వినాశ కాలే విపరీత బుద్ధిః | Vardhelli Murali Editorial Column | Sakshi
Sakshi News home page

వినాశ కాలే విపరీత బుద్ధిః

Published Sun, Feb 26 2023 3:22 AM | Last Updated on Mon, Feb 27 2023 8:06 AM

Vardhelli Murali Editorial Column - Sakshi

రక్తబీజుడు అనే అసురుని వృత్తాంతం మన పురాణాల్లో ఉన్నది. ఈ కథను చాలామంది వినే ఉంటారు. ఆ రాక్షసుడు అతిభయంకరంగా తపస్సు చేసి బ్రహ్మదేవుడిని వశపరచుకొని దారుణమైన ఒక వరాన్ని సంపాదించుకున్నాడు. వాడి ఒంటి నుంచి రాలే ఒక్కో రక్తపు బొట్టులోంచి ఒక్కో రక్తబీజుడు పుట్టుకొస్తాడు. అలా పుట్టుకొచ్చిన జూనియర్‌ రక్తబీజులు కార్చే ప్రతి రక్తపు బొట్టులోంచి ఒక్కో సబ్‌జూనియర్‌ రక్తబీజుడు ఉద్భవిస్తాడు. ఆ విధంగా ఒక్క నెత్తురు చుక్క నుంచే వేలమందితో కూడిన సైన్యాన్ని సృష్టించుకోగల వరాన్ని పొందడంతో వాడు చెలరేగి పోయాడు. అతడి దాష్టీకానికి, దోపిడీకి అతల సుతల సురాతల భూతలాది చతుర్దశ లోకాలూ గజగజ వణికిపోయాయి. దేవతలు హడలిపోయి పాహి... పాహి అంటూ పరుగులు తీశారు. చివరికి సర్వశక్తి స్వరూపిణి పార్వతీదేవి కాళీమాత అవతారాన్ని ఎత్తవలసి వచ్చింది. దైత్యుని దునుమాడి ఆ తల్లి లోకాలను కాపాడుకున్నదని దేవీ మహత్యం కథ ద్వారా మనకు తెలుస్తున్నది.

మహాకాళి తొమ్మిది ఛాయల్లో ఒకరు మన బెజవాడ కనకదుర్గమ్మ. అమ్మవారు కొండ మీద వేంచేసి ఉండగా కొండ కింద రక్తబీజుని అంశతో కూడిన రాజకీయాలు నేటికీ జరుగు తుండటం ఒక విషాదం. సాక్షాత్తూ అమ్మవారి సమక్షంలో క్షుద్రపూజలు కూడా చేసి రక్తబీజుని వారసత్వాన్ని ఈ ‘అంశాం’ కురాలు ఘనంగా చాటుకున్నాయి. మన దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ పట్టాలు తప్పకుండా ఉండాలని రాజ్యాంగ నిర్మాతలు చెక్స్‌ అండ్‌ బ్యాలెన్సెస్‌తో కూడిన పటిష్టమైన వ్యవస్థలను ఏర్పాటు చేశారు. శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు స్వతంత్రమైన మూడు స్తంభాలుగా వ్యవహరించాలని భావించారు. మీడియాను నాలుగో స్తంభంగా గౌరవించారు. ఎలక్షన్‌ కమిషన్, విజిలెన్స్‌ కమిషన్‌ వగైరాలను స్వతంత్ర సంస్థలుగా రూపొందించారు. రాజకీయ నాయకత్వం వ్యవస్థల మీద దండయాత్ర చేసి నియంతృత్వంలోకి దేశాన్ని మళ్లించకుండా పలు చర్యలను తీసుకున్నారు. 

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వ్యవస్థల మీదకు రాజకీయ నాయకత్వం జరుపుతున్న దండయాత్రలపై పలుమార్లు ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. బహిరంగ దండయాత్రలు కాకుండా చాపకింద నీరు మాదిరిగా వ్యవస్థల్లోకి పాక్కుంటూ వాటిని తనకు అనుకూలంగా మార్చుకునే విద్యలో పీహెచ్‌డీ చేసిన రాజకీయ నాయకుడు ఈ దేశంలో చంద్రబాబు ఒక్కడే. ఈ పాకుడు కళతోనే ముప్పయ్యేళ్లుగా ఆయన రాజకీయాల్లో కొనసాగగలుగుతున్నారు. రక్తబీజుడు వెదజల్లే నెత్తురులోంచి సైన్యాన్ని తయారుచేసుకున్నట్టు ఈయన వివిధ వ్యవస్థల్లో తన సైన్యాన్ని తయారుచేసుకున్నాడు. అందుకోసం ఏం వెద జల్లాడనేది రహస్యం. మీడియా అధిపతులను వ్యాపార మిత్రులుగా, ఆశ్రిత పెట్టుబడిదారులుగా మార్చుకొని, వారిచేత జేజేలు కొట్టించుకొని ఒక నాయకునిగా వ్యవహారంలోకి వచ్చాడు. ఈ మీడియా భజన కార్యక్రమం శ్రుతి మించడంతో అది ఎల్లో మీడియాగా ఏనాడో అప్రతిష్ఠను మూటకట్టుకున్నది.

న్యాయ వ్యవహారాల్లో ఎలా నెగ్గుకు రావాలో చంద్ర బాబుకు తెలిసినంతగా ఎవరికీ తెలియదని ఏ తెలుగువాడిని అడిగినా టక్కున చెప్పేస్తాడు. బెంచ్‌ హంటింగ్, నాట్‌ బిఫోర్‌ వంటి కోర్టు పదజాలం చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాతనే ప్రజల్లోకి వచ్చింది. తెలుగుదేశం పార్టీని ఎన్టీ రామారావు స్థాపించుకున్నాడనీ, దాని జెండాను, ఎన్నికల గుర్తును తానే డిజైన్‌ చేసుకున్నాడనీ నాటి తెలుగు ప్రజలకు తెలుసు. తెలుగుదేశం పార్టీలో ఆశ్రయం కోరుతూ ఒక శరణార్థి మాదిరిగా చంద్రబాబు ప్రవేశించాడని కూడా ప్రజలకు తెలుసు. అయినప్పటికీ ఆ పార్టీపై దురాక్రమణ చేసి హైకోర్టు ద్వారా దానికి న్యాయ ముద్రను వేయించుకున్న బాబు లాఘవం గురించి కూడా ప్రజలకు తెలుసు. ఎన్ని కేసులు వచ్చినా దర్యాప్తు జరక్కుండా స్టేలు తెచ్చుకోగల చాకచక్యం గురించి కూడా తెలుసు. రాజకీయ ప్రత్యర్థుల మీద శూన్యంలోంచి అభియోగాలు సృష్టించి పకడ్బందీగా కేసులు నడపగల దిట్ట అని కూడా తెలుసు.

కీలకమైన అనేక పబ్లిక్‌ విభాగాల్లో, దర్యాప్తు సంస్థల్లో తనకు అనుకూలమైన మానవ వనరులను గుప్పిట్లో పెట్టుకోవడంలో ఈయన ప్రావీణ్యం సంపాదించినట్టు ఇప్పటికే రుజువైంది. సీబీఐ, ఐటీ, విజిలెన్స్‌ వగైరా విభాగాల్లోని కొందరు వ్యక్తులు గతంలో చంద్రబాబు ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరించారని చాలా ఆరోపణలు కూడా వచ్చాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా వ్యవహరించిన ఒక అధికారి చంద్రబాబు అవసరాలకు అనుగుణంగా ఎముకలు మెడలో వేసుకొని మరీ వ్యవహరించిన తీరు తెలిసిన విషయమే. బాబు హయాంలో ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా పనిచేసిన అధికారి పచ్చ కండువాను బహిరంగంగా కప్పుకోవడం మాత్రమే మిగిలింది. ఆయన అప్రకటిత తెలుగుదేశం ప్రధాన కార్యదర్శిగా పనిచేశాడన్న ఆరోపణలున్నాయి.

ఇటువంటి చంద్రబాబుకు రామోజీ వంటి మీడియా అధిపతులు తోడుగా నిలబడి గడిచిన పాతిక ముప్పయ్యేళ్లుగా ప్రజాస్వామ్య వ్యవస్థపై జరుపుతున్న అత్యాచారాల కథలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తూనే ఉన్నాయి. రామోజీ గొంతెమ్మ కోర్కెలకు తలొగ్గనందువల్లనే, అక్రమాలకు సహకరించనందువల్లనే చంద్రబాబుతో కలిసి వెన్నుపోటు పొడిచారని ఎన్టీ రామారావు స్వయంగా ఆరోపించారు.

హైదరాబాద్‌ శివార్లలో ఫిలిం సిటీ సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడంలో రామోజీ అనేక అక్రమాలకు పాల్పడ్డారనేందుకు సాక్ష్యాలున్నాయి. ఈ అక్రమాలకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు తోడ్పాటు పూర్తిగా ఉన్నది. అసైన్డ్‌ భూములను కొనుగోలు చేయడం చట్టరీత్యా నేరం. కానీ రామోజీ వాటిని యథేచ్ఛగా కొనుగోలు చేసి చట్ట ఉల్లంఘనకు పాల్పడ్డారు. ‘నాలా’ చట్టాన్ని ఉల్లంఘించి అక్రమ నిర్మాణాలకు పాల్పడ్డారు, ఫిలిం సిటీలో ఇటువంటి అక్రమ నిర్మాణాలు 147 ఉన్నాయని ప్రభుత్వ అధికారులే లెక్క తేల్చారు.

600 మంది పేద ప్రజలకు ఇళ్ల స్థలాల కింద రాష్ట్ర ప్రభుత్వం పంచిపెట్టిన 16 ఎకరాల భూమిని కూడా రామోజీ తన కబ్జాలోనే ఉంచుకున్నారు. ఆ స్థలాన్ని అప్పగించాలని పలుమార్లు సీపీఎం ఆధ్వర్యంలో పేద ప్రజలు ప్రదర్శనగా వెళ్లారు. వారిని తరిమికొడుతున్నాడే తప్ప వారి భూమిని వారికి ఇప్పటికీ అప్పగించడం లేదు. తన ఫైవ్‌స్టార్‌ ఫిలిం సిటీ పక్కన పేదల ఇళ్లేమిటనే అసహ్య భావనతోనే రామోజీ వారిని తరిమేస్తున్నాడని అనుకోవాలి. ఈ అపూర్వ సహోదరుల భావసారూప్యత చూడండి.

అమరావతి ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలిస్తే సామాజిక సమతౌల్యత దెబ్బతింటుందని కోర్టుకే వెళ్లిన చంద్రబాబు.. ఫిలిం సిటీ చేరువలో పేదల ఇళ్లుంటే గ్లామర్‌ దెబ్బతింటుందని ప్రభుత్వం ఇచ్చిన భూమిలోకి లబ్ధిదారులు రాకుండా తరిమేస్తున్న వ్యక్తి రామోజీ.. ఇద్దరి ఐడియాలజీ పెత్తందారివర్గ ప్రయోజనాలే అని చెప్పడానికి ఈ ఉదాహరణలు చాలవా? ఇద్దరూ పేద ప్రజల సాధికారత బద్ధవిరోధులే అని చెప్పడానికి ఎన్ని దుష్టాంతాలు కావాలి? ప్రభుత్వ స్కూళ్లను బాగుచేస్తుంటే, ప్రజారోగ్య వ్యవస్థను పటిష్టం చేస్తుంటే వీరూ, వీరి అనుబంధ ఎల్లో మీడియా సంయుక్తంగా కళ్లల్లో నిప్పులు పోసుకోలేదా? పేద పిల్లలకు ఇంగ్లిష్‌ మీడియంలో పాఠాలు చెబుతుంటే గగ్గోలు పెట్టలేదా? ఇప్పటికీ పెట్టడం లేదా?

రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చట్టాన్ని రామోజీ బాహాటంగా ఉల్లంఘించిన విషయం ప్రజలకు తెలిసిందే. నిబంధనలకు విరుద్ధంగా ఆయన 2,600 కోట్ల రూపాయల డిపాజిట్లను వసూలు చేశారు. ఈ నేరానికి రెండేళ్ల జైలు, రెట్టింపు సొమ్ము అంటే రూ. 5,200 కోట్ల జరిమానా పడాలి. కానీ రిలయన్స్‌ దగ్గర అప్పుచేసి ఆ సొమ్ము తిరిగి చెల్లించాను కనుక కేసు తూచ్‌ అంటున్నారు రామోజీ. దొంగతనం బయటపడిన తర్వాత ఆ దొంగసొత్తును వెనక్కు ఇచ్చేస్తే శిక్ష ఉండదా? భారత శిక్షాస్మృతిలో అటువంటి వెసులుబాటు ఏమైనా ఉన్నదా?

చంద్రబాబు అండ్‌ కో లోని కీలక సభ్యులంతా ఇటువంటి గురువింద గింజలే. ఈ గింజలన్నీ కలిసి ఇప్పుడొక ఉద్యమానికి శ్రీకారం చుట్టాయి. ఈ ముఠాలోని కమెండోల్లాంటి కీలక సభ్యులను ముందుజాగ్రత్త కోసం చంద్రబాబు ఎప్పుడో బీజేపీలో చేర్పించారు. తమ ప్రయోజనాల కోసం ఏ గడ్డి కరిచేందుకైనా, ఏ జెండా మోసేందుకైనా ఏమాత్రం సిగ్గుపడని షార్ప్‌ షూటర్స్‌ వీళ్లంతా. చంద్రబాబుకు అనుకూలంగా జాతీయస్థాయిలో వ్యవస్థలను మేనేజ్‌ చేసే కార్యక్రమంలో వీళ్లంతా ఇప్పుడు బిజీగా మారిపోయారు. నిత్య అసత్య వ్రత కథనాలతో ఎల్లో మీడియా విరుచుకుపడుతున్నది. వ్యవస్థల్లో ప్రవేశపెట్టిన డమ్మీ రక్తబీజులంతా ఏకకాలంలో ఒకే రాగం తీస్తున్నారు. విషయం సుస్పష్టం. సాఫ్‌ సీదా.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ స్వయంగా చెప్పినట్టు ఇప్పుడక్కడ వర్గపోరు జరుగుతున్నది. పేదల అనుకూల విధానాలను జగన్‌ ప్రభుత్వం ప్రబలంగా అమలు చేస్తున్నది. పెత్తందారీవర్గ ప్రయోజనాలు దెబ్బతింటున్నాయి. ఈ వర్గానికి నాయకత్వం వహిస్తున్న బాబు–రామోజీ ముఠా స్వార్థ ప్రయోజనాలకు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ట్రెజర్‌ హంట్‌ స్వప్నం కరిగిపోతున్నది. రాజధాని పేరుతో తలకెత్తుకున్న లక్షల కోట్ల వ్యాపారం చెదిరిపోతున్నది. భూములపై పెట్టుబడి పెట్టిన వారిలో అసహనం పెరుగుతున్నది. ఎన్నికల దాకా ఆగేంత ఓపిక లేదు. ఎన్నికల్లో గెలుస్తామన్న ఆశ లేదు. కోట్ల రూపా యలు తగలేసి మూడు నెలలకోసారి నిపుణుల చేత చేయించుకుంటున్న సర్వేలు వెక్కిరిస్తున్నాయి. ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి అంతో ఇంతో ఓట్ల శాతం పెరగాలి. గత ఎన్నికల్లో టీడీపీకి 39 శాతం ఓట్లు వచ్చాయి. ఫిబ్రవరి మొదటివారంలో వచ్చిన సర్వే ఫలితాలు కరకట్ట అతిథిగృహం గుండెల్లో డైనమైట్లను పేల్చాయి.

తెలుగుదేశం పార్టీకి మద్దతు దారుణంగా 26 శాతానికి పడిపోయిందని సర్వేలో వెల్లడైంది. గడిచిన మూడు నెలల్లో ఐదు శాతం పతనం. ఈ స్థాయి పతన దశలో వున్న పార్టీ బతికి బట్టగట్టి ఏడాది లోపల ఎన్నికలకు సమాయత్తం కావడం అసాధ్యం. ఈ సర్వే ఫలితాలను ఎంత రహస్యంగా ఉంచుదామనుకున్నా కుదరలేదు. పార్టీ శ్రేణుల్లో చాలామందికి తెలుసు. మిత్రపక్షాలకూ తెలుసు. మన బలాన్ని బట్టే కదా పొత్తు కుదుర్చుకునేవారు బేరమాడేది. ఈపాటికే బయల్దేరవలసిన పవన్‌ కల్యాణ్‌ వారాహి రథం ఎందుకో బయల్దేరలేదు. ఎల్లో ముఠాకు కవి హృదయం అర్థమైంది. కడుపుమంట పుట్టుకొచ్చింది. పవన్‌ కల్యాణ్‌కు కేసీఆర్‌ వెయ్యి కోట్లతో బేరం పెట్టారని బ్లాక్‌ మెయిలింగ్‌కు దిగింది. ఐననూ కదలిక లేదు. బహుశా ఇప్పటికే కుదిరిన ఒప్పందాన్ని తిరగరాయాల్సి రావచ్చు.

లోకేశం బాబు శనివారం నాడు ఎన్టీఆర్‌ బావకు నర్మగర్భంగా ఆహ్వానం పలి కాడు. ఇదొక విశేషం. లోకేశం బావ కారణంగానే ఎన్టీఆర్‌ బావ తెలుగుదేశం పార్టీకి దూరమయ్యాడనేది బహిరంగ రహస్యం. తెలుగుదేశం పార్టీని ఇప్పుడున్న స్థితి నుంచి పైకి లేపడానికి ఎన్టీఆర్, పవన్‌ కల్యాణ్‌లే కాదు... అమితాబ్‌ బచ్చన్, రజనీకాంత్‌ వంటి క్రేన్లను ఉపయోగించినా ఫలితముండదు.

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంపై కట్టుకథల ప్రచారం చాలాకాలం నుంచి జరుగుతున్నదే. ప్రభుత్వం జనరంజక కార్యక్రమాలను అమలుచేస్తున్న ప్రతి సందర్భంలోనూ మీడియా దృష్టి మళ్లించేందుకు ఏదో ఒక రభసను సృష్టించే ప్రయత్నాలను కూడా తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ప్రారంభించింది. నవంబర్‌ సర్వే ఫలితాల తర్వాత వేగాన్ని మరింత పెంచింది. ఫిబ్రవరి ఫలితాలతో పార్టీ పెద్దలతోపాటు మీడియా పెద్దలు కూడా విచక్షణ కోల్పోయారు. అనపర్తిలో, గన్నవరంలో గోక్కోవడం ఈ విచక్షణా రాహిత్యంలో భాగమే. ఎన్ని అసత్యాలు రాసేందుకైనా, ప్రసారం చేసేందుకైనా వెనుకాడేది లేదన్నట్టుగా ఎల్లో మీడియా రెచ్చిపోతున్నది. తానే రెచ్చగొట్టి సవాల్‌ చేసి, గన్నవరం వెళ్లిన పట్టాభిని పోలీసులు కొట్టినట్టుగా ఈనాడు బ్యానర్‌ వార్తలను వండేయడం క్షుద్రవిద్యకు పరాకాష్ట. ఇందుకోసం రెండేళ్ల కిందటి ఫోటోలను ఈనాడు నిస్సిగ్గుగా వాడేసింది. నడిరోడ్డు మీద గుడ్డలూడదీసుకొని పత్రికారంగ మాన మర్యాదలను మంటగలిపింది.

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ ప్రతిష్ఠను మసకబరచడానికి ఎంత దారుణానికైనా దిగజారేందుకు తెలుగుదేశం, ఎల్లోమీడియాలు సిద్ధంగా ఉన్నాయని ఇటీవలి పరిణామాలన్నీ నిరూపిస్తున్నాయి. 2019లో జరిగిన వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసును ఎల్లో మీడియా పలురకాల మలుపులు తిప్పుతున్న తీరు పెద్ద ఆశ్చ ర్యాన్ని కలిగించడం లేదు. ఎందుకంటే గతంలో వైఎస్‌ జగన్‌పై దాఖలైన తప్పుడు కేసుల దర్యాప్తు సందర్భంగా కూడా కొందరు దర్యాప్తు అధికారులతో కలిసి ఈ ముఠా ఇదే వ్యూహాన్ని అమలు చేసింది. శుక్రవారం నాడు సీబీఐ అధికారులను కలిసిన సంద ర్భంగా మీడియాతో మాట్లాడుతూ వైఎస్‌ అవినాశ్‌రెడ్డి చెప్పిన మాటలు గమనించదగ్గవి. కేసు దర్యాప్తు ఫ్యాక్ట్స్‌ టార్గెట్‌గా కాకుండా పర్సన్‌ టార్గెట్‌గా జరగడం సరికాదని అవినాశ్‌ అన్నారు. ఎవరినో ఇరికించే ఉద్దేశంతోనే దర్యాప్తు జరుగు తున్నట్టు స్పష్టంగా కనిపిస్తున్నది. ప్రాథమిక సాక్ష్యాలను, వాస్త వాలను విస్మరిస్తూ దర్యాప్తు జరుగుతున్నదని ఇంగిత జ్ఞానానికి కూడా అవగతమవుతున్నది.

ఈ కేసులో నిందితుడుగా వున్న సునీల్‌ యాదవ్‌ అనే వ్యక్తి బెయిల్‌ పిటీషన్‌ వేసుకుంటే దాని మీద సీబీఐ కౌంటర్‌ వేసింది. ఆ కౌంటర్‌లోకి అవినాశ్‌రెడ్డి పేరును లాక్కొచ్చింది. తెల్లారి ఎల్లో మీడియాలో ‘అవినాశ్‌ ఇంట్లో సునీల్‌’, ‘అవినాశ్‌రెడ్డే’ వంటి పతాక శీర్షికలతో మసాలా వార్తలు వచ్చాయి. అవి చదివినవారు హత్య వెనుక అవినాశ్‌రెడ్డి హస్తముందని అనుకోవాలి. హత్య జరిగిన రోజు రాత్రి సునీల్‌ యాదవ్‌ అనే వ్యక్తి అవినాశ్‌ ఇంట్లో ఉన్నాడని గూగుల్‌ చెప్పిందట. గూగుల్‌ చెప్పింది గనుక అదే నిజమని అఫిడవిట్‌లో సీబీఐ పేర్కొన్నది.

కానీ, ఆరోజు రాత్రి మూడు గంటలపాటు తానూ సునీల్‌ యాదవ్, నందిక అనే ఆస్పత్రి వద్ద కలిసే ఉన్నామని భరత్‌ యాదవ్‌ అనే విలేకరి చెప్పిన విషయాన్ని, ఇచ్చిన వీడియో సాక్ష్యాన్ని సీబీఐ పరిగణనలోకి తీసుకోలేదు. వివేకా రాసినట్టు చెబుతున్న లేఖ హత్యాస్థలంలో ఆయన పీఏ కృష్ణారెడ్డి దాచి పెట్టాడు. పొద్దున అక్కడికి వచ్చిన అవినాశ్‌కు గానీ, పోలీసులకు గానీ వెంటనే ఆ లేఖను ఇచ్చి ఉన్నట్లయితే అది హత్య అనే విషయం వెంటనే తెలిసి ఉండేది. లేఖను ఎవరికీ ఇవ్వొద్దని వివేకా అల్లుడు ఎందుకు ఆదేశించినట్టు? వివేకానందరెడ్డి రెండో వివాహం చేసుకోవడం వారి కుటుంబంలో పెద్ద వివాదానికి కారణమైంది.

రెండో కుటుంబానికి ఆస్తిలో వాటా ఇవ్వడానికి వివేకా నిర్ణయించారన్నది కూడా రహస్యమేమీ కాదు. ఈ నిర్ణయాన్ని మొదటి భార్య, కూతురు, అల్లుడు రాజశేఖరరెడ్డి, అల్లుని సోదరుడు శివ ప్రకాశ్‌రెడ్డి (వీరు వివేకా మొదటిభార్య సోదరులు) వ్యతి రేకిస్తున్నారు. కేసులో నిందితులైన ఎర్ర గంగిరెడ్డి, సునీల్‌ యాదవ్, ఉమాశంకర్‌రెడ్డి, దస్తగిరి చాలాకాలంగా వివేకాకు సన్నిహితులు. ఆ కారణంగా ఆయన మొదటి కుటుంబ సభ్యులతో కూడా వారికి సాన్నిహిత్యం ఉన్నది. కేసు దర్యాప్తులో ఈ ప్రాసంగిక కోణం కనిపించడం లేదేమన్న అనుమానం సాధారణ ప్రజల్లో కూడా ఉన్నది.

ఏమైనా సీబీఐ దర్యాప్తు జరుగుతున్నది. న్యాయస్థానం విచారణ పూర్తి చేయవలసి ఉన్నది. ఈలోగానే ఎల్లో మీడియా నిత్యం తీర్పులు రాసేయడం, వారికి దర్యాప్తు అధికారుల నుంచి లీకులు అందడం విలువల పతనానికి పరాకాష్ట. ప్రజా కోర్టులో వైఎస్‌ జగన్‌ను గెలవ లేమన్న భీతితోనే ఈ కూటమి ఉన్మాదపూరితంగా వ్యవహరిస్తున్నదని అనుకోవాలి.


-వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement