Vardhelli Murali View On Chandrababu Street Deaths Politics - Sakshi
Sakshi News home page

కుట్రపూరితం వీధి నాటకం!

Published Mon, Jan 9 2023 7:08 AM | Last Updated on Mon, Jan 9 2023 8:46 AM

Vardhelli Murali View On Chandrababu Street Deaths Politics - Sakshi

ఒకనాడు కొండంత రాగం తీసిన మన తెలుగు పద్యనాటక వైభవం అంతరించిందని చింతించవలసిన అవసరం లేదు.  రంగస్థలం మీద మహేంద్రజాలం చేయగలిగిన సురభి వారి ప్రజ్ఞాధురీణత మాయమైపోయిందని బాధ పడనవసరం లేదు. ఇప్పుడు తెలుగుదేశం  పార్టీ వారు ఆ లోటును తీర్చేస్తున్నారు. నిజ రాజకీయాన్నే వీధి నాటకంగా మార్చి అధునాతన కళా కౌశలాన్నంతా అందులో రంగరిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల వ్యూహకర్తగా రాబిన్‌సింగ్‌ అనే ఆయన వ్యవహరిస్తున్నారట! చంద్రబాబు సభలకు వస్తున్న జనం సంఖ్య, వారి స్పందన ఆయనకు నిరాశ కలిగించిందట!.

ఈ మేరకు పార్టీ నాయకత్వానికి తన అభిప్రాయాలను వ్యూహకర్త నివేదించారట. జనం నాయకుని కోసం ఎదురు చూస్తున్నట్టుగా, నాయకుని కోసం ఎగబడుతున్నట్టుగా చిక్కగా తనకు విజువల్స్‌ కావాలని, అందుకు ఏర్పాట్లు చేయాలని అడిగారట. పార్టీ మేధో బృందం ఓ మూడు పద్ధతులను ఇందుకోసం రూపొందించింది. మొదటిది కుంభాకార దర్పణ (Convex Lens) టెక్నిక్‌. రెండోది ప్రలోభ ( Luring) టెక్నిక్, మూడోది కట్‌–పేస్ట్‌ టెక్నిక్‌.

మొదటి పద్ధతికి ఉదాహరణ కందుకూరు విషాదం. కుంభాకార దర్పణం అంటే గోరంతను కొండంతగా చూపడమన్నమాట. సభకు వచ్చిన జనాన్ని పది పన్నెండింతలు పెంచి చూపెట్టే ప్రయత్నం. ఈ ప్రయోగం ఫలితమే కందుకూరు విషాదం. పోలీసులు అనుమతించిన సర్కిల్‌లోనే సభ జరిగి వుంటే ఎనిమిది ప్రాణాలు పోయేవి కాదు. కానీ సభ పేలవంగా జరిగినట్టు కనిపించేది. జనాకర్షణలో బాబు బలహీనత స్పష్టంగా తెలిసేది. అందుకని పక్కనే ఉన్న ఇరుకు సందులోకి వచ్చిన రెండువేల మందిని గొర్రెల మందను మళ్లించినట్టుగా తరిమేశారు. సందులో ఒత్తిడి పెరిగింది. వాళ్లు తిరిగి సర్కిల్‌లోకి రాకుండా చంద్రబాబు తన వాహనాన్ని 50 మీటర్లు ముందుకు ఉరికించి సందుకు అడ్డంగా నిలబెట్టారు. సీసా మూతికి బిరడా బిగించినట్టుగా తొక్కిసలాట మొదలైంది. అదే టీడీపీ బృందానికి కావల్సింది. 

రెండో టెక్నిక్‌ను ప్రయోగాత్మకంగా గుంటూరులో అమలు చేశారు. సమాజ సేవనే గాలిగా పేల్చుకునే ఒకానొక ఎన్‌ఆర్‌ఐ మహానుభావుడు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడని చెబుతున్నారు. ఆ వ్యక్తిపేరు ఉయ్యూరు శ్రీనివాస్‌. కార్యక్రమానికి అనుమతి మాత్రం టీడీపీ తీసుకున్నది. వచ్చివవాళ్లకు ఈ మహానుభావుడు చీరెసారెలు పంచుతారని పది రోజులపాటు ప్రచారం చేసుకున్నారు. సుమారు 30 వేలమందికి టోకెన్లు పంచారట. వచ్చినవాళ్లకు కానుకలు పంచకుండా చంద్రబాబు వచ్చేంతవరకు నాలుగు గంటలపాటు కూర్చోబెట్టారు. చంద్రబాబు ప్రసంగిస్తున్నంతసేపు డ్రోన్‌ కెమెరాలు వాటి పని అవి నిర్వర్తించాయి. ‘బాబుకోసం తండోపతండాలుగా తరలివచ్చి ఆయన ఉపన్యాసాన్ని వింటున్న జనం’ అనే కాన్సెప్టుకు తగినట్టు ఫోటోలు తయారుచేసుకున్నారు. పాపం వచ్చిన వారు మాత్రం ‘చిత్తం శివుడి మీద భక్తి చెప్పుల మీద’ అన్నట్టుగా కానుకల కోసం ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు వెళ్లిపోయిన తర్వాత రెండువేల మందికి సరిపడా తెచ్చిన కానుకలను బిస్కెట్ల మాదిరిగా విసిరేశారు. ఫలితంగా దుర్ఘటన చోటుచేసుకున్నది. ఉయ్యూరు శ్రీనివాస్‌ తరహా సంఘసేవకులను మరో పదిహేను మందిని చంద్రబాబు సిద్ధం చేసి ఉంచారని చెబుతున్నారు. ఎన్నికలయ్యేవరకు నెలకొకరు చొప్పున గుంటూరు తరహా చీరెసారెల సభలు నిర్వహించాలి. అందుకుగాను సదరు సేవకుల అభిరుచిని బట్టి ఎమ్మెల్యే టిక్కెట్లు గానీ, గెలిస్తే కాంట్రాక్టులు గానీ హామీ ఇచ్చారట!.

ఇక మూడో టెక్నిక్‌ – ‘కాపీ–పేస్ట్‌’ పద్ధతి. బహుశా సోషల్‌ మీడియాకే పరిమితం చేస్తారు కాబోలు. కర్ణాటకలో సిద్ధేశ్వర స్వామి అనే మఠాధిపతి చనిపోతే ఆయన అంతిమయాత్రకు రెండు లక్షలమంది హాజరయ్యారు. ఆ ఫొటోను తెచ్చి చంద్రబాబు కుప్పం పర్యటనలో పాల్గొన్న జనసందోహమంటూ ప్రచారంలో పెట్టారు. ఎవరూ కనిపెట్టి కౌంటర్‌ చేయకపోతే ఇటువంటి ఫోటోలతో సోషల్‌ మీడియా ప్రచారం ముమ్మరంగా సాగించే అవకాశమున్నది. ఎన్నికలు దగ్గరపడేకొద్దీ ఏదో ఒకరోజున అన్నాదురై అంతిమయాత్ర ఫోటో కూడా టీడీపీ ఖాతాలో పడుతుందేమోనని భయంగా ఉన్నది. కోటిన్నర మంది పాల్గొని ప్రపంచంలోనే అతిపెద్ద జనసందోహంగా రికార్డయిన ఘట్టమది.
 
చంద్రబాబునాయుడు కుట్రపూరిత రాజకీయాల గురించి, ఆయన గురువింద నీతిపై తెరలు కప్పే ఎల్లో మీడియా మ్యాజిక్‌ గురించి తెలుగు ప్రజల్లో చాలామందికి తెలుసు. కానీ, ఇప్పుడు జరుగుతున్న కుట్ర మరింత ప్రమాదకరమైనది. ఈ కుట్రకు సంబంధించిన అంశాలు ఒక్కటొక్కటే ఆవిష్కృతమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని సంపన్న వర్గాలు... ముఖ్యంగా రెండున్నర పాత జిల్లాల సంపన్నవర్గా్గల కనుసన్నల్లో ఈ దారుణమైన కుట్ర పురుడుపోసుకున్నది. ఈ వర్గాల ప్రయోజనాలకోసం భుజంకాసే నాయకత్వ శ్రేణులు కుడినుంచి ఎడమకు అన్ని పార్టీల్లోనూ ఉన్నారు. సాంస్కృతిక సాహిత్య రంగాల నుంచి ప్రజాసంఘాల వరకు విస్తరించి ఉన్నారు. వివిధ వృత్తి సంఘాల్లోనూ పాతుకొనిపోయి ఉన్నారు. రకరకాల వ్యవస్థల్లో స్లీపర్‌సెల్స్‌ అవతారంలో పొంచి ఉన్నారు. కుట్రకు సంబంధించిన ప్రణాళిక, అందులో భాగస్వాములు పోషించవలసిన పాత్రల గురించి మార్గదర్శకాలు ఇప్పటికే అందరికీ జారీ అయ్యాయి. ఇంతకూ ఏమిటా కుట్ర?.

ఆంధ్రరాష్ట్ర సహజ వనరులనూ, ఆదాయాలను ఇంతకాలంగా దోచుకు తింటున్న కొన్ని పందికొక్కులకు ఇప్పుడు ఊపిరి సలపడంలేదు. వాటికి ‘మేత’ దొరకడం లేదు. ఆ ‘మేత’కు అభివృద్ధి అనే అందమైన పేరును పందికొక్కులు తగిలించుకున్నాయి. ‘అభివృద్ధి ఎక్కడుందీ?’ అని అవి ప్రశ్నిస్తున్నాయి. ‘ఔనౌను అభివృద్ధే కానరావడం లేద’ని ఈ ‘మేత’ కొక్కులకు వంతపాడే నేతలంతా అభిప్రాయపడుతున్నారు. ఎల్లో మీడియా అదే పాట పాడుతున్నది. దాని అనుబంధ సోషల్‌ మీడియా కోరస్‌ పాడుతున్నది.
రెండు లక్షల కోట్ల రూపాయలను లబ్దిదారులకు ప్రత్యక్షంగా బదిలీ చేస్తే పందికొక్కులు తవ్వుకునేదెట్లా? ఇంకో లక్షన్నర కోట్లను నవరత్నాల పేరుతో పేదవర్గాల సాధికారతకు ఖర్చు పెడితే పందికొక్కులు చిక్కిపోవా? విద్య, వైద్యం, వ్యవసాయం, చిన్న  పరిశ్రమల పునరుజ్జీవం కోసం వేలకోట్లు ధారపోస్తుంటే తాము మింగేందుకు ఏం మిగులుతుంది? పతితులుగా, భ్రష్టులుగా, దగాపడిన తమ్ములుగా ముద్ర వేయించుకున్న నిరుపేదలు నిటారుగా నిలబడితే, మనుషులుగా బలపడితే చీప్‌ లేబర్‌ దొరికేదెట్లా? వనరులన్నింటినీ తమ చేతికి అందివ్వకుండా, ఆదాయాన్ని తమ నోట్లో కుక్కకుండా, చీప్‌ లేబర్‌ దొరక్కుండా ప్రభుత్వమే పూనుకుంటే ఇక ‘అభివృద్ధి’ ఎట్లా? ఇదే ఇప్పుడు అభివృద్ధిపై జరుగుతున్న తర్కవితర్కం.

ఈ రకమైన ‘అభివృద్ధి’కి అడ్డుగోడగా నిలబడిన జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని కూలదోయాలి. యాభై శాతానికి పైగా ప్రజా మద్దతున్న ప్రభుత్వాన్ని ఓడించడం ఎలా సాధ్యం? ఆ మద్దతును తగ్గించాలి. నాన్‌–వైసీపీ పార్టీల ఓట్లు చీలకుండా ఒక్కచోటుకు చేర్చాలి. అలా ఒకచోటుకు చేర్చడం కోసం ‘సేవ్‌ డెమోక్రసీ’ అనే ముసుగు కావాలి. ఆ ముసుగు కోసమే వీధి నాటకాల ప్రదర్శనలు. ప్రతిపక్ష నేతల సభలకు జనం విరగబడుతున్నారన్న మూడ్‌ను సృష్టించడంతోపాటు తొక్కిసలాటలూ, గలాటాలూ జరగాలి. కొన్ని ప్రాణాలు పోయినా ఫరవాలేదు. శాంతిభద్రతలు క్షీణించాయని ప్రచారం చేసుకోవచ్చు. ప్రజా భద్రతకు ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకున్నా ‘సేవ్‌ డెమోక్రసీ’ నినాదంతో అందరినీ ఏకం చేయాలి. ఇదీ ఇప్పుడు చంద్రబాబు పార్టీ, ఎల్లో మీడియాల సారథ్యంలో పెత్తందారీ వర్గాలు ప్రదర్శిస్తున్న నాటక సారాంశం. నాటకం పేరు ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక.

‘సేవ్‌ డెమోక్రసీ’ పేరుతో విజయవాడలో సకలపక్ష సమావేశం జరిగింది. పవన్‌ కల్యాణ్‌ – చంద్రబాబులు మొన్న విజయవాడలోనూ, నేడు హైదరాబాద్‌లోనూ సమావేశమయ్యారు. ఈ భేటీలకు కూడా అదే పేరు పెట్టారు. పేద పిల్లల ఇంగ్లిష్‌ మీడియానికి వ్యతిరేకంగా ఎక్కుపెట్టిన ప్రపంచ రచయితల సభలైనా, వికేంద్రీకరణకు వ్యతిరేకంగా గురిపెట్టిన ఉత్తరాంధ్ర చర్చా వేదికైనా ఈ మొత్తం కుట్రలో భాగంగానే పరిగణించాలి. తెలుగు సినిమాల ప్రీరిలీజ్‌ ఈవెంట్లు హైదరాబాద్‌ గడప దాటి ఆంధ్రలోకి ఎంట్రీ ఇవ్వడాన్ని, సినిమా నటులు నిర్వహిస్తున్న టాక్‌ షోలను కూడా నిశితంగా పరిశీలించవలసిన అవసరం ఉన్నదేమో!.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్‌ 1 పై జరుగుతున్న ప్రచారాన్ని చూస్తుంటే దిగ్భ్రాంతికి గురికావలసి వస్తున్నది. దిగజారుడుతనం చిట్టచివరి మెట్టును కూడా దిగేసింది. అసలా జీవోలో రోడ్డు షోలపై, ర్యాలీలపై నిషేధమే లేదు. సభలను కూడా రోడ్డు మీద కాకుండా సమీపంలో ఉండే మైదానాల్లో పోలీసుల అనుమతితో నిర్వహించుకోవచ్చని చెప్పింది. జీవో అనేది బహిరంగ రహస్యం. ఎవరైనా చదువుకునే అవకాశం ఉన్నది. అటువంటి నగ్నసత్యంపై మసిపూయడానికి తెగించడం ఎల్లో మీడియా, ప్రతిపక్షాల తెంపరితనానికి నిదర్శనం. ఈ అసత్య ప్రచారం ప్రాతిపదికగా ఒక ప్రజాస్వామ్య పరిరక్షణ వేదికను నిర్మించడానికి పూనుకోవడం ఒక దుర్మార్గమైన నిస్సిగ్గు ఎత్తుగడ. ప్రజల వివేకాన్ని కూడా అవహేళన చేసే చర్య.

నిజానికి రాజ్యాంగబద్ధమైన ప్రాథమిక హక్కులపై సైతం రాజ్యాంగ బద్ధమైన కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19, క్లాజు 1లోని సబ్‌క్లాజు ‘బి’ ప్రకారం ‘పౌరులందరికీ శాంతియుతంగా, ఆయుధాల్లేకుండా సమావేశమయ్యే హక్కు’ ఉన్నది. క్లాజు 3లో ఇందుకు సంబంధించిన వివరణ కూడా ఉన్నది. దేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను పరిరక్షించడానికి, ‘పబ్లిక్‌ ఆర్డర్‌’ను కాపాడటానికి ఉద్దేశించి ఇప్పటికే అమలులో ఉన్న చట్టానికి కానీ, కొత్తగా చేసే చట్టానికి గానీ ఈ సమావేశ హక్కు అవరోధంగా ఉండదు. పబ్లిక్‌ ఆర్డర్‌ అనే మాటలో ప్రజల భద్రత అనే అంశం కూడా ఇమిడి ఉంటుందని న్యాయకోవిదుల అభిప్రాయం. అంటే ప్రజాభద్రతకోసం ఈ ప్రాథమిక హక్కుపై కొన్ని ఆంక్షలు పెట్టవలసి వస్తే అవి చెల్లుబాటు అవుతాయి. కానీ, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ఆంక్షలూ పెట్టలేదు. కేవలం సమావేశాలను రోడ్డుపై కాకుండా మైదానంలో పెట్టుకోవాలని జీవో సూచించింది. ఈ జీవోను నల్ల చట్టానికి పుట్టిన బిడ్డగా విపక్షం, ఎల్లో మీడియా అభివర్ణిస్తున్నాయి. నిజాల మీద మసి పూస్తున్నాయి. బరి తెగించి బట్టలూడదీసుకొని నర్తిస్తున్నాయి. చంద్రబాబు హయాంలో ఇదే చట్టాన్ని యధేచ్ఛగా వాడిన వైనాన్ని దాచేస్తున్నాయి. జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రకు అనేక ఆంక్షలు పెడుతూ అప్పటి డీజీపీ ప్రెస్‌మీట్‌ పెట్టిన విషయాన్ని కూడా మరుగుపరిచే ప్రయత్నం చేస్తున్నారు.


వర్ధెల్లి మురళి 
:::vardhelli1959@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement