‘‘అక్కరకు రాని చుట్టము, మ్రొక్కిన వరమీని వేల్పు, మోహరమున దానెక్కిన బారని గుర్రము, గ్రక్కున విడువంగ వలయు గదరా సుమతీ’’ అన్నాడు శతకకారుడైన బద్దెన. అవసరానికి ఉపయోగపడని చుట్టాన్నీ, పూజించినా కోర్కెలు తీర్చని దేవుడినీ, యుద్ధంలో తానెక్కినప్పుడు పరుగెత్తని గుర్రాన్నీ వెంటనే వదిలేయాలని దాని అర్థం. అటువంటి అక్కరకు రాని ఒక చుట్టాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నాలుగేళ్ల కింద వదిలించుకున్నారు. అలా వదిలించుకోవడం ఆయనకు బొత్తిగా నచ్చలేదు. కోపం తన్నుకొస్తున్నది. ఉక్రోషం లావాలా ఉప్పొంగుతున్నది. కళ్లెర్రబారుతున్నాయి. తనను వదిలించు కున్న ప్రజలకు శాపనార్థాలు పెడుతున్నారు. తనను ఓడించిన నాయకుడిపై బెదిరింపులకు దిగుతున్నారు. మధ్యేమధ్యే శోకం సమర్పయామి... వెక్కివెక్కి ఏడుస్తున్నారు.
ఓదార్పు కోసం పొరుగు రాష్ట్రాల నుంచి సెలబ్రిటీలను బతిమాలి పిలిపించుకుంటున్నారు. ‘యే దిల్ మాంగే సింపతీ’ అంటూ ఊరేగుతున్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గతంలో ఓదార్పు యాత్ర చేశారు. బాధలో ఉన్న వారిని ఓదార్చ డానికి ఆయన ఈ యాత్రను చేపట్టారు. ఈ నాయకుడు మాత్రం తనను ఓదార్చండని యాత్రలు చేస్తున్నారు. ఇదీ ఇద్దరు నాయ కుల ఫిలాసఫీల్లో ఉన్న మౌలికమైన తేడా!
‘నూరు గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకే గోవిందా’ అంటారు. అలాగైంది ఆయన పరిస్థితి ఇప్పుడు. ఆయన మాత్రం భిన్నంగా ఆలోచిస్తున్నారు. కష్టాలన్నీ కట్టగట్టుకొని తన మీద దాడి చేస్తున్నాయని జనం నమ్మి తనను ఓదార్చాలి. తాను అధికారంలో ఉండగా చేసిన అవినీతి, అక్రమాలకు రాజ్యాంగ బద్ధమైన ఇమ్యూనిటీ ఉండాలని ఆయన గట్టిగా నమ్ముతారు. కర్ణునికి కవచ కుండలాలెంత సహజమో, బాబుకు అవినీతి ఇమ్యూనిటీ అంత సహజమనీ మూడు దశాబ్దాలుగా యెల్లో మీడియా ప్రచారం చేసిపెట్టింది. ఈ ముప్పయ్యేళ్లలో ఎన్ని ఆరోపణలు కోర్టు మెట్లెక్కినా, బదిలీ లేని ‘స్టే’షన్ మాస్టర్‌లా తాను పాతుకొనిపోలేదా? విచారణ జరగకుండా ఇరవైకి పైగా స్టేలు విజయవంతంగా తెచ్చుకోలేదా? ఇప్పుడేమైంది. తాను నగ్నంగా దొరికిపోయే కేసులో సుప్రీంకోర్టు స్టేను తొలగించ డమేమిటి? కలికాలం కాకపోతే!... ఇదీ బాబు అండ్ కో భావజాలం.
రాష్ట్ర విభజన వెంటనే జరిగిన ఎన్నికల్లో మోదీ గాలి ఆసరాగా యెల్లో తెరచాప ఎత్తిపట్టి బాబు అధికారంలోకి వచ్చారు. ఫార్టీ ఇయర్స్ అనుభవజ్ఞుడు కనుక క్లిష్ట పరిస్థితుల్లో ఉపయోగపడతాడేమోనని కూడా కొందరు వయోధిక ఓటర్లు ఆలోచించి ఉండవచ్చు. నిజానికి అప్పుడు చంద్రబాబుకు లభించిన అవకాశం ఓ అద్భుతం. నవ్యాంధ్రను తీర్చిదిద్దడానికి లభించిన దివ్యమైన అవకాశం. సద్బుద్ధితో ఆలోచించి ఉంటే పాత పాపాలను కడిగేసుకోగలిగేవారు. ఆయన చంద్రబాబు కనుక అలా జరగలేదు! ‘‘ఎలుక తోలు తెచ్చి యేడాది ఉతికినా, నలుపు నలుపే గాని తెలుపు గాదు, కొయ్యబొమ్మ తెచ్చి కొట్టిన పలుకునా, విశ్వదాభిరామ వినురవేమ!’’ అన్నారు. స్వభావం మారకపోగా విశ్వరూపం దాల్చింది.
సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకోవాలనే మేనేజ్ మెంట్ పాఠాన్ని బాబు పదేపదే వల్లెవేసేవారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని సొంత అవకాశంగా మలుచు కునేటందుకు ఒక అవినీతి క్రతువును ఆరంభించారు. అప్పటి ప్రతిపక్షం ఆ క్రతువు ఖరీదు ఆరు లక్షల కోట్లు ఉండవచ్చని ఉజ్జాయింపు అంచనా వేసింది. గ్రామస్థాయిల్లోనూ జన్మభూమి కమిటీల పేరుతో అవినీతి పిండారీ ముఠాలను ఎగదోశారు. ఆ అయిదేళ్లలో అవినీతి సెగ తగలని మనిషే లేడంటే అతి శయోక్తి కాదు. జనం కీలెరిగి వాతపెట్టారు. ఎన్నికల సమ యానికి ఉప్పెనలా విరుచుకుపడి అక్కరకు రాని చుట్టాన్ని తరిమికొట్టారు.
ప్రజాభిప్రాయానికి అనుగుణంగా కొత్త ప్రభుత్వం బాబు అవినీతి పురాణంపై ఓ కేబినెట్ సబ్‌కమిటీని వేసింది. ఆ సబ్ కమిటీ అవినీతి తాలూకు నివ్వెరపోయే నిజాలను రూఢి పరుస్తూ ఒక నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. నివేదిక ఆధారంగా ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. బాబు ప్రభుత్వం అవినీతి విశ్వరూపానికిసంబంధించిన అనేక ఆధారాలను ‘సిట్’ సంపాదించగలిగింది. బ్రహ్మరాక్షసి లాంటి అవినీతిని తవ్వి తీయాలంటే కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా రంగంలోకి దిగాలని ప్రభుత్వానికి ‘సిట్’ సూచించింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. ఈలోగా చంద్రబాబు రంగంలోకి దిగిపోయారు. నాటి ప్రభుత్వంలో భాగస్వాములు కాని ఇద్దరు వ్యక్తుల చేత హైకోర్టులో పిటిషన్ వేయించారు. ఈ పిటిషన్ వేయడానికి వారికి ఎటువంటి అర్హత (లోకస్ స్టాండై) లేదనే న్యాయ నిపుణులు భావించారు. అయినప్పటికీ హైకోర్టులో ‘సిట్’ దర్యాప్తుపై స్టే మంజూరైంది. అదీ చంద్ర బాబు ప్రత్యేకత.
దుర్యోధనుడికి జలస్తంభన విద్య వచ్చట. ఆ విద్య వలన ఆయన నీటిలో ఎంతసేపైనా మునిగి ఉండగలడు. కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులందరూ చనిపోయిన తర్వాత మిగిలిన ఒక్క దుర్యోధనుడు ఓ మడుగులో దూరి దాక్కుంటాడు. రణశేషం ఉండకూడదు కనుక పాండవులు మడుగు వద్దకు చేరుకొని తిట్ల దండకం అందుకుంటారు. అభిమానధనుడైన దుర్యోధనుడు ఆ తిట్లు భరించలేక బయటకొచ్చి యుద్ధం చేస్తాడు. ఆ జలస్తంభన విద్య లాంటి న్యాయస్తంభన (స్టే ఆర్డర్) విద్య చంద్రబాబుకు తెలుసునని అభిజ్ఞవర్గాలు బలంగా నమ్ముతాయి. ఈ విద్య తెలిసినందున ఆయన దాని మాటున ఎంతకాలమైనా దాక్కో గలరు. దుర్యోధనుడి మాదిరిగా అభిమానధనం, గోంగూర ధనం వంటి సెంటిమెంట్లేవీ ఆయనకు లేవు. అందువల్ల కేసును ఎదుర్కోవాలని ఎవరెంత కవ్వించినా ఆయన చలించరు. ‘స్టే’షన్ మాస్టర్‌గానే ఉండిపోతారు. ఈవిధంగా ఇప్పటికి ఇరవై రెండు పర్యాయాలు ఆయనలాగే ఉండిపోయారు.
కానీ ఇన్నాళ్లకు ఇన్నేళ్లకు ఇప్పుడేదో తేడా కొట్టడంతో బాబు కలవరపడిపోతున్నారు. ‘సిట్’ దర్యాప్తుపై హైకోర్టు విధించిన స్టేను సుప్రీంకోర్టు ఎత్తివేయడమేమిటి? దర్యాప్తు జరిగితే..? కేంద్ర సంస్థలు కూడా రంగంలోకి దిగితే ఏం చేయాలి? ఇప్పుడెవరికి చెప్పుకోవాలి? మార్గదర్శి లాంటి తన గురువు పరిస్థితే బాగాలేదు. ఆయన మంచం దిగనంటున్నారు. ఆపన్న హస్తం కోసం ఆయనే ఎదురుచూస్తున్నారు. కృష్ణపరమాత్ముడు పరమపదించారన్న వార్త విన్నప్పటి అర్జునుడి పరిస్థితి బాబుగారిది. ‘‘మన సారథి, మన సచివుడు, మన వియ్యము, మన సఖుండు, మన బాంధవుడున్, మన విభుడు, గురుడు, దేవర, మనలను దిగనాడి చనియె మనుజాధీశా!’’ అని ధర్మ రాజు ముందు అర్జునుడు మొరపెట్టుకున్నాడట! ఇప్పుడు తానెవరి ముందు మొరపెట్టుకోవాలి? అకాల వర్షాలు ఆయన కంటికి ఒక సంక్షోభంలా కనిపించాయి. అవకాశాలు వెతుక్కో వడానికి గోదావరి జిల్లాలకు బయల్దేరారు.
సుప్రీంకోర్టు స్టే తొలగించిన రోజు. మీడియా ముందు ఆయన మొరపెట్టుకున్నారు. దాంతోపాటు గర్జనలకూ, గాండ్రింపులకూ, బెదిరింపులకూ కూడా పాల్పడ్డారు. ఆయన ఆవేశానికి ఎదురుగా వున్నవారు మ్రాన్పడిపోయారు. గత ఎన్నికల్లో పవన్ కల్యాణ్ ప్రచారానికి సంబంధించి బాగా వైరలైన ఒక వీడియో చాలామందికి గుర్తుండే ఉంటుంది. అందులో పవన్ ఉన్నట్టుండి వీరావేశంతో చేసిన ఆంగిక వాచికాభినయాలకు పక్కనున్న కాకినాడ అభ్యర్థి జడుసుకుంటాడు. బిత్తరచూపులతో సదరు అభ్యర్థి ప్రదర్శించిన మూకాభినయం చార్లీ చాప్లిన్‌ను గుర్తుకు తెస్తుంది. మొన్నటి సమావేశంలో చంద్రబాబు ఎదురుగా ఉన్నవాళ్లలో కూడా పదిమందైనా చాప్లిన్లు ఉండి ఉంటారు. ప్రజాస్వామ్య సంప్రదాయాలకు తిలోదకాలిస్తూ చంద్ర బాబు బెదిరింపులకు దిగారు. బహుశా ఏ రాజకీయ నాయ కుడూ తన ప్రత్యర్థిని ఉద్దేశించి ఇలాంటి బెదిరింపులు చేసి ఉండరు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని పరోక్షంగా ప్రస్తా విస్తూ ‘‘అతనికి మిజరబుల్ ట్రీట్‌మెంట్ ఉంటుంది. చరిత్రలో ఏ నాయకుడికీ జరగని ట్రీట్‌మెంట్ ఇతనికి ఉంటుంది. అతిగా ప్రవర్తించే వారికి ఇలాంటి ఎండింగే ఉంటుంది. దానికి అతను సిద్ధంగా ఉండాలి. అతనే కాదు. అతని పార్టీ వాళ్లు కూడా ఇలాంటి ట్రీట్‌మెంట్‌కు రెడీ కావాలి’’ – ఇదీ ఆయన బెదిరింపు. దీని తాత్పర్యమేమిటో ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ఆయ నపై ఉన్నది. మిజరబుల్ ట్రీట్‌మెంట్ అంటే? ఏం చేస్తారు? నిస్పృహతో విసిరిన ఆఖరి బాణమా? ఏమైనా కుట్రనా? ఇది కోడ్ లాంగ్వేజా?... ఆయనే విడమర్చి చెప్పాలి.
ఈ పర్యటనలో బాబు ఉపయోగిస్తున్న అన్ పార్లమెంటరీ భాషను ఇక్కడ ప్రస్తావించడం లేదు. జనం నవ్వుకునేలా గొప్పలు చెప్పుకోవడం గురించి కూడా ఒకే ఒక అంశాన్ని ప్రస్తావించుకుందాము. ‘తమ్ముళ్లూ! నేనే గనుక అధికారంలో ఉంటే మీ ధాన్యం తడిసే ఉండేదా?’ అని ప్రశ్నించారు. వెంటనే జనంలో ఓ గొంతు ‘మీరుంటే అసలు వర్షం పడితేగా?’ అని వినిపించింది. తనకు నచ్చని కామెంట్లను ఆయన పట్టించుకోరు. తన ధోరణి తనదే! ‘సముద్ర తీరంలో నిలబడి తుపాన్లను కంట్రోల్ చేస్తున్నాను, తుపాకులతో వర్షం కురిపించాను’... వగైరా వ్యాఖ్యానాలు చేసిన మానసిక స్థితిలోంచే.. ‘నేనుంటే మీ ధాన్యం తడిసేది కాద’న్న వ్యాఖ్యానం వెలువడి ఉంటుంది. జనానికి కొంత కాలక్షేపం.
బాబు అవినీతి దర్యాప్తుపై ఉన్న స్టేను సుప్రీంకోర్టు తొలగించిన తర్వాత ఆయన కూటమికి మరో పిడుగు లాంటి వార్త. రాజధాని ప్రాంతంలో కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన యాభైవేల మంది పేద ప్రజలకు సెంటు భూమి చొప్పున ఇళ్ల స్థలాల కోసం ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయానికి హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ నిర్ణయాన్ని అడ్డుకోవడానికి రెండేళ్లుగా బాబు కూటమి చేయని ప్రయత్నం లేదు. పేదలకు అక్కడ ఇళ్ల స్థలాలిస్తే ‘సామాజిక సమతౌల్యత’ దెబ్బతింటుందని కోర్టుకు వెళ్లారు. అదొక గంభీరమైన పదం మాత్రమే! ఆ ముసుగు పదాన్ని తొలగిస్తే పేద ప్రజల పట్ల అదొక భయంకరమైన అస్పృశ్య భావన. తమ పక్కన పేదవారు నివసిస్తే మైలపడి పోతామనే పెత్తందారీ తనపు కొవ్వెక్కిన అహంకారం. ఈ మనో వికారానికి ముసుగు కప్పి సాంకేతిక కారణాలు జోడిస్తూ చేసిన అభ్యంతరాలను ప్రభుత్వ న్యాయవాది బలంగా తిప్పికొట్టారు.
ఈ తీర్పు వచ్చిన రోజు కూడా చంద్రబాబువి ఆగ్రహా వేశాలే! కొంత తటస్థంగా ఉండే మీడియాను కూడా ఈసారి బెదిరించారు. తాను కోరుకున్నట్లు ప్రసారాలు చేయని రెండు చానల్స్‌ను నిషేధిస్తానని బ్లాక్‌మెయిలింగ్‌కు దిగజారారు. ఆ రెండు చానల్స్‌ను పేరుపెట్టి మరీ హెచ్చరించారు. ‘సాక్షి’ సంగతి సరేసరి. దాన్ని ముందే నిషేధిస్తారట! మీడియా మొత్తం ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏబీఎన్, టీవీ–5 మాదిరిగా ఉండాలి. లేదంటే తన ఆగ్రహానికి గురికాక తప్పదనే సందేశాన్ని ఆయన బహిరంగంగా పంపిస్తున్నారు. రాజకీయంగా చిట్టచివరి జారుడు మెట్టు మీదకు చేరుకోవడంతో ఆయన నిస్పృహ మాటల్లో స్పష్టంగా బయటపడుతున్నది.
పేదలకు ఇళ్లస్థలాలు రాజధానిలో ఇవ్వకూడదనీ, పేదలకు ఇళ్లు కట్టించి ఇస్తే ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందనీ, పేద పిల్లలకు ఇంగ్లిషు చదువులొద్దనీ, అవి తమ పిల్లలకు మాత్రమే పరిమితం కావాలనీ హూంకరిస్తున్న పెత్తందారీతనంపై సాధారణ ప్రజలు మండిపడుతున్నారు. తమ పిల్లలు కూడా పెద్దవారితో సమా
నంగా నాణ్యమైన చదువులు చదవాలనీ, వైద్యరంగం అభివృద్ధితో పెరుగుతున్న ఆయుఃప్రమాణాలు తమకూ వర్తించాలనీ, తమ శ్రమకు లాభదాయకమైన విలువ, గౌరవం లభించాలనీ పేద ప్రజలు కోరుకుంటున్నారు. బలహీనవర్గాలు, మహిళలు సాధికారతను కోరుకుంటున్నారు.
సామాజిక, రాజకీయ రంగాల్లో తగిన వాటానూ, గౌరవప్రదమైన స్థానాన్నీ అభిలషి స్తున్నారు. ఇవన్నీ న్యాయమైన కోర్కెలు. రాజ్యాంగం ఇచ్చిన హామీలే. కానీ ఇన్నాళ్లు ఈ సామాజిక న్యాయం తమకు దక్కకుండా చేసిన పెత్తందారి తోడేళ్లెవరో జనం గుర్తించగలుగు తున్నారు. తమకు అండగా నిలబడుతున్నవాళ్లెవరో ప్రజలకు తేటతెల్లమవుతున్నది. రాజధానిలో పేద ప్రజలకు ఇళ్ల పట్టాల సమస్యే ఒక లిట్మస్ టెస్ట్. ఈ అంశాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్లంతా పెత్తందారీ తొత్తులే! వాడు ఎర్రజెండా ముసుగేసుకున్నా సరే! ఎవరేమిటనే సంగతి జనానికి స్పష్టంగా తెలిసిపోయిందన్న ఉక్రోషమే ‘బాబు అండ్ కో’లో బుసకొడుతున్నది. వచ్చే ఎన్ని కల్లో పాత ఫలితాలే పునరావృతమయ్యే పరిస్థితి విస్పష్టంగా కనిపిస్తున్నది. అందుకే ఈ నిస్పృహ. అందుకే ఈ బెదిరింపులు.
- వర్ధెళ్లి మురళి, Vardhelli1959@gmail.com
Comments
Please login to add a commentAdd a comment