కోవిడ్ మహమ్మారి సాగించిన ఆర్థిక విధ్వంసంపై రకరకాల కథనాలు వస్తున్నాయి. అధ్యయనాలు వెల్లడవుతున్నాయి. సమస్త జీవన రంగాల్లోని ఏ పాయనూ అది వదిలిపెట్టలేదు. మెజారిటీ ప్రజలు ఆర్థికంగా చితికిపోయారు. ఆక్స్‌ఫామ్ అధ్యయనం ప్రకారం మన దేశంలో 84 శాతం మంది ప్రజలు నష్టపోయారు. వారిలో పేదవాళ్లు మరింత ఎక్కువ నష్టపోయారు. బాగా బలిసినవాళ్లు తెగ బలిశారు. దేశంలోని సూపర్ రిచ్ కుబేరుల సంపద కేవలం ఇరవై మాసాల్లో రెట్టింపయ్యింది. వీళ్లంతా అల్లావుద్దీన్‌లయితే కోవిడ్ వాళ్ల చేతుల్లో వండర్ ల్యాంప్‌గా మారింది. 2020 మార్చిలో ఈ నూరుగురు కుబేర పుత్రుల ఉమ్మడి సంపద విలువ 23 లక్షల కోట్లు. నవంబర్ 21 నాటికి అది 53 లక్షల కోట్లకు లాంగ్‌జంప్ చేసింది. దేశ జీడీపీలో ఇది రమారమి మూడో వంతు.
ఆక్స్‌ఫామ్ లెక్క ప్రకారమే అదే సమయంలో దేశంలో 4.6 కోట్లమంది దుర్భర దారిద్య్రంలోకి జారిపోయారు. కోవిడ్ వచ్చిన మొదటి సంవత్సరం ఉపాధి హామీ పథకంలో 11 కోట్లమందికి పైగా నమోదయ్యారు. అంతకుముందు సంవ త్సరంలో పోలిస్తే ఇది 4 కోట్లు ఎక్కువ. ఈ సంవత్సరం ఈ సంఖ్య మరింత పెరుగుతుందట. సుప్రసిద్ధ ఆర్థికవేత్త, నోబెల్ పురస్కార గ్రహీత అమర్త్యసేన్ ఈ పరిణామాలపై ఒక ఆసక్తికరమైన పోలికను తీసుకొచ్చారు. 1940ల నాటి దారుణమైన బెంగాల్ క్షామం రోజుల్లో నిరుపేదలను ఎవరూ పట్టించుకోలేదు. అట్లాగే ఇప్పటి కోవిడ్ పరిణామాల్లో కూడా అత్యంత నిరుపేదలు అతి దారుణంగా దెబ్బతిన్నారు. నాటి బ్రిటిష్ ప్రభుత్వం, నేటి భారత ప్రభుత్వం నిరుపేదల విష యంలో ఒకేరకంగా వ్యవహరించాయన్నారు. తనతో మాట్లాడిన సందర్భంలో అమర్త్యసేన్ ఈ వ్యాఖ్యలు చేశారని సీఎన్‌బీసీ న్యూస్ యాంకర్ మిథాలీ ముఖర్జీ ఒక వ్యాసంలో వెల్లడించారు. మొదటి లాక్‌డౌన్ సమయంలో మండుటెండల్లో నడిరోడ్లపై నెత్తురోడుతూ కదిలిన కోట్లాది మాంసపు ముద్దల మహాప్రస్థాన దైన్యాన్ని ఈ దేశం స్వయంగా వీక్షించింది కూడా!
‘ఊరు మీద ఊరు పడ్డా కరణం మీద కాకి వాలదు’ అనే సామెత ఉండేది. అదేవిధంగా ఏ సంక్షోభం ముంచుకొచ్చినా ఐశ్వర్యవంతుణ్ణి ఏమీ చేయలేదు. దరిద్ర నారాయణుడిని మాత్రం ఏ మహమ్మారీ వదిలిపెట్టదు. అతడు రామేశ్వరం వెళ్లినా శనీశ్వరం లాగా వెంటాడుతూనే ఉంటుంది. కోవిడ్ వల్ల ఎక్కువగా దెబ్బతిన్న రంగాల్లో ప్రముఖమైనది విద్యారంగం. ఈ రంగంలో కూడా అతి ఎక్కువగా నష్టపోయినవారు పేదింటి బిడ్డలే. ఇప్పటికే మన విద్యావ్యవస్థలో ప్రమాణాల రీత్యా ధనిక – పేద అంతరం కొనసాగుతూ వస్తున్నది. ఈ రెండేళ్లలో అంతరం మరింత విస్తరించింది. వసతులున్న పిల్లలు ఆన్‌లైన్ ద్వారా అంతో ఇంతో మేకప్ చేసుకోగలిగారు. ఏ ఆదరువూ లేని పిల్లలు చదువులకు దూరమై డ్రాపవుట్ అంచున నిలబడ్డారు.
భారత రాజ్యాంగం ఈ దేశ ప్రజలందరినీ సమస్కంధు లుగా, సమాన వాటాదారులుగా ప్రకటించినప్పటికీ ఇంకా ఇన్ని కోట్లమంది ప్రజలు నిస్సహాయులుగా నిరుపేదలుగా మిగిలి పోవడానికి కారణం ఏమిటి? అందరికీ సమాన స్థాయిలో నాణ్యమైన విద్యను అందివ్వలేకపోవడమే అందుకు కారణమని విద్యావేత్తలు, ఆర్థిక నిపుణులు, సామాజిక శాస్త్రవేత్తలు ఇప్పుడు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. పేదరికంపై విజయం సాధించ గలిగే ధనుర్బాణాలను విద్యారంగమే సమకూర్చుతుందని అందరూ అంగీకరిస్తున్నారు. విద్యారంగం మీద జీడీపీలో కనీసం 6 శాతం ఖర్చుపెడితే తప్ప ప్రజలందరికీ నాణ్యమైన విద్యను అందించలేమని జాతీయ విద్యావిధానంపై వెలువడిన కమిటీ రిపోర్టులన్నీ నొక్కి చెప్పాయి. ఆ లెక్కన గడిచిన బడ్జెట్‌లో కనీసం 10 లక్షల కోట్లయినా విద్యారంగం పద్దులో పెట్టాలి. కానీ కేంద్రం 99 వేల కోట్లను మాత్రమే కేటా యించింది. వాంఛిత కేటాయింపులో ఇది కేవలం పది శాతం. ఇందులో కూడా వాస్తవానికి ఎంత ఖర్చు చేశారో తెలియాలంటే సవరించిన అంచనాలు రావాలి. దేశానికి స్వాతంత్య్రం సిద్ధిం చిన దగ్గర్నుంచీ విద్యారంగానికి చేసిన బడ్జెట్ కేటాయింపుల కథాకమామీషు ఇదే మాదిరిగా ఉన్నది.
తొలిరోజుల్లో విద్యాగంధం ఉన్న కుటుంబాల్లోని పిల్లలు తల్లిదండ్రుల శ్రద్ధ వలన సహజంగానే ముందడుగు వేశారు. వీరికి తోడుగా బడి చదువుతోపాటు ట్యూషన్లు చెప్పించుకునే స్థోమత కలిగిన వాళ్లు మాత్రమే స్కూల్ ఫైనల్ గడప దాటేవాళ్లు. నిరక్షరాస్య కుటుంబాల్లోని పేద పిల్లలు మాత్రం ఆ గడపకు ఆవలనే డ్రాపవుట్లుగా మిగిలిపోయేవారు. ఆర్థిక సంస్కరణలు, గ్లోబలైజేషన్‌ల తర్వాత ఈ సామాజిక దుర్నీతి మరింత క్రూరంగా తయారైంది. ప్రైవేట్ ఇంగ్లిష్ మీడియం స్కూళ్లకు వెళ్లగలిగిన పిల్లలు ముందడుగు వేశారు. ప్రభుత్వ స్కూళ్లను ఉద్దేశపూర్వకంగా పాడుపెట్టారు. తొలిదశ ఆర్థిక సంస్కరణలు ప్రారంభమయ్యే నాటికే ఉమ్మడి రాష్ట్ర పాలనా పగ్గాలను తస్కరించిన చంద్రబాబు నాయకత్వంలో ఈ సామాజిక విధ్వంసం యథేచ్ఛగా సాగిపోయింది. పేద పిల్లలు వెళ్లగలిగే ప్రభుత్వ బడుల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. దేశంలోని మరే రాష్ట్రంలో కూడా ప్రభుత్వ బడులను ఈ స్థాయిలో నిర్లక్ష్యం చేయలేదు. ఇదే సమయంలో ఐటీ విప్లవం ఇబ్బడి ముబ్బడిగా ఉపాధి అవకాశాలను సృష్టించింది. ఇంగ్లిష్ మీడియంలో చదువు కొనుక్కోలేకపోయిన యువతరం ఆ అవకాశాలను అంది పుచ్చుకోవడంలో విఫలమైంది. పేదవర్గాల్లోని ఒక తరం కలలు విద్యావ్యాపారం రథచక్రాల కింద నలిగిపోయాయి.
పేదవర్గాల ప్రజలు నాణ్యమైన విద్యకు మూడు దశాబ్దాల పాటు దూరం కావడానికి కారణమైన బాధ్యుల్లో ఒకటో నెంబర్ ముద్దాయిగా చంద్రబాబునే నిలబెట్టవలసి వస్తుంది. రాష్ట్ర విభజన తర్వాత మరోసారి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చినప్పటికీ ఆయన విద్యారంగం పట్ల తన పాత విధానాలనే కొనసాగించారు. 2019 సాధారణ ఎన్నికల్లో చంద్రబాబు పార్టీని ఘోరంగా ఓడించి అధికారం చేపట్టిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విద్యారంగంలో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. సరిగ్గా చెప్పాలంటే ఆయన విప్లవ శంఖం పూరించారు. విద్యార్జనలో పెరిగిన ధనిక – పేద అంతరాలు, సామాజిక– ఆర్థిక హోదాల ప్రాతిపదికపై పిల్లలు వేర్వేరు బడుల్లో చదవడానికి దారితీసిన పరిస్థితులపై అధ్యయనం చేశారు. ఈ దుష్పరిణామాలను పరిహరించి కుల మత ప్రాంత లింగ వివక్ష లేకుండా, ధనిక పేద తారతమ్యం లేకుండా పిల్లలంతా ఒక్కటిగా కలివిడిగా చదువుకునే ఒక ప్రణాళికను ఏపీ ముఖ్యమంత్రి తయారు చేసుకున్నారు. వెంటనే దాన్ని దశల వారీగా అమలుచేసే కార్యక్రమాన్ని చేపట్టారు.
విద్యారంగంలో ముఖ్యమంత్రి చేపట్టిన విప్లవాత్మక సంస్కరణల్లో మొదటిది – ‘అమ్మ ఒడి’ పిల్లల్ని స్కూలుకు/ కాలేజీకి పంపించే ప్రతి అర్హురాలైన తల్లికి ఏటా పదిహేను వేల రూపాయలను ప్రభుత్వం ప్రోత్సాహకంగా ఇస్తున్నది. దీనివల్ల రెండు ప్రయోజనాలు కలుగుతున్నాయి. పేదరికం కారణంగా పిల్లల్ని బడికి పంపించలేని దుఃస్థితి తొలగిపోవడం మొదటిది. రెండవది మహిళా సాధికారతకు సంబంధించిన అంశం. అమ్మ చేతిలో డబ్బున్న కారణంగా పిల్లల చదువుకు సంబంధించిన కీలక నిర్ణయాధికారం ఆమెకే ఉంటుంది. సంస్కరణల్లో రెండో ముఖ్యాంశం 16 వేల కోట్ల ఖర్చుతో చేపట్టిన ‘నాడు–నేడు’ అనే బృహత్తర కార్యక్రమం. కేవలం టాయిలెట్ వసతి లేని కారణంగా ఆడపిల్లలు చదువులు మానేసే దౌర్భాగ్య పరిస్థితి మొన్నటిదాకా మన విద్యావ్యవస్థలో రాజ్యమేలింది. పెచ్చు లూడుతున్న సీలింగ్, కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న గది గోడలు, విరిగిన కుర్చీలు – బెంచీలు, పగుళ్లుబారిన ఫ్లోరింగ్, కాంపౌండ్ వాల్ లేక పశువులకు ఆవాసంగా మారిన ఆవరణ, పిచ్చిమొక్కలతో విషపురుగుల విహారం, శిథిలాలయాలకు రాలేక సెలవులతో నెట్టుకొచ్చే పంతుళ్లూ... ఇది మొన్నటివరకు ప్రభుత్వ బడి దృశ్యం. ఇప్పుడు కళ్లతో చూస్తే తప్ప నమ్మలేనంతగా ఆధునిక హంగులతో ముస్తాబవుతున్నాయి. ఇప్పటికే 16 వేల స్కూళ్లు కార్పొరేట్‌కు దీటుగా సింగారించు కున్నాయి. ఇప్పుడు పేద పిల్లల్నే కాదు స్థితిమంతుల పిల్లల్ని కూడా అవి రా రమ్మని పిలుస్తున్నాయి.
కార్పొరేట్ స్కూళ్లకు ఏమాత్రం తీసిపోని విధంగా ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులకు యూనిఫామ్, షూ, బెల్ట్, టెక్ట్స్ బుక్స్, నోట్ బుక్స్, వర్క్ బుక్స్ ‘జగనన్న విద్యా కానుక’ పేరుతో లభిస్తున్నాయి. ఇంగ్లిష్ మాధ్యమం సులభంగా అర్థమయ్యే విధంగా రెండు భాషల్లో ఉండే పాఠ్య పుస్తకాలు ఇస్తున్నారు. ‘జగనన్న గోరుముద్ద’ పేరుతో పౌష్టికాహారాన్ని నిత్యం 40 లక్షలమందికి అందజేస్తున్నారు. నాణ్యమైన సీబీఎస్ మూల్యాంకన విధానాన్ని కూడా దశల వారీగా ప్రవేశ పెడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నాలుగేళ్ల అధ్యయనం తర్వాత ప్రకటించిన ‘నూతన విద్యావిధానం–2020’లో పొందుపర్చిన అంశాల్లో అనేకం ఏడాది ముందుగానే ఆంధ్రప్రదేశ్‌లో ప్రకటించడం ఒక విశేషం. నూతన విద్యా విధానానికి శ్రీకారం చుట్టిన మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను ‘నీతి ఆయోగ్’ ప్రశంసించింది.
పేద కుటుంబాల జీవితాల్లో గేమ్ ఛేంజర్ లాంటి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రాథమిక స్థాయి నుంచే అమలుచేయడం ప్రారంభించారు. వైఎస్ జగన్ తీసుకున్న ఈ సాహసోపేతమైన నిర్ణయానికి తొలిదశలో అనేక సవాళ్లు ఎదురయ్యాయి. కానీ, పిల్లల తల్లిదండ్రులు ప్రభుత్వం నిర్ణయం వెనుక దృఢంగా నిలవడంతో రాజకీయ ప్రతిపక్షాలు జడుసుకొని నోరు మూసు కున్నాయే తప్ప కుట్రలను మాత్రం ఆపలేదు. ప్రభుత్వం చేపట్టిన పలురకాల చర్యల వలన స్థోమత కలిగిన పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చేరడానికి ఉత్సాహం చూపుతున్నారు. అన్నివర్గాల పిల్లలూ కలిసి మెలిసి చదువుకోవడం వల్ల సమాజం పట్ల అవగాహన పెరుగుతుంది. దేశ సమగ్రత బలపడుతుంది. పేదరిక నిర్మూలనకు, కులమత తారతమ్యాలను అంతం చేయడానికి ఉపయోగపడే ఈ నాణ్యమైన విద్యాయజ్ఞాన్ని పూర్తిచేయడం అంత సులభసాధ్యమైనదేమీ కాదు. యాగ భంగానికి మారీచ సుబాహులు పొంచివున్నారు. కుల మతాలకు అతీతంగా పేదవర్గాల ప్రజలందరూ యాజ్ఞికునికి అండగా నిలబడవలసిన తరుణమిది.
ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా ఇంగ్లిషు మీడియాన్ని ప్రకటించడమే గాక సర్కారు బళ్ల రూపురేఖల్ని మార్చే కార్యక్రమాన్ని కూడా ప్రకటించింది. ఇక స్పందించవలసినది కేంద్ర ప్రభుత్వమే! విద్య ఉమ్మడి జాబితాలో ఉన్నప్పటికీ ఆర్థిక వనరులన్నీ కేంద్రం గుప్పెట్లోనే ఉన్నాయి. నూతన విద్యావిధాన ప్రకటన అభిలషించినట్లుగా 6 శాతం జీడీపీని విద్యా పద్దు కింద ఈ బడ్జెట్‌లో కేటాయిస్తారో లేదో చూడాలి. విద్యారంగానికి ఆయా దేశాలు చేస్తున్న కేటాయింపుల జాబితాను చూస్తే బాధ కలుగుతుంది. 198 దేశాలున్న జాబితాలో మనది 144వ స్థానం. ప్రపంచం మొత్తంలో ఉన్న పేదల్లో సగంమంది మన దేశంలోనే ఉన్నారు. వీరిని పేదరికం నుంచి బయటపడేసే బ్రహ్మాస్త్రం నాణ్యమైన విద్య. అందువల్ల అన్ని దేశాల కంటే ఎక్కువ కేటాయింపులు చేయవలసిన అవసరం మన దేశంలో ఉన్నది. కనీసం ఈ రంగంలో ప్రగతిబాటలో పయనిస్తున్న రాష్ట్రాలకైనా ప్రోత్సాహకాలను ప్రకటించడం అత్యవసరం. ఈ దేశ ప్రత్యేక అవసరాల దృష్ట్యా, కోవిడ్ మహమ్మారి కలిగించిన విపరి ణామాల దృష్ట్యా ఈ బడ్జెట్‌లో విద్యారంగానికి పెద్దయెత్తున కేటాయింపులుంటాయని ఆశిద్దాం. ఈ ఆశ నెరవేరినట్లయితే ఈ దేశ పేదింటి బిడ్డలు ప్రభుత్వాన్ని సరస్వతీ దేవిగా భావించి, పూజిస్తారు.
వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com
Comments
Please login to add a commentAdd a comment