విద్యారంగంలో జగన్‌ జైత్రయాత్ర | Pudi Srihari Article On Ap Government Educational Schemes | Sakshi
Sakshi News home page

Amma Vodi: విద్యారంగంలో జగన్‌ జైత్రయాత్ర

Published Sun, Jun 26 2022 5:55 PM | Last Updated on Sun, Jun 26 2022 6:35 PM

Pudi Srihari Article On Ap Government Educational Schemes - Sakshi

విద్యా రంగంలో వైఎస్‌ జగన్‌ చేపట్టిన కార్యక్రమాలు దేశానికి దిక్సూచిగా నిలుస్తున్నాయడంలో ఎలాంటి సందేహం లేదు. చదువుల మీద ఒక ముఖ్యమంత్రిగా ఆయన పెడుతున్న శ్రద్ధ.. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఎవ్వరూ కూడా పెట్టలేదనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. క్షణక్షణానికీ మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం, ఊహించని స్థాయికి చేరుతున్న విజ్ఞానాన్ని రేపటి తరం పిల్లలు అందిపుచ్చుకోవాలన్న ఆయన సంకల్పం కొనసాగుతోంది. ఉన్నవారితో సమానంగా లేనివారి పిల్లలకూ అన్నీ అందాలన్న ఆయన దృఢ నిశ్చయం కళ్లముందు కనిపిస్తోంది. పేద కుటుంబాల తలరాతలే కాదు, ఒక ప్రజాస్వామ్య దేశంగా, ఉత్తమ విలువలతో కూడిన సమాజంగా వర్థిల్లాలంటే అది కేవలం చదువుల ద్వారానే సాధ్యమనే బలంగా విశ్వసించిన ఆయన, విద్యారంగంలో తన జైత్రయాత్రను కొనసాగిస్తున్నారు.
చదవండి: ఎల్లో హెచ్చులు ఢిల్లీ దాకా! 

నిరక్షరాస్యతకు చరమాంకం:
2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో అక్షరాస్యత శాతం 67.35 శాతం మాత్రమే. మహిళల అక్షరాస్యత 59.96 శాతం. 1956లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత, గత జనాభా లెక్కలు నాటికి ఆ 55 ఏళ్ల సంవత్సరాల్లో కూడా నూటికి నూరుశాతం అక్షరాస్యతను సాధించలేకపోయాం. ప్రగతికి ఇదో పెద్దలోటు. 2019లో వచ్చిన దృఢ సంకల్పంతో కూడిన రాజకీయ నాయకత్వం ఈ పరిస్థితులను మార్చడానికి కంకణం కట్టుకుంది. పుట్టిన ప్రతి పిల్లాడు కూడా బడికిపోవాలన్న సదుద్దేశంతో ‘అమ్మ ఒడి’ పథకం ప్రారంభమైంది. పిల్లల చదువుల కోసం ఏ పేదింటి తల్లీ భయపడవద్దని, కేవలం బడికి పంపితే చాలు రూ.15 వేల ఇస్తామని మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని తుచ తప్పక అమలు చేస్తోంది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం.. మేనిఫెస్టోలో కేవలం బడికి వెళ్లే పిల్లలకు మాత్రమేనంటూ ఈ పథకాన్ని పేర్కొన్నా తర్వాత దాన్ని ఇంటర్మీడియట్‌ చదువుతున్న వారికీ వర్తింపుచేశారు.

2019-2020 విద్యా సంవత్సరంలో 42,33,098 మంది తల్లులకు రూ.6,349.53 కోట్ల రూపాయలను చిత్తూరులో 2020, జనవరి 9న ముఖ్యమంత్రి బటన్‌ నొక్కి జమచేశారు. 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి 44,48,865 మంది తల్లులకు రూ.6,673 కోట్లను నెల్లూరులో 2021,జనవరి 11న సీఎం బటన్‌ నొక్కి జమ చేశారు. మొదటి ఏడాదిలో పథకం అప్పుడే ప్రారంభం అయిన దృష్ట్యా వారి పిల్లలను బడికి పంపేలా తల్లులను ఉత్సాహపరిచేలా ఎలాంటి హాజరు శాతాన్ని పట్టించుకోకుండా ప్రభుత్వం లబ్ధిదారులు అందరికీ కూడా అమ్మ ఒడిని జమ చేసింది. రెండో ఏడాది కూడా కోవిడ్‌ కారణంగా పాఠశాలలు సక్రమంగా నిర్వహించలేని పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని లబ్ధిదారులకు అందరికీ కూడా పిల్లల హాజరుతో నిమిత్తం లేకుండా ప్రభుత్వం వర్తింపచేసింది.

ఈ ఏడాది మాత్రం 75 శాతం హాజరును పరిగణలోకి తీసుకుంది. పథకం ఉద్దేశం నీరు గారకుండా, లక్ష్యాన్ని సాధించేందుకు నిర్ణయించిన హాజరు శాతాన్ని పరిగణలోకి తీసుకుని పథకాన్ని వర్తింపుచేస్తామని నేరుగా ముఖ్యమంత్రే చిత్తూరు ‘అమ్మ ఒడి’ సభలో స్పష్టం చేశారు. మొత్తంగా మూడేళ్ల కాలంలో కేవలం అమ్మ ఒడి పథకానికే రూ.19,617.53కోట్లు ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. 

కొత్తగా అమ్మ ఒడి పరిధిలోకి 5,48,329 మంది
2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి కొత్తగా అమ్మఒడి పరిధిలోకి 5,48,329 మంది తల్లులు వచ్చారు. పథకం స్థిరంగా, సమగ్రంగా కొనసాగుతుందనేందుకు ఇదొక ఉదాహరణ. వీరంతా కూడా ఒకటో తరగతిలో చేరిన పిల్లల తల్లులు. 75శాతం హాజరు నిబంధనను వీరు సంతృప్తికరంగా పూర్తి చేయడం మంచి పరిణామం. మొత్తంగా 43,96,402 మంది తల్లులకు సుమారు రూ.6,595 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి బటన్‌నొక్కి జమచేయనున్నారు. తద్వారా 82,31,502 మంది పిల్లలు లబ్ధి పొందుతున్నారు. 

వివక్షలేదు... అవినీతి లేదు.. అంతా పారదర్శకం:
పథకాల అమల్లో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం చిరస్థాయిగా నిలిచిపోతుంది. రాజకీయాలకు, వర్గాలకు అతీతంగా పథకాలు అమలు చేస్తోంది. ఏ పథకం ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు దరఖాస్తులు తీసుకుంటారు? ఆ దరఖాస్తులు ఎక్కడ దొరుకుతాయి? దాఖలు ఎక్కడ చేయాలి? ఇలాంటి ప్రశ్నలు గత ప్రభుత్వాల్లో కోకొల్లలు. వీటికి తావులేకుండా మొత్తం ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటోంది. కుటుంబాల వారీగా ఉన్న వాలంటీర్లు అర్హులైన వారిని గుర్తించి వారిచేత దరఖాస్తు చేయిస్తున్నారు. అర్హుల జాబితాను గ్రామ సచివాలయాల్లో ఉంచుతున్నారు. సామాజిక తనిఖీ సమయంలో అర్హత ఉండి పేరులేకపోతే మళ్లీ అవకాశం కల్పిస్తున్నారు. ఈ ప్రక్రియ అంతా గ్రామస్థాయిలోనే కచ్చితమైన తనిఖీలతో ముందుకు సాగుతోంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రతి దశలోనూ జవాబుదారీతనం కనిపిస్తోంది. అందుకనే ఇన్ని లక్షలమందికి లబ్ధి చేకూర్చే ఈ పథకం ఇంత సజావుగా అమలవుతోంది. 

అమ్మ ఒడి అద్భుత ఫలితాలు:
పిల్లలను బడికి పంపేందుకు తీసుకున్న చర్యల కారణంగా 2018–19 నాటికి ప్రభుత్వ పాఠశాలల్లో 37.21 లక్షలుగా ఉన్న అడ్మిషన్ల సంఖ్య దాదాపు రూ.7 లక్షలు పెరిగింది. 2021–22 నాటికి 44.30 లక్షలకు చేరుకుంది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో అడ్మిషన్ల సంఖ్య 2 లక్షలు పెరిగి, 72.7 లక్షలకు చేరుకుంది. మరో వైపు కోవిడ్‌ లాంటి విపత్తు సమయంలో పిల్లల చదువులకు అందిస్తున్న డబ్బు వారికి ఎంతగానే మేలు చేసింది. విపత్తు సమయంలో ఈ పథకాలు ఒక రక్షణ కవచంలా ఈ పథకాలు నిలిచాయనడంలో ఎలాంటి సందేహంలేదు. 

మనబడి-నాడు నేడు:
విద్యారంగంలో వైఎస్‌ జగన్‌ జైత్రయాత్రలో మరో ఘన విజయం మనబడి నాడు-నేడు. ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలను ఈ ప్రభుత్వం సమూలంగా మార్చేస్తోంది. బ్లాక్‌బోర్డ్, లైట్లు, ఫ్యాన్లు, ఫర్నిచర్, టాయిలెట్లు, డ్రింకింగ్‌ వాటర్, కాంపౌండ్‌వాల్‌ ఇలా పదిరకాల సౌకర్యాలను కల్పించేందుకు భారీ మొత్తంలో ఖర్చుచేస్తున్నారు. తొలిదశలో 15,715 స్కూళ్లలో సుమారు రూ.3,669 కోట్లు ఖర్చుచేశారు. మరో 22,344 స్కూళ్లలో రూ.8 వేల కోట్ల ఖర్చుతో రెండో దశ పనులు జరుగుతున్నాయి. తల్లిదండ్రులతో ఏర్పడిన విద్యా కమిటీల భాగస్వామ్యంతో, వారి పర్యవేక్షణలో ఈ పనులన్నీ జరుగుతున్నాయి. 

స్కూళ్లలో పరిశుభ్రత – సమర్థ నిర్వహణ:
వేల కోట్ల పెట్టి పాఠశాలల్లో సౌకర్యాలను, సదుపాయాలను కల్పించుకోవడమే కాదు.. వాటిని కాపాడుకోవడం, సమర్థవంతంగా నిర్వహించుకోవడం కూడా అందరి బాధ్యత. ఇదే వాతావరణం తర్వాత వచ్చే పిల్లలకు కూడా నిరంతరం అందేలా ఈ చర్యలు చేపట్టింది. తల్లిదండ్రుల భాగస్వామ్యంతో రెండు కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. టాయిలెట్‌ మెయింటినెన్స్‌ ఫండ్‌కు వేయి రూపాయల చొప్పున జమచేస్తున్నారు. అమ్మ ఒడి నుంచి అందించిన డబ్బు ద్వారా రూ.430 కోట్ల టాయిలెట్‌ మెయింటినెన్స్‌ నిధి సమకూరింది.

తల్లిదండ్రుల కమిటీలు ద్వారా దీన్ని ఖర్చు చేస్తున్నారు. ప్రతి 300 విద్యార్థులకు ఒక ఆయా ఉండేలా చూస్తున్నారు. వీరికి నెలకు రూ.6 వేల రూపాయలు అందిస్తున్నారు. టాయిలెట్లను పరిశుభ్రంగా ఉంచడం దీని ముఖ్య ఉద్దేశం. తద్వారా ఆడపిల్లలు బడిమానేయాల్సిన పరిస్థితులకు లేకుండా చూస్తున్నారు. దీంతోపాటు స్కూళ్లను సమర్థవంతంగా నిర్వహించడానికి, ఎప్పుడు ఏ మరమ్మత్తుగా వచ్చినా వెంటనే బాగుచేసేందుకు వీలుగా స్కూలు మెయింటినెన్స్‌ నిధిని కూడా తల్లిదండ్రుల భాగస్వామ్యంతో నిధిని పెడుతున్నారు. అమ్మ ఒడి నుంచి వేయిరూపాయలను దీనికి జమచేస్తున్నారు. దీనిపై పర్యవేక్షణ బాధ్యత తల్లిదండ్రుల కమిటీలదే.

విద్యాకానుక, ఇంగ్లిషు మీడియం, సీబీఎస్‌ఈ, బైజూస్‌:
పిల్లలకు విద్యాకానుక ద్వారా ప్రతిఏటా వైఎస్‌.జగన్‌ సర్కార్‌ మరికొన్ని సౌకర్యాలను కల్పిస్తోంది. 3 జతల యూనిఫారంతోపాటు షూ, సాక్సులు, పాఠ్యపుస్తకాలు, వర్క్‌బుక్స్, ఇంగ్లిషు నిఘంటువు అందిస్తోంది. విద్యాకానుక కోసం 2020-21లో రూ.648.11 కోట్లు ఖర్చుచేస్తే, 2021-22లో రూ.789.21 కోట్లు ఖర్చుచేసింది. మొత్తంగా రెండేళ్లలో రూ.1,437.32 కోట్లు ఖర్చుచేసింది. ఈఏడాది కూడా భారీ ఖర్చుకు సిద్ధమైంది. మొత్తంగా మూడేళ్లలో రూ.2,324 కోట్లు ఖర్చుచేసింది.

పిల్లలను బడికి రప్పించడం, వారు చక్కగా చదువుకునేలా మంచి సౌకర్యాలను, వాతావరణాన్ని కల్పించడం ఒక వైపు చేస్తుంటే... మరోవైపు నాణ్యమైన విద్యను అందించడంపైన కూడా ఈ వైయస్‌.జగన్‌ నేతృత్వంలోని ఈ ప్రభుత్వం గట్టిచర్యలు తీసుకుంది. ప్రపంచస్థాయిలో ఎదురయ్యే పోటీని ఎదుర్కొనేందుకు వీలుగా మన పిల్లలను తయారుచేసేందుకు ఇంగ్లిషు మీడియంలోనే బోధన ప్రారంభించారు. పిల్లలు అర్థంచేసుకునేందుకు వీలుగా పాఠ్యపుస్తకాలను ద్విభాషల్లో ముద్రించారు. స్కూళ్లన్నింటినీ కూడా సీబీఎస్‌ఈకు అనుసంధానం చేస్తున్నారు.

ఇప్పుడు 8వ తరగతి చదువుతున్న పిల్లలు 2025 నాటికి సీబీఎస్‌ఈలో పరీక్షలు రాస్తారు. వీరిని మరింత సుశిక్షితులుగా తయారుచేయడానికి వీలుగా బైజూస్‌తో ఒప్పందం కదుర్చుకున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో 4 నుంచి 10వ తరగతి వరకూ బైజూస్‌ కంటెంట్‌ ఉచితంగా అందుబాటులోకి వస్తోంది. సెప్టెంబరులో 4.7లక్షల మంది 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు కూడా అందుబాటులోకి వస్తాయి. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రతి తరగతి గదిలోకూడా టీవీలు వస్తాయి. దీంతో బోధన మరింత సులభంగా ఉంటుంది. పిల్లలకూ సంగ్రహణ శక్తి పెరుగుతుంది. 

ఇక్కడితో జగన్‌ జైత్రయాత్ర ఆగిపోలేదు. జగనన్న విద్యాదీవెన 
(ప్రతి త్రైమాసికానికీ పూర్తి ఫీజు రియింబర్స మెంట్‌చెల్లింపు కింద రూ.7678.12 కోట్లు), జగనన్న వసతి దీవెన (వసతి, భోజన ఖర్చుల కింద పిల్లలకు రూ. 3,329.05 కోట్లు), జగనన్న గోరుముద్ద (మెరుగైన, నాణ్యమైన, రుచికరమైన మధ్యాహ్న భోజనం కింద రూ.3,087 కోట్లు), పాఠశాలల్లో నాడు–నేడు (ఇప్పటికే రూ.3,669 కోట్లు ఖర్చు చేయగా మరో రూ.8వేల కోట్లు ఖర్చుచేస్తున్నారు), వైయస్సార్‌ సంపూర్ణ పోషణ(రూ.4,895కోట్లు) ఈ కార్యక్రమంలో అన్నింటికింద రూ.52,600.65 కోట్లు ఖర్చుచేశారు.

-పూడి శ్రీహరి, ఏపీ సీఎం సీపీఆర్వో

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement