సంపాదకీయం
దేశ రాజధాని నగరం ఢిల్లీలో ప్రభుత్వాన్ని ప్రతిష్టించడం కోసం వారంరోజులుగా సాగుతున్న డ్రామాకు సుప్రీంకోర్టు తాజా ఉత్తర్వులతో తాత్కాలిక విరామం ఏర్పడింది. అక్కడ ఏర్పడిన రాజకీయ ప్రతిష్టంభన పరిష్కారానికి ఏం చేయదల్చుకున్నదీ వచ్చే నెల 10లోగా చెప్పాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. నిరుడు నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలుచుకున్నా ప్రభుత్వం ఏర్పాటుకు విముఖత ప్రకటించిన బీజేపీ ఇప్పుడు అందుకోసం తహతహలాడుతున్నది. ఏ పార్టీకైనా అధికారమే పరమావధి గనుక ఈ విషయంలో బీజేపీని తప్పుబట్టవలసిన అవసరం లేదు. కానీ, అందుకు లెక్కలన్నీ సహకరించాలని, ఎంచుకున్న తోవ కూడా సరి అయినదై ఉండాలని ఆ పార్టీ మరిచిపోయినట్టు కనబడుతున్నది. తమ ఎమ్మెల్యేలను భారీయెత్తున కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని ఇన్నాళ్లూ ఆరోపిస్తూ వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అందుకు సాక్ష్యంగా ఒక వీడియోను కూడా బయటపెట్టింది. అందులోని నిజానిజాల సంగతి ఇంకా తేలవలసే ఉన్నా సర్కారు ఏర్పాటు విషయంలో బీజేపీ ప్రదర్శిస్తున్న ధీమా, తొందర ఆ ఆరోపణలు నిజమేమోనన్న అభిప్రాయాన్ని కలగజేస్తున్నాయి. ఢిల్లీ అసెంబ్లీలోని 70 స్థానాల్లో బీజేపీకి 31, దాని మిత్రపక్షమైన అకాలీదళ్‌కు ఒకటి లభించాయి. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి 28, కాంగ్రెస్‌కు 8 వచ్చాయి. జేడీ(యూ), ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు ఇద్దరున్నారు. వీరిద్దరి మద్దతూ పొందగలిగినా బీజేపీకి అధికారం అసాధ్యమని ఈ లెక్కలనుబట్టి సులభంగానే తెలుస్తుంది. పైగా బీజేపీ ఎమ్మెల్యేల్లో ముగ్గురు మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీలుగా ఎన్నికయ్యారు. పర్యవసానంగా బీజేపీ బలం ఇప్పుడు 29కి చేరుకుంది. ఎన్నికైన ఆరునెలల్లోగా ఏదో ఒక సభ్యత్వాన్ని వదులుకోవాలన్న నిబంధన ఉన్నది గనుక ఆ ముగ్గురి ఓట్లూ వచ్చే నవంబరు వరకూ బీజేపీకి అక్కరకొచ్చే అవకాశం లేకపోలేదు. అలా చూసుకున్నా ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలను ‘కొనడం’ ఆ పార్టీకి తప్పనిసరి. ఆప్ ఆరోపణలూ, అందుకు ఆ పార్టీ చూపుతున్న సాక్ష్యాధారాలూ నిజం కాదని దబాయించినా ప్రభుత్వం ఏర్పాటు ఎలా సాధ్యమనుకుంటున్నదో, ఏ బలం చూసుకుని అందుకోసం ప్రయత్నిస్తున్నదో బీజేపీ చెప్పాలి.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు ప్రధానంగా రెండు సమస్యలు ముందుకొచ్చాయి. అందులో శాంతిభద్రతలు, మరీ ముఖ్యంగా మహిళల భద్రత మొదటిది కాగా... రెండోది మౌలిక సదుపాయాల లేమి. మహిళలపై పెరిగిపోయిన లైంగిక నేరాలు, తరచు జరుగుతున్న హత్యలు, దోపిడీలు అక్కడి ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. అలాగే, దేశం నలుమూలల నుంచీ ఉపాధి కోసమని ఢిల్లీకి వలస వస్తున్నవారితో అక్కడి జనాభా విపరీతంగా పెరిగిపోయింది. ఇంత మందికి అవసరమైన మంచినీళ్లు, విద్యుత్తు, పారిశుద్ధ్యం వంటి కనీస సదుపాయాలు కల్పించలేక ఢిల్లీ ప్రభుత్వం సతమతమవుతున్నది. తమను ఎన్నుకుంటే ఈ రెండు ప్రధాన సమస్యలతోపాటు మరికొన్ని సమస్యలను పరిష్కరించగలమని ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలతో పాటు ఆప్ కూడా హామీ ఇచ్చింది. మొదట్లో సర్కారు ఏర్పాటుకు అరవింద్ కేజ్రీవాల్ ససేమిరా అన్నా చివరకు కాంగ్రెస్ మద్దతుతో అధికారంలోకొచ్చారు. రెండునెలలైనా గడవకుండానే ఆయన రాజీనామా చేశారు. ఆ స్వల్ప వ్యవధిలో కేజ్రీవాల్ ప్రతి కుటుంబానికీ రోజూ 667 లీటర్ల ఉచిత మంచినీరు ఇవ్వడం దగ్గరనుంచి అవినీతిపై హెల్ప్‌లైన్ ప్రారంభించడం వరకూ కొన్ని హామీలు అమల్లో పెట్టారు. గత ఫిబ్రవరిలో ఆప్ ప్రభుత్వం రాజీనామా చేశాక ఇంతవరకూ అసెంబ్లీ సుప్తచేతనా వస్థలోనే ఉన్నది. ప్రజా ప్రభుత్వం లేని కారణంగా సమస్యలన్నీ అపరిష్కృతంగా ఉన్నాయి. వీటిని ఎవరికి చెప్పుకోవాలో తెలియక సామాన్యులు సతమతమవుతున్నారు. ఆ సమస్యలు తీరడం మాట అటుంచి ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటే ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది.
నిజానికి ఇది పెద్ద సమస్యగా మారాల్సిన అవసరం లేదు. ఉన్నంతలో అధిక సంఖ్యాబలం ఉన్న బీజేపీ, ఆప్‌లు రెండూ సర్కారు ఏర్పాటు తమవల్ల కాదని మరోసారి చెబితే సరిపోతుంది. వాస్తవానికి బీజేపీ మొదట్లోనే ఈ మాట చెప్పగా, అనంతర కాలంలో ఆప్ సైతం ఇదే వైఖరి తీసుకుంది. అలాంటపుడు అసెంబ్లీని ఆర్నెల్లుగా సుప్తచేతనావస్థలో ఉంచాల్సిన అవసరమేమిటో అర్ధంకాదు. ఎలాంటి రాజకీయ ఉద్దేశాలూ లేనపుడు, నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించదల్చుకున్నప్పుడు అసెంబ్లీ రద్దుకు సిఫార్సుచేయడం తప్ప ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నవాబ్ జంగ్‌కు మరో ప్రత్యామ్నాయం లేదు. కానీ, ఆయన ఆ పని చేయడానికి సిద్ధంగా లేరు సరిగదా ‘సుస్థిర ప్రభుత్వం’ ఏర్పాటుకు బీజేపీకి అవకాశం ఇవ్వడానికి అనుమతించాల్సిందిగా రాష్ట్రపతికి లేఖ రాశారు. అటు ఆయన లేఖ రాయడం, ఇటు తామే ప్రభుత్వం ఏర్పాటుచేయబోతున్నట్టు బీజేపీ హడావుడి చేయడం పర్యవసానంగానే ఎమ్మెల్యేల బేరసారాలపై ఆరోపణలు గుప్పుమన్నాయి. కేంద్రంలో తమ పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే అధికారంలో ఉన్నది గనుక ఢిల్లీలో అధికారాన్ని చేజిక్కించుకో వడం, దాన్ని అవసరమనుకున్నంత కాలమూ నిలబెట్టుకోవడం సులభమని బీజేపీ అనుకొని ఉండొచ్చు. దేశాన్నేలుతూ దేశ రాజధాని నగరంలో తమ సర్కారు లేకపోవడం నామర్దాగా ఆ పార్టీ భావించి ఉండొచ్చు. కానీ, అందుకోసం అడ్డదారులు తొక్కడంవల్ల అంతకన్నా ఎక్కువ నష్టం కలుగుతుందని బీజేపీ గుర్తించాలి. మరీ ముఖ్యంగా మరికొన్ని నెలల్లో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇలాంటి చర్యలు బెడిసికొడతాయని గమనించాలి.