ఇది విశ్వసనీయత విజయం! | Sakshi Editorial Column On Global Investors Summit | Sakshi
Sakshi News home page

ఇది విశ్వసనీయత విజయం!

Published Sun, Mar 5 2023 3:49 AM | Last Updated on Sun, Mar 5 2023 7:32 AM

Sakshi Editorial Column On IT Industries

భోజరాజు ముఖం చూస్తే ఎవరికైనా కవిత్వం వచ్చేస్తుందట! రాజుగారికి వందిమాగధులు చేసిన పొగడ్త అలా సాహిత్యంలో నిలబడిపోయింది. అలాంటి ప్రయత్నమే మన ఎల్లో మీడియా చేసింది. మన బాబుగారు చిటికేస్తే అభివృద్ధి పరుగెత్తుకొస్తుందట! బాబుగారి ఇంట్లో తోక ఊపుకుంటూ ఆయన వెంట తిరిగే బొచ్చుకుక్క పేరే అభివృద్ధి అన్నట్టుగా మన మీడియా ప్రచారంలో పెట్టింది. ఏకపక్ష మీడియా ఏం చెప్పినా చెల్లు బాటవు తుందన్న ధీమా. ప్రజల ఇంగితం మీద చిన్నచూపు.

చంద్రబాబు అనే కొయ్యగుర్రాన్ని చెక్కడానికి ఎల్లో మీడియా ఎన్ని కోతలు కోసింది? భారత రాష్ట్రపతిగా అబ్దుల్‌ కలామ్‌ను బాబే ఎంపిక చేశారు. ప్రధాని పదవి చేపట్టే అవ కాశాన్ని చంద్రబాబు తృణప్రాయంగా తృణీకరించి దేవెగౌడను ఆ స్థానంలో కూర్చోబెట్టారు. ఆ తర్వాత గుజ్రాల్‌ను కూడా! హైదరాబాద్‌ను చంద్రబాబే నిర్మించారు. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ సృష్టికర్త ఆయనే! ఇటువంటి అతిశయోక్తులను ఎంతగా ప్రచా రంలో పెట్టారంటే చివరకు చంద్రబాబు కూడా వాటిని నిజ మనుకునే భ్రాంతిలోకి జారుకున్నారు. ఎల్లో మీడియా దెబ్బకు ఈ లేటు వయసులో పాపం చంద్రబాబు ఆ భ్రాంతిలోనే మరింత కూరుకుపోతున్నారు.

జనం నవ్వుకుంటున్నారన్న స్పృహ కూడా ఆయనకు ఉండటం లేదు. ‘తమ్ముళ్లూ! మీ కోసరం నేను సెల్‌ఫోన్‌ కని పెట్టాను. మీకోసరం కంప్యూటర్‌ను తయారు చేశాను. దాంతో మీరు దర్జాగా బతికేస్తున్నారు. ఐటీ ఉద్యోగాలు చేసేవాళ్లంతా నాకు రాయల్టీ చెల్లించాల’ని కూడా కలవరిస్తున్నారు. ‘నేను నిర్మించిన హైదరాబాద్‌ అభివృద్ధిని చూస్తే గర్వంగా ఉన్నది. ఇంతకంటే గొప్పగా నేను కట్టించిన అమరావతి మహానగరాన్ని జగన్‌మోహన్‌రెడ్డి కూల్చేస్తున్నాడు.’ – ఇలా ఎక్కడికి వెళ్లినా ఈ తరహా ప్రసంగాలే చేస్తున్నారు. తక్షణమే తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఈ పలవరింతలు మరింత ముదిరే అవకాశ మున్నది. ‘ఎవరక్కడ? నా కోహినూరు వజ్రాన్ని ఎవరో ఎత్తు కెళ్లారు... అయ్యో! నా నెమలి సింహాసనం కనిపించడం లేదు...’ వగైరా సంభాషణల్లోకి దిగకముందే ఆయనను ఎల్లో భ్రాంతి నుంచి బయటపడేయవలసిన అవసరం ఉన్నది.

చంద్రబాబు పేరుతో ఎల్లో మీడియా కట్టుకుంటూ వస్తున్న పేకమేడలు ఒకదాని వెంట ఒకటి కుప్పకూలుతున్నాయి. ప్రశస్తమైన పంచకళ్యాణిగా ఎల్లో మీడియా చాటింపు వేసిన అశ్వం కదల్లేని కొయ్య గుర్రమని తేలడానికి ఎంతో సమయం పట్టలేదు. ములాయంసింగ్‌ యాదవ్‌ సలహాపైనే రాష్ట్రపతి అభ్యర్థిగా అబ్దుల్‌ కలామ్‌ను వాజ్‌పేయి ఎంపిక చేశారని బీజేపీ నాయకులు బహిరంగంగానే ప్రకటించారు. యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు ప్రధాని పదవికి అన్ని పార్టీలూ ఏకాభిప్రాయంగా జ్యోతిబసు పేరును ముందుకు తెచ్చాయి. అయితే సీపీఎం అందుకు తిరస్కరించింది. ఫలితంగా రెండో ఛాయిస్‌గా దేవెగౌడను ఎంపిక చేశారు.

సీపీఎం నిర్ణయాన్ని ఒక ‘చారిత్రక తప్పిదం’గా ఆ తర్వాత కాలంలో జ్యోతిబసు అభివర్ణించారు. భారత రాజకీయ పరిభాషలో ఈ మాట ఒక కొత్త∙పదబంధంగా చేరిపోయింది. ఈ వ్యవహారంలో ఇంత కథ నడిస్తే మన ఎల్లో మీడియా మాత్రం చంద్రబాబే ప్రధాని పదవిని తిరస్కరించారని ప్రచారంలో పెట్టింది. చంద్రబాబు ఈ ప్రచారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లారు. ప్రధాని పదవిని తీసుకోవద్దనీ, రాష్ట్రానికే నీ సేవలు అవసరమున్నాయనీ తన కుమారుడు లోకేశ్‌ ఇచ్చిన సలహా మేరకు తిరస్కరించినట్టు బాబు చెప్పుకొచ్చారు. అప్పుడు లోకేశ్‌బాబు వయసు పద మూడు సంవత్సరాలు. నిజమే చినబాబు బాలమేధావే, ఇప్పటికీ!


హైదరాబాద్‌ ఐటీ అభివృద్ధిలో చంద్రబాబు పోషించినది నిజానికి నెగెటివ్‌ పాత్ర. కేంద్రంలో అప్పుడున్న పీవీ నరసింహారావు ప్రభుత్వం ఐటీలో హైదరాబాద్‌ ముందడుగు వేయ డానికి అవసరమైన పూర్వరంగాన్ని సిద్ధం చేసింది. తనకూ, తన వాళ్లకూ లబ్ధి చేకూర్చుకోవడం కోసం ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కూ, రియల్‌ వ్యాపారానికీ పూనుకోవడంతో ‘సైబర్‌ టవర్స్‌’ నిర్మాణంలో జాప్యం జరిగింది. దాంతో బెంగళూరు ముందడుగు వేయగలిగింది. చేసిన ద్రోహానికి నిందించాల్సింది పోయి ఆయనకు వీరతాడు వేసి కూర్చోబెట్టాం. ఎల్లో మీడియా పోషించిన పాత్రే అందుకు కారణం.

వైఎస్సార్‌ హయాంలో జరిగిన అభివృద్ధినీ, కేసీఆర్‌ హయాంలో జరుగుతున్న అభివృద్ధినీ కూడా తన ఖాతాలోనే వేసుకోవడానికి ఆయన ఏమాత్రం సంకోచించడం లేదు. చివరికి తెలంగాణ వాళ్లకు వరి అన్నం తినడం కూడా తామే నేర్పించామంటూ వదరుబోతుతనాన్ని ప్రదర్శించడం కూడా మొదలుపెట్టారు. కనీస చారిత్రక పరి జ్ఞానం లేక పోవడం వల్ల పట్టిన దౌర్భాగ్యం ఇది. ఇటువంటి దౌర్భాగ్యానికి విజనరీ అనే ముసుగేసి, ఎల్లో మీడియా తెలుగు రాష్ట్రాల ప్రజలను వంచనకు గురిచేసింది.


ఈ రెండు రోజులూ విశాఖలో జరిగిన ఇన్వె స్టర్ల సమ్మిట్‌ను చూసి బాబు కోటరీ, ఎల్లో మీడియా అధినేతలూ ఏమనుకుంటున్నారో... ఎలా ఉన్నారో? కడుపునిండా భోంచే శారో లేదో? కంటి నిండా కునుకు తీశారో లేదో? ... ఇటువంటి సంశయాలు జనసామాన్యంలో తలెత్తుతున్నాయి. సహజం. వారి ట్రాక్‌ రికార్డ్‌ అలాంటిది మరి! ఏమంటిరి.. ఏమంటిరి? పారిశ్రామికవేత్తలు చంద్రబాబు ముఖం చూసి పరుగెత్తు కొస్తారా? జగన్‌మోహన్‌రెడ్డిని చూస్తే పారిపోతారా? అరే భాయ్‌! జర దేఖో... నిన్నటి విశాఖ సభా వేదికను మరొక్కసారి రివైండ్‌ చేసి చూసుకోండి. అటువంటి దృశ్యాలను చూసి తట్టుకోవడం కొంచెం కష్టమే. అసలే గుండెపోటు ఉదంతాలు బాగా పెరిగిపోతున్నాయి. అయినా దిటవు చేసుకొని చూడాలి.

టాప్‌ మోస్ట్‌ బిజినెస్‌ హౌసెస్‌ ఆఫ్‌ ఇండియా, స్వయంగా వాటి అధిపతులు వరుసగా కూర్చున్న దృశ్యం అది. అభివృద్ధి పాలిటి అట్లకాడగా మీరు ప్రచారం చేసే చంద్రబాబు నిర్వహించినప్పుడు ఈ టాప్‌ సీఈఓలు ఎందుకు రాలేదు? చంద్రబాబు ఓ ఈవెంట్‌ మేనేజర్‌ అని అందరికీ తెలుసు కనుక. ఆయన చేస్తున్నది ఒక నాటక్‌బాజీ వ్యవహారమని తెలుసు కనుక! మరి జగన్‌మోహన్‌రెడ్డి పిలిస్తే ఎందుకు వచ్చారు? ఆయన రూపంలో నిలబడి ఉన్నది ఒక నిలువెత్తు విశ్వస నీయతగా వారు గుర్తించారు కనుక. వస్తే వచ్చారు. జగన్‌ మోహన్‌రెడ్డిని అంతగా పొగడాలా? వాస్తవాలు చెబుతున్నా మనుకున్నారే తప్ప ఇక్కడ కొన్ని ప్రాణాలు పిసుక్కు చస్తాయని వారికి తెలియదు కనుక!


వైఎస్‌ జగన్‌ దక్షత, దార్శనికత గల నాయకుడు కనుకనే సులభతర వాణిజ్యంలో ఏపీకి మొదటి ర్యాంకు దక్కిందని భారత వ్యాపార దిగ్గజం ముకేశ్‌ అంబానీ ప్రశంసించారు. ముఖస్తుతి కోసం మాట్లాడవలసిన అగత్యం అంబానీకి లేదనే సంగతి అందరికీ తెలిసిందే. అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ వాటి ఆధారంగా అభివృద్ధి ప్రణా ళికను రచించడం జగన్‌ ప్రత్యేకతగా కరణ్‌ అదానీ అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడుల స్వర్గధామంగా జగన్‌ మార్చారని నవీన్‌ జిందాల్‌ కొనియాడారు.

సంక్షుభిత పరి స్థితులను సమర్థంగా ఎదుర్కొన్న నాయకుడని కియా మోటార్స్‌కు చెందిన కబ్‌ డాంగ్‌లీ వ్యాఖ్యానించారు. దాల్మియా భారత్‌ గ్రూప్‌ ఎండీ పునీత్‌ దాల్మియా మాట్లాడుతూ ‘జే ఫర్‌ జగన్, జే ఫర్‌ జోష్‌’ అంటూ అభినందించారు. ఇంతమంది దిగ్గజాలను ఇక్కడికి రప్పించిన జగన్‌ సమర్థతను చూసి ఈ నేలతల్లి బిడ్డగా గర్వపడుతున్నానని జీఎమ్‌ఆర్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ గ్రంథి మల్లికార్జునరావు చెప్పారు. పారిశ్రామికవేత్తల ప్రశంసల్లో ఇవి కొన్ని మాత్రమే. జాతీయస్థాయిలో జగన్‌మోహన్‌రెడ్డి సంపాదించుకున్న విశ్వసనీయత ప్రచారం చేసుకోవడం వల్ల వచ్చింది కాదు. ఈవెంట్‌ మేనేజ్‌మెంట్లతో నిలబెట్టుకున్న నమ్మకం కాదిది. గడిచిన నలభై ఐదు మాసాలుగా అహరహం శ్రమించిన ఫలితం.

సోనియా ప్రభ దుర్నిరీక్ష్యంగా ఉన్న రోజుల్లోనే ఇచ్చిన మాటకోసం ఒక యువకుడు ఆమెను ధిక్కరించినప్పుడే జాతీయ స్థాయిలో కొన్ని వేల జతల కళ్లు ఇటువైపు తిరిగాయి. దేశంలోనే అత్యంత ప్రమాదకర కూటమిగా పేరున్న ఎల్లో సిండికేట్‌ను పిండికొట్టి ఒంటిచేత్తో అపూర్వ విజయం అందు కున్నప్పుడు మరికొన్ని వేల జతల కళ్లు జత కలిశాయి. ఆ కళ్లు మరింత విప్పార్చి చూడటం మొదలైంది. అధికారంలోకి వచ్చీ రాగానే శిథిలమైపోతున్న ప్రభుత్వ విద్యారంగంలోని బూజును దులపడం మొదలుపెట్టాడు.


కొందరు చాదస్తం అన్నారు. ఇది సాధ్యమయ్యే పనేనా అని ముఖం చిట్లించారు. ప్రతి పేదబిడ్డ నాణ్యమైన చదువు ఆంగ్ల మాధ్యమంలో చదవాలని అభిలషించాడు. తానే స్వయంగా పిల్లల బట్టలు, బూట్లు, బెల్టు, పుస్తకాల నాణ్యతను ఎంపిక చేశాడు. ఉచితంగా పిల్లలకు అందజేయించాడు. పిల్లలను బడికి పంపినందుకు పారితోషికంగా అమ్మ ఒడి నింపుతున్నాడు. వైద్య రంగంలోనూ అంతే! ‘నాడు–నేడు’ కార్యక్రమంతో రూపురేఖలు మార్చాడు. దశాబ్దాలుగా ఉన్న ఖాళీలను భర్తీ చేశాడు. ప్రతి ఊరికీ ప్రతి ఇంటికీ వైద్యం అందే ఏర్పాటు చేశాడు. గ్రామ గ్రామాన సెక్రటేరియట్‌లు ఏర్పాటు చేశాడు.

ఇంటింటికీ సంక్షేమాన్ని చేరవేర్చే వలంటీర్లు నియామకమయ్యారు. ఊరూరా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటయ్యాయి. కొమ్ములు తిరిగిన రాజకీయవేత్తలకు స్టోరీ బిగినింగ్‌ అర్థం కాలేదు. ఫ్లాప్‌ బొమ్మే అనుకున్నారు. ఆనందపడ్డారు. ప్రభుత్వ వైద్యరంగం మౌలిక వసతులు లేక కుప్పకూలి ఉన్న దశలో కోవిడ్‌ సంక్షోభం ఆవరించింది. యుద్ధరంగంలో నిలబడిన సైన్యాధ్యక్షుడిగా ముఖ్యమంత్రి వ్యవహరించారు. సంక్షోభం ముగిసేలోగానే ఇంకో పెను సంక్షోభం వచ్చినా ఎదుర్కోగల స్థాయిలో మౌలిక సౌకర్యాలను ఏర్పాటు చేయగలిగాడు.

సంక్షోభం తీవ్రంగా ఉన్నవేళ కోవిడ్‌తో సహజీవనం నేర్చు కోవలసిందేనని నిర్భయంగా ప్రకటించినప్పుడు చాలామంది నివ్వెర పోయారు. క్రమంగా అనేకమంది ప్రముఖులు, మేధా వులు అంతర్జాతీయ స్థాయిలో ఈ గొంతుతో శ్రుతి కలిపారు. అదే నిజమైంది. జగన్‌మోహన్‌రెడ్డి దార్శనికత బయటకు తెలి యడం మొదలైంది. మూడేళ్లు దాటేసరికి క్రమంగా జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలన బయట ప్రపంచానికి అర్థం కావడం మొదలైంది. భారత రాజ్యాంగ లక్ష్యాలను చిత్తశుద్ధితో అమలుచేయడానికి పూనుకున్నాడని అర్థమైంది. ప్రపంచ మానవాళికి తక్షణా వసరమైన సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన దిశగా పయ నిస్తున్నామని స్వయంగా ప్రభుత్వమే ప్రకటించింది.

ఒక్క రూపాయి లంచం లేకుండా లక్షల కోట్ల రూపాయలను నేరుగా ప్రజల చేతికి ప్రభుత్వం నగదు బదిలీ చేసింది. ఇలా చేస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుందని ప్రతిపక్షం, ఎల్లో మీడియా గగ్గోలు పెట్టాయి. కానీ, ఇదే రాష్ట్రాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించింది. జీఎస్‌డీపీ వృద్ధి రేటులో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెట్టింది కూడా ఇదే! పరిపాలనా విభాగాల్లో అలసత్వానికి తావులేకుండా నిత్యం సమీక్షించి సమాయత్తం చేయడంతోబాటు ఎస్‌ఓపీ ప్రమాణాలను ఏర్పాటు చేసుకోవడం ఉపయోగపడింది. డెలి వరీ మెకానిజంలో పేరుకుపోయిన మకిలి తొలగిపోయింది.

ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో మూడేళ్లు వరసగా మొదటి ర్యాంకు రావడంతో ప్రతిష్ఠ పెరిగింది. ముఖ్యమంత్రి స్వయంగా చెప్పినట్టు ఏపీలో పేదలకు, పెత్తందార్లకు మధ్యన యుద్ధం జరుగుతున్నది. పేద ప్రజలకు విద్య, ఉద్యోగ రంగాల్లో, రాజకీయ సామాజిక రంగాల్లో సమానావకాశాలు లభించాలంటే, వారు దీటుగా పోటీ పడాలంటే ప్రభుత్వం చేయూత అవసరమని జగన్‌ ప్రభుత్వం భావించింది. బలహీనవర్గాలతోపాటు మహిళల సాధికారతకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. దీన్ని సహజంగానే ఫ్యూడల్‌ భావజాలం కలిగిన పెత్తందార్లు అడ్డుకుంటారు.

అందుకే అక్కడ యుద్ధం జరుగుతున్నది. ఫ్యూడల్‌ భావ జాలాన్ని శాశ్వతంగా సమాధి చేయకుండా పెట్టుబడిదారీ వ్యవస్థ కూడా వేళ్లూనుకోలేదు. ఆర్థిక, రాజకీయ, సామాజిక, పాలనా సంస్కరణల్లో జగన్‌ ప్రభుత్వం చూపుతున్న చిత్తశుద్ధిని నిశితంగా గమనిస్తున్నారు కనుకనే విశాఖ సదస్సుకు పారిశ్రా మిక దిగ్గజాలు స్వయంగా హాజరయ్యారు. గడచిన నాలుగేళ్లుగా నిర్విరామంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి శ్రమకు ఫలితం ఇది. లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రం తలుపు తట్టబోతున్నాయి.

-వర్ధెళ్లి మురళి, vardhelli959@gmail.com
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement