ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలో చట్టసభల ప్రాధాన్యత, విలువ ఎనలే నివి. ఈ సంగతి సామాన్యులకు తెలిసిన పాటికూడా ఎన్నికవుతున్న ప్రజాప్రతినిధులకు తెలియడంలేదు. లేకుంటే ఢిల్లీ రాష్ట్రం గత అయిదు నెలలుగా ప్రభుత్వమనేది లేకుండా అనాథగా మిగిలిపోదు. ఈ విషయంలో సామాన్యులది అరణ్యరోదనే అవుతున్నదని తెలిసి కాబోలు సర్వోన్నత న్యాయస్థానం ఢిల్లీ అసెంబ్లీ విషయంలో అయిదు వారాల్లోగా ఏదో ఒక నిర్ణయం తీసుకోమని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదే శించాల్సి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అక్కడ ఏ ఏ అం శాలు చర్చకొచ్చాయో, వాటి ప్రాముఖ్యమేమిటో రాజకీయ పార్టీలకు తెలియంది కాదు. అందులో అత్యంత ప్రధానమైనది క్షీణిస్తున్న శాంతి భద్రతలు. షీలా దీక్షిత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు ఏవగింపు కలగడానికి ప్రధాన కారణం అక్కడ మహిళలకు కనీస భద్రత కరువవడమే. దీనికితోడు ఎడతెగని కరెంటు కోతలు, పత్తాలేని మౌలిక సదుపాయాలూ ఢిల్లీని బాధిస్తున్నాయి. వీటన్నిటినీ తాము తీరుస్తామని బీజేపీ, ఆప్‌లు హామీ ఇచ్చాయి. మరోసారి అధికారం అప్పగిస్తే తామూ ఈ విషయంలో తగిన చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ సైతం చెప్పింది.
తీరా ఎన్నికలు చిత్రమైన ఫలితాలు తీసుకొచ్చాయి. అత్యధిక స్థానాలు గెల్చుకున్న ఏకైక పార్టీగా బీజేపీ అవతరించినా... మిత్రపక్షం అకాలీదళ్‌కొచ్చిన ఒక స్థానాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటే దాని బలం 32 మాత్రమే(ఇప్పుడది 29కి చేరింది). రెండో స్థానంలో ఉన్న ఆప్‌కు 28 స్థానాలున్నాయి(ప్రస్తుత బలం 27). వరసగా మూడు దఫాలు ఢిల్లీనేలిన కాంగ్రెస్ 8 స్థానాలతో సరిపుచ్చుకొనవలసివ చ్చింది. అధికారాన్ని అందుకోవడానికి మొదట్లో తటపటాయించిన ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ చివరకు అయిష్టంగానే కాంగ్రెస్ మద్ద తుతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. కానీ, 48 రోజులు గడిచేసరికి ఆయన తప్పుకున్నారు. వెళ్తూ వెళ్తూ అసెంబ్లీ రద్దుకు సిఫార్సుచేశారు. ఏ పార్టీకీ ప్రభుత్వాన్ని ఏర్పరిచేంత మెజా రిటీ రాలేదు గనుక ఇంతకు మించిన ప్రత్యామ్నాయం కూడా లేదు. కానీ, కేంద్రంలోని పాలకులు చెప్పినట్టల్లా నడుచుకునే మన గవర్నర్ల వ్యవస్థ రాజీనామా చేసి వెళ్లిపోతున్న ముఖ్యమంత్రి సిఫార్సుకు ఏపాటి విలువ ఇస్తాయో అందరికీ తెలిసిందే. కనుకనే ఢిల్లీ అసెంబ్లీ సుప్తచేత నావస్థలో ఉండిపోయింది. ఆప్ సంగతి వదిలిపెట్టి ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లకు నిజంగా ప్రజలపై ప్రేమ ఉంటే, ప్రజా ధనం దుర్వినియోగం కాకుడదన్న ధ్యాస ఉంటే కొన్నాళ్లపాటైనా ఉమ్మడిగా ప్రభుత్వాన్ని నడిపే ఆలోచన చేసేవి. ఆ రెండు పార్టీలూ ప్రభుత్వం ఏర్పాటుకు చొరవ చూపలేదు... అలాగని ఎన్నికలకూ సిద్ధపడలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో తిరుక్షవరమై, మరోసారి ఎన్నికలు నిర్వహిస్తే అంత కన్నా కనాకష్టంగా ఫలితాలు వస్తాయని తెలిసి పార్లమెంటు ఎన్నికల తోపాటు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరిపే ఆలోచనకే కాంగ్రెస్ దూరంగా ఉండిపోయింది. సార్వత్రిక ఎన్నికల అనంతరం పాలనా పగ్గాలు చేపట్టిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ఆలోచన వేరుగా ఉన్నది. తమ పాలన సత్ఫలితాలనివ్వడం ప్రారంభించాకే ఢిల్లీ విషయంలో నిర్ణయం తీసుకోవచ్చునని కాలం గడుపుతున్నది. ఈ ఏడాది ఆఖరుకు జరగ బోయే కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు ఈ ఎన్నికలు కూడా కానీయవచ్చన్నది ఆ పార్టీ అభిప్రాయం. బహుశా ఈ సంగతి అర్ధమయ్యే అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఢిల్లీ అసెంబ్లీ సంగతి వదిలిపెట్టి మొత్తంగా మన చట్టసభలు ఈమధ్యకాలంలో చట్టుబండలవుతున్నాయి. ఆరున్నర దశాబ్దాల అను భవంలో మన చట్టసభలు ఎంతో పరిపక్వతను సాధించాల్సివుండగా అందుకు భిన్నమైన రీతిలో వాటి తీరు ఉంటున్నది. మూడేళ్లక్రితం మన పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఒక్క గంటైనా సరిగా పని చేయకుండానే ముగిసిపోయాయి. 20 రోజులో, 30 రోజులో సాగే సమావేశాల కాలంలో పట్టుమని పది గంటలైనా సభ సజావుగా సాగు తున్న దాఖలాలు కనబడవు. ఫలితంగా ఎంతో ముఖ్యమైన ఫైనాన్స్ బిల్లువంటివి కూడా గిలెటిన్ అవుతున్నాయి.
ప్రజలు ఎదుర్కొనే కీలక సమస్యలు చర్చకు రాకుండాపోతున్నాయి. ఈ సందర్భంగా ఆప్ పిటి షన్‌ను విచారిస్తూ సుప్రీంకోర్టు చేసిన కొన్ని కీలక వ్యాఖ్యలు ఎన్నదగి నవి. ‘ప్రభుత్వం ఏర్పాటు చేయదల్చుకోవడంలేదని ఒక పార్టీ చెబితే, తమకు కుదరదని మరో పార్టీ అంటున్నది. మూడో పార్టీకి బలమే లేదు. ఇలాంటి స్థితిలో సుదీర్ఘకాలం ప్రభుత్వం లేకుండా ప్రజలు ఎం దుకు ఇబ్బంది పడాల’ని న్యాయమూర్తులు సూటిగా ప్రశ్నించారు. అంతేకాదు... అసెంబ్లీ సుప్తచేతనావస్థలో ఉన్నప్పుడు ఏమీ చేయ కుండా ఇంట్లో కూర్చునే ప్రజాప్రతినిధులకు ప్రజాధనాన్ని జీతంగా ఎందుకు చెల్లించాలని కూడా వారు నిలదీశారు. ఈ వ్యాఖ్యానం సుప్త చేతనావస్థ విషయంలోనే చేసినా వాయిదాల్లో ప్రారంభమై వాయిదాల తోనే ముగుస్తున్న ఇతర చట్టసభలకు కూడా వర్తించాల్సిన అంశమే. ఇది సంకీర్ణ ప్రభుత్వాల యుగం కావడంవల్లే చట్టసభల నిర్వహణలో సమస్యలు తలెత్తుతున్నాయని మాజీ స్పీకర్ మీరాకుమార్ ఒక సంద ర్భంలో చెప్పినా అసలు కారణం అది కాదు. సభలో విపక్షాల గొంతు వినబడనీయకూడదనుకునే అధికార పక్షాలే ఈ స్థితికి కారణమవుతు న్నాయి. అవసరమైన బిల్లులు గిలెటిన్ ద్వారా కానిస్తున్నప్పుడు సభలు జరిగేతేనేం జరగకపోతేనేం అనే ధోరణి ఇటీవలికాలంలో పెరిగింది. సుప్రీంకోర్టు తాజా వ్యాఖ్యల నేపథ్యంలోనైనా ఇలాంటి ధోరణి మారితే మంచిదే. అలాగే చట్టసభల విలువేమిటో గ్రహించి ఢిల్లీ అసెంబ్లీ విషయంలో ఏర్పడిన అనిశ్చితికి సాధ్యమైనంత త్వరలో ముగింపు పలకడం ఉత్తమమని కేంద్ర ప్రభుత్వం గుర్తించాలి.
‘సుప్రీం’ కీలక వ్యాఖ్యలు!
Published Wed, Aug 6 2014 11:57 PM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement
Advertisement