పొలిటికల్‌ CO2 | Huzurabad bypoll Political Scenario Editorial By Vardhelli Murali | Sakshi
Sakshi News home page

పొలిటికల్‌ CO2

Published Sun, Oct 31 2021 12:53 AM | Last Updated on Sun, Oct 31 2021 10:52 AM

Huzurabad bypoll Political Scenario Editorial By Vardhelli Murali - Sakshi

స్కాట్లాండ్‌ పేరు చెప్పగానే ఎక్కువమందికి టక్కున గుర్తుకొచ్చేది స్కాచ్‌ మద్యం. చాలా తక్కువమందికి ఈరోజు గ్లాస్గో అనే పట్టణం పేరు గుర్తుకొస్తుంది. పుడమి తల్లి పది కాలాల పాటు పచ్చగా బతకాలని కోరుకునేవాళ్లు, అందుకోసం ఉడతాభక్తి సాయమందించేందుకు సిద్ధపడేవాళ్లు ఆ తక్కువ మందిలో ఉంటారు. మానవుడు చిరంజీవిగా వర్ధిల్లాలని ఆశ పడేవాళ్లు, విశ్వాంతరాళమంతటా విస్తరించాలని కలలు గనే వాళ్లూ ఆ తక్కువమందిలో ఉంటారు. ఆ గ్లాస్గో పట్టణంలో ఈరోజు వాతావరణ సమస్యలపై భాగస్వామ్య పక్షాల సదస్సు (కాప్‌) ప్రారంభమవుతున్నది.

పారిశ్రామిక విప్లవం తర్వాత కర్బన ఉద్గారాలను విచ్చల విడిగా ప్రకృతిలోకి వెదజల్లుతున్నందు వలన భూమాత ఉష్ణోగ్రమవుతున్నది. ఈ పరిణామం ఇంకా కొంతకాలం కొనసాగితే ఒక మహావిలయానికి మన కువలయం బలికావచ్చును. మరో పది పన్నెండు తరాల తర్వాత మనుష్యజాతి అంతరించిపోయే ప్రమాదం పొంచి ఉన్నది. ఈ ప్రమాదాన్ని నివారించవచ్చన్న మేలుకొలుపే ‘కాప్‌’ సదస్సుకు ప్రాతిపదిక. ప్రమాదం అంచుకు భూగోళాన్ని నెట్టిన పాపం మాత్రం సంపన్న దేశాలదే! ఆ దేశాల్లోని బడా సంపన్నులదే! సంపద సృష్టి అనే అందమైన పేరుతో వీరు సాగించిన ప్రకృతి వేట వికృతరూపం దాల్చిన ఫలితమే – ఈ భూతాపం.

జనబాహుళ్యంలో ఒక జానపద కథ ప్రచారంలో ఉన్నది. ఒక పాత్రలో తైలాన్ని తీసుకొని ఒక బాలిక వీధిగుండా వెళు తున్నదట. ఇంతలో ఆ పాత్ర జారిపడి తైలమంతా భూమిలోకి ఇంకిపోతుంది. ఇంటికి వెళితే తల్లి దండిస్తుందని ఆ బాలిక విలపిస్తున్నదట. అటుగా వెళ్తున్న కర్ణుడికి ఈ దృశ్యం కనిపించింది. ఆ బాలికను ఊరడించడంకోసం తైలం ఒలికిన ప్రదేశంలోని మట్టిని పిడికిట్లోకి తీసుకొని గట్టిగా పిండి, మళ్లీ ఆ పాత్రలో తైలం నింపాడట. అప్పుడు భూదేవి ఆగ్రహించింది. ‘ఓయీ కర్ణా! నాలో ఇంకిన చమురును పిండి నా శరీరాన్ని కష్టపెట్టావు. నీ జీవితంలోని కీలక యుద్ధ సమయంలో నీ రథచక్రం కూడా నాలో దిగబడిపోతుంది. అదే నీ చావుకు కారణమవుతుంద’ని శపించింది. పిడికెడు మట్టిని పిండితేనే అప్పుడు భూదేవి శపించింది. ఇప్పుడు భూగర్భంలోకి చొరబడి శిలాజాలను మండించి చమురు వాయువులను పిండుకుంటున్నప్పుడు, తివిరి ఇసు మున తైలమును తీస్తున్నప్పుడు, అడవుల్ని, కొండల్ని కరెన్సీ లోకి మారకం చేస్తున్నప్పుడు శపించకుండా ఉంటుందా? పలు మార్లు శపించి ఉంటుంది. ఆ శాపాలకు విమోచన మార్గాలను అన్వేషించడమే ఇప్పుడు జరుగుతున్న ‘కాప్‌’ సదస్సు పని!

దేశాలనూ – వాటి విదేశాంగ విధానాలనూ, ప్రభుత్వా లనూ – వాటి ప్రాధాన్యాలనూ బడా సంపన్నులే నిర్దేశిస్తున్న నేపథ్యంలో ఈ ‘కాప్‌’ సదస్సు ఏమైనా సాధిస్తుందా లేక కాకి గోలగా మిగిలిపోతుందా అనే అనుమానాలు కూడా లేక పోలేదు. మీడియాతో సహా అనేక వ్యవస్థల మీద ‘మిగులు ధనం’ పట్టు బిగిస్తున్నది. ఫలితంగానే పర్యావరణం వంటి ప్రాణప్రదమైన అంశాల మీద జన చేతన జ్వలించడం లేదు. పర్యావరణాన్ని ధ్వంసం చేసి సంపాదించిన డబ్బు ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని కూడా చెరబట్టిన దృశ్యం స్పష్టంగా కనిపిస్తున్నది. ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా దిగజారుతున్న క్రమం మన కళ్లముందున్నది.

వావిలాల గోపాలకృష్ణయ్య వరుసగా నాలుగుసార్లు శాసన సభ్యునిగా ఎన్నికయ్యారు. సత్తెనపల్లి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడూ, ఆ తర్వాత కూడా ఆయనకు ఒంటి మీద ఒక ముతక ఖద్దరు లాల్చీ, పంచె, భుజం మీద ముతక కండువా, చేతిలో గుడ్డ సంచీ, అందులో కొన్ని కాగితాలు. అంతే! ఆయనలో ఏ మార్పూ రాలేదు. పైసా ఖర్చు పెట్టకున్నా జనం ఆయనకు ఓట్లే శారు. గెలిపించారు. మొదటి నాలుగు ఎన్నికల్లో సూర్యాపేట ఎమ్మెల్యేగా ఉప్పల మల్సూర్‌ గెలిచారు. ఎమ్మెల్యేగా తనకొచ్చే జీతభత్యాలను పార్టీకే ఇచ్చేవారు. తన కనీస అవసరాలకోసం పార్టీ ఇచ్చే డబ్బుతోనే గడిపేవారు.

(అప్పట్లో కమ్యూనిస్టు ఎమ్మెల్యేలందరికీ ఈ నియమం ఉండేది). ఇరవయ్యేళ్ల తర్వాత ఉదర పోషణార్థం ఆయన చేతనైనంతకాలం చెప్పులు కుట్టు కుంటూ గడిపారు. ఓట్లకోసం ఆయనగానీ, ఆయన పార్టీగానీ ఏనాడూ ఒక్క రూపాయి ఖర్చుపెట్టింది లేదు. మొదటి ఐదారు శాసనసభలకు సంబంధించి ఇటువంటి ఉదాహరణలు ఎన్న యినా ఇవ్వవచ్చు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే పర్యటన కోసం బయల్దేరాడంటే అదొక ధనబీభత్స దృశ్యమే. అదుపు తప్పిన మదపుటేనుగు రోడ్డు మీద పడ్డట్టే! ప్రస్తుత లోక్‌సభకు ఎన్నికైన 533 మంది సభ్యుల్లో 475 మంది కోటీశ్వరులు. ఇది వారు సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా నిర్ధారించిన సంఖ్య. 88 శాతం మంది కోటీశ్వరులతో నిండి వున్న మన పార్లమెంట్‌ ప్రజాస్వామ్యానికి ప్రాతినిధ్యం వహిస్తున్నదా లేక ధనస్వామ్యా నికా? తేల్చవలసి ఉన్నది.

సంఘసేవకులు, లాయర్లు, డాక్టర్లు, టీచర్లు, మేధావులు చట్టసభల్లో పలచబడుతున్నారు. వ్యాపారులు చిక్కబడుతున్నారు. ఇప్పుడు పార్లమెంట్‌ కానీ, అసెంబ్లీలు కానీ.. ఎక్కడైనా వ్యాపారులూ, కాంట్రాక్టర్లదే హవా! ఎందుకంటే వాళ్లు ఓట్లను కొనుగోలు చేయగలుగుతారు. అందుకని రాజకీయ పార్టీలు వారిని చేరదీస్తున్నాయి. వారి కరెన్సీ నోట్ల కట్టల నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి కర్బన ఉద్గా రాలు వెలువడుతున్నాయి. బొగ్గు పులుసు వాయువు (ఛిౌ2) దట్టంగా అలుముకుంటూ రాజకీయ వ్యవస్థకు ఊపిరాడకుండా చేస్తున్నది. క్రీస్తుశకం 1498లో వాస్కోడిగామా అనే ఐరోపా యాత్రికుడు భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టాడు. ఆ తర్వాత సరిగ్గా ఐదొందల యేళ్లకు తెలుగు నేలపై ఓటు సాధనకు నోటు మార్గాన్ని 1996లో చంద్రబాబు కనిపెట్టారు.

అప్పటి నుంచి రాజకీయాల్లో వాతావరణ మార్పులు మొదలయ్యాయి. క్రమేణా పేద పార్టీలు దివాళా తీశాయి. అందులో కొన్ని ప్రాప్త కాలజ్ఞత ప్రదర్శిస్తూ అద్దె మైకులుగా రూపాంతరం చెందాయి. సంఘసేవకులు సన్యాసం పుచ్చుకున్నారు. మేధావులు, వృత్తి నిపుణులు రాజకీయాలకు దూరమయ్యారు. 1996లో దర్శి, పాతపట్నం నియోజకవర్గాలకు ఉపఎన్నికలు జరిగాయి. అప్ప టికి ఏడాది క్రితమే అంతఃపుర కుట్ర ద్వారా చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. తన స్థానాన్ని పదిలపరుచుకోవడా నికి ఈ ఎన్నికల్లో ఓటర్లకు డబ్బులిచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిం చారు. ఒక్కో ఓటుకు ఐదొందల రూపాయలు పంచారని అప్పట్లో వార్తలు వచ్చాయి. అంతకుముందు ఎక్కడో ఒకచోట వందో, యాభయ్యో.. అదీ, నిరుపేద వర్గాలకు ఇచ్చేవారు. చంద్రబాబు మాత్రం సామ్యవాద పద్ధతిలో ధనిక – బీద తేడా లేకుండా అందరి ఓట్లనూ అధిక ధరలకు కొనుగోలు చేయడానికి శ్రీకారం చుట్టారు. 1998లో అత్తిలి స్థానానికి ఉపఎన్నిక జరి గింది. సాధారణ ఎన్నికలకు ఇంకో సంవత్సరం మాత్రమే మిగిలి ఉంది. అయినా చంద్రబాబు తేలిగ్గా తీసుకోలేదు. ఓటుకు వెయ్యి పంచారని వార్తలు వచ్చాయి. టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన దండు శివరామరాజే ఆ ఖర్చును చూసి జడుసు కున్నారట!

మొదటిసారిగా ఓటుకు నాలుగంకెల ధర 1998లో పలికింది. ఆ తర్వాత ఇరవై మూడేళ్లకు ఇప్పుడు ఐదంకెల మార్కును తాకినట్టు వార్తలు వస్తున్నాయి. సెన్సెక్స్‌ నాలు గంకెలు దాటిన రోజునుంచి లెక్కిస్తే ఐదంకెలు తాకడానికి పదహారేళ్లు పట్టింది. హుజూరాబాద్‌ నుంచి వస్తున్న వార్తలు నిజమైతే వోటెక్స్‌కు ఈ సమయం ఇరవైమూడేళ్ళు పట్టినట్టు! ఇంచుమించుగా సెన్సెక్స్‌కు ధీటుగా ఉన్నట్టే!

హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఒక రాజకీయ పార్టీ ఓటర్లకు ఒక్కొక్కరికి పదివేలు పంచిందని ప్రచారం జరిగింది. మొదటిదఫా ఆరువేలు, రెండోదఫా నాలుగువేల చొప్పున పంచారట. ఆ పంపకం కూడా చాలా కళాత్మకంగా ఉన్నట్టు కొందరు కొనియాడుతున్నారు. మొదటిరౌండ్‌ పంపకాన్ని ఒకానొక నడిజామురేయి దాటిన తర్వాత బ్రాహ్మీ ముహూ ర్తంలో ప్రారంభించి వెలుగురేకలు పరచుకొనే సుప్రభాత వేళకల్లా పూర్తిచేశారట. అంటే ముచ్చటగా మూడు గంటల్లో గరిష్ఠ స్థాయిలో ఓటర్లను ప్రసన్నం చేసుకున్నారు. నాలుగైదు మాసాలపాటు ప్రచార కార్యక్రమాన్ని సాగదీసినందువల్ల రెండు ప్రధాన పార్టీలకు ఖర్చు భారీ మొత్తంలోనే అయినట్లు అంచనా లొస్తున్నాయి. అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో హుజూరా బాద్‌ ఖర్చు బహుశా రికార్డు సృష్టించవచ్చు. మూడోపార్టీగా రంగంలోకి దిగిన కాంగ్రెస్‌ ఆలస్యంగా ప్రచారాన్ని ప్రారంభిం చింది. ఎన్నికల ఖర్చుపై కూడా పెద్దగా ధ్యాసపెట్టినట్టు కనబడలేదు. కౌంటింగ్‌ జరిగితే తప్ప హుజూరాబాద్‌ ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ పోషించిన పాత్ర ఏమిటో అర్థం కాదు. 

హుజూరాబాద్‌ ఎన్నిక ఇంత ప్రతిష్ఠాత్మకంగా ఎందుకు మారినట్టు? ఇంత పెద్ద ధనప్రవాహం ఎందుకు అవసర మైనట్టు? ఒకవేళ ఈటల రాజేందర్‌ పట్ల జనంలో సానుభూతి ఉన్నమాటే వాస్తవమైతే ఎన్ని డబ్బులు గుమ్మరించినా ఓడిం చడం సాధ్యం కాదు. సానుభూతి అనేది లేకపోతే – ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ కార్యక్రమాలే టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని గెలిపిస్తాయి. పైగా మొన్న ప్లీనరీ సమావేశంలో ముఖ్యమంత్రి తన ప్రసంగంలో ఆ పథకాలన్నింటినీ మరోసారి గుర్తుచేశారు. హుజూరాబాద్‌ నియోజకవర్గ ప్రజలందరూ ఆయన ప్రసంగాన్ని వినే ఏర్పాట్లను కూడా చేశారు. ‘దళితబంధు’ పేరుతో ఒక విప్ల వాత్మక కార్యక్రమాన్ని కూడా హుజూరాబాద్‌ నుంచే ప్రారంభిం చారు.

ఇంతచేసినా ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీకి ఎందుకు చెమటలు పట్టినట్టు? ఎన్నికల వ్యూహాల్లో కేసీఆర్‌ తర్వాత అంతటి దిట్టగా పేరున్న హరీశ్‌రావు సారథ్యంలో ఒక పెద్ద సైనిక పటాలాన్ని అక్కడ ఎందుకు మోహరింపజేసినట్టు? ఓటు ధరలు ఆకాశాన్నంటుకున్నట్టు వార్తలెందుకు షికారు చేసినట్టు? మరో ఆసక్తికరమైన అంశమేమంటే అధికార పార్టీకి ధీటుగా ఈటల రాజేందర్‌ కూడా వ్యయ ప్రయాసలకు ఓర్చగలగడం! బీజేపీ సమకూర్చిందా? లేక సొంత వనరులా అనేది ఇంకా తేలలేదు. ఒకవేళ సొంత వనరులే అయితే షాకింగ్‌ న్యూసే!

ఏపీలో జరుగుతున్న బద్వేల్‌ ఉప ఎన్నిక హుజూరాబాద్‌తో పోలిస్తే పెద్దగా ఆసక్తి కలిగించలేకపోయింది. వరుస ఓటము లతో కుదేలైన ప్రధాన ప్రతిపక్షం సంప్రదాయాన్ని ఉటంకిస్తూ ముందుగానే తప్పుకున్నది. కానీ లోపాయకారిగా బీజేపీకి అను కూలంగా పనిచేసినట్టు సాక్ష్యాధారాలతో వెల్లడైంది. మెజారిటీ పోలింగ్‌ స్టేషన్లలో టీడీపీవారే బీజేపీ ఏజెంట్లుగా కూర్చున్నారట. కాంగ్రెస్‌ పార్టీ పోటీ కేవలం సంకేతప్రాయమే. గెలుపు ఎవరిదో ముందే  తెలిసినందువల్ల ఏ పార్టీ అభ్యర్థి కూడా పెద్దగా ఖర్చు చేసినట్టు కనిపించలేదు. స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో అధికార వైసీపీ వారు పార్టీ తరఫున ఖర్చు చేయలేదు. కానీ, అభ్యర్థులు ఖర్చు పెట్టకుండా నిరోధించగలిగారా?

ఓట్ల కొనుగోలు వ్యూహాలకు చెక్‌ చెప్పకపోతే ప్రజా స్వామ్యానికి అర్థంలేదు. రాజకీయ వ్యవస్థలో ధనస్వామ్యం ముప్పు తొలగాలంటే కచ్చితంగా ఒక ఉద్యమం కావాలి. తమ ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాధనాన్ని అడ్డ గోలుగా దోచేసి భోంచేస్తున్నారన్న అభిప్రాయం జన సామా న్యంలో ఏర్పడింది. అందుకే ఓటుకు నోటు ఇవ్వాల్సిందేనని దబాయించి మరీ అడుగుతున్నారు. హుజురాబాద్‌లో కనిపించిన దృశ్యాలవే! గ్లాస్గో సదస్సు ప్రేరణతోనైనా సరే రాజకీయ కాలుష్యంపై పోరాడేందుకు ఒక ప్రజాస్వామిక ఉద్యమ బీజం పడాలని కోరుకుందాము.

వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement