఇబ్బందులు పెడుతున్న సిన్హాను ఇరుకున పెట్టేందుకు ఇంటెలిజెన్స్ బ్యూరో వలపన్ని ఈ లాగ్‌బుక్ వ్యవహారాన్ని బయటకు లాగిందని ఆరోపిస్తున్నవారూ ఉన్నారు. పనిలోపనిగా కేసును ‘బలంగా’ మార్చేందుకు కొన్ని బోగస్ ఎంట్రీలను కూడా చేర్చిందని వారంటున్నారు. ఇందులో నిజానిజాలు ఏమైనప్పటికీ సిన్హాను వివిధ కేసుల్లో నిందితులుగా ఉన్నవారు కలిసిన మాట వాస్తవం. ఆ సంగతి ఆయనే అంగీకరించారు. అందువల్ల ఆయా కేసుల్లో సీబీఐ వైఖరేమైనా మారిందా అని ఆయన ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ సమస్య వైఖరి మారిందా, లేదా అని కాదు... అసలు తాము దర్యాప్తు చేస్తున్న కేసుల్లోని నిందితులను కలవడం నైతికంగా సమర్ధనీయమేనా అన్నది కీలకం. ఆ సంగతిని రంజిత్‌సిన్హా ఆలోచించాలి. తాము నిష్పక్షపాతంగా ఉన్నామని చెప్పడమే కాదు... వారలా ఉంటున్నారని అందరికీ అన్పించాలి. సీబీఐ ఏ కేసు విషయంలో ఏం చేస్తున్నదో, ఎలా మాట మారుస్తున్నదో తెలుసుకోవడం సామా న్యులకు సాధ్యం కాదు. వారికి తెలిసినదల్లా నిందితులుగా ఉన్నవారితో కేసు దర్యాప్తు చేస్తున్నవారు చెట్టపట్టాలేసుకుని తిరగకూడదన్నదే. ఈ చిన్న విషయం సిన్హాకు అర్ధంకావడంలేదు.
ఇప్పుడు లాగ్‌బుక్ వ్యవహారంలో తాను లోగడ ఇచ్చిన ఆదేశాల విషయంలో సుప్రీంకోర్టు పునరాలోచన చేస్తున్నదని ధర్మాసనం తాజా వ్యాఖ్యలు చూస్తే అర్ధమవుతుంది. కీలక సమాచారం అందించేవారికి రక్షణ లేకపోతే ఏ కుంభకోణమూ వెల్లడికాదు. పాలనలో పారదర్శకత కోసం దాదాపు పదేళ్లకిందట మనకు సమాచార హక్కు చట్టం వచ్చింది. ప్రభుత్వాల నిర్ణయ ప్రక్రియలో చోటు చేసుకుంటున్న అవినీతి, అక్రమాలను బయటపెట్టేందుకు ఈ చట్టం వీలు కల్పిస్తున్నది. అయితే, దీనికి అనుబంధంగా అవినీతి, అక్రమాలపై పోరాడేవారికి రక్షణ కల్పించే చట్టాన్ని కూడా తీసుకొస్తే సమాచార హక్కు చట్టం మరింత సార్థకమ య్యేది. అయితే, ఆ చట్టం తీసుకురావడంలో మన పాలకులు విఫలమ య్యారు. ఇప్పుడు సిన్హా ప్రశాంత్‌భూషణ్ వెల్లడించిన జాబితాలోని పేర్లు అన్నీ బోగస్ అనడంలేదు. అందులో కొన్ని మాత్రమే తప్పుల తడక అంటున్నారు. కనుక సిన్హాను కలిసిన నిందితులెవరో, అలా కలవడంలోని హేతుబద్ధతేమిటో తేల్చడమే సరైంది. ఇప్పుడు కేసు ఆ దిశగా సాగే సూచనలు కనిపిస్తున్నాయి. రంజిత్‌సిన్హా స్వయంప్రతిపత్తి కోసం పాకులాడుతున్నారు తప్ప జవాబుదారితనానికి సిద్ధపడటంలేదని ఆయన మాటల్నిబట్టి చూస్తే అర్ధమవుతున్నది. ఈ స్థితిలో ప్రస్తుత కేసు విచారణ సీబీఐ ప్రక్షాళనకు దోహదపడితే దేశానికి ఎంతో మేలు కలుగు తుంది. ఆ సంస్థకు సారథ్యంవహిస్తున్నవారితోసహా ఎవరూ దాన్ని దుర్వినియోగం చేయడానికి ఆస్కారం ఉండదు.
సీబీఐ ప్రక్షాళనకు మార్గం!
Published Tue, Sep 23 2014 11:46 PM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement