మృత్యువు కేరాఫ్ అడ్రస్ రహదారులే అన్నంతగా రోడ్డు ప్రమాదాలు అంతకంతకూ పెరుగుతుంటే... సర్కారీ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనబడుతుంటే వీటి నియంత్రణకు తానే రంగంలోకి దిగడం తక్షణావసరమని సర్వోన్నత న్యాయస్థానం గుర్తించింది. అందువల్లే రోడ్డు ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలేమిటో సూచించడానికి ముగ్గురు సభ్యుల కమిటీని నియమిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది.
ఈ కమిటీ చర్యలను సూచించడమే కాదు...అవి అమలవుతున్న తీరునూ పర్యవేక్షిస్తుంది. ప్రమాదాల పరంపరలో రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను గుర్తించి, వాటి జవాబుదారీతనాన్ని నిర్దేశిస్తుంది. రోడ్డు ప్రమాదాలు అడ్డూ ఆపూ లేకుండా పెరిగిపోతున్న తీరుపై వాస్తవానికి జనం ఓట్లతో గెలిచే ప్రభుత్వాలు ఆందోళనచెందాలి.ఏ ఏ చర్యలు అవసరమన్న అంశంలో ఆదుర్దా కనబర్చాలి. కానీ, ప్రభుత్వాలన్నీ నిర్లక్ష్యంగా వ్యవహరించాయి. తమ బాధ్యతను గాలికొదిలాయి. పౌరులకు కనీసం సురక్షితమైన రహదారులు అందుబాటులోకొచ్చేలా చేయలేకపోయాయి. కనుకనే రాజశేఖరన్ అనే వైద్య నిపుణుడు సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఆ వ్యాజ్యంపైనే ధర్మాసనం తాజా ఉత్తర్వులనిచ్చింది.
ప్రపంచంలో జరిగే రోడ్డు ప్రమాదాల్లో 10 శాతం భారత్‌లోనే జరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమధ్య ప్రకటించింది. లక్షమంది జనాభాలో ట్రాఫిక్ ప్రమాదాలవల్ల మరణిస్తున్నవారి సంఖ్య 2009లో 16.8 ఉండగా అది గత ఏడాదికి 18.9కి చేరుకుంది. సంపన్న దేశాల్లో ఈ సగటు 8.7 మాత్రమే. ఇండొనేసియా(17.7), పాకిస్థాన్(17.4), నేపాల్(16), మయన్మార్(15), శ్రీలంక(13.7)ఈ విషయంలో మనకంటే మెరుగైన పరిస్థితుల్లో ఉన్నాయి. 2011లో మొత్తం 4,40,123 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటే అందులో 1,36,834మంది మరణించారని జాతీయ క్రైమ్ రికార్డుల బ్యూరో గణాంకాలు చెబుతున్నాయి.
2001-11మధ్య రోడ్డు ప్రమాదాల మృతుల సంఖ్య 44.2 శాతం పెరిగింది. ప్రతి నిమిషానికీ ఒక ప్రమాదం సంభవిస్తుంటే...ప్రతి నాలుగు నిమిషాల్లోనూ ఒకరు అర్ధంతరంగా మరణిస్తున్నారని సుప్రీంకోర్టుకు కేంద్ర రహదారుల మంత్రిత్వ శాఖ సమర్పించిన నివేదిక అంటున్నది. ఈ ప్రమాదాలకు అడ్డుకట్ట పడకపోతే 2020నాటికి రహదార్లపై ప్రతి మూడు నిమిషాలకు ఒక మరణం సంభవిస్తుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. ఇలాంటి ప్రమాదాల్లో ప్రాణాలు దక్కించుకున్నా జీవితాంతం వికలాంగులుగా వెళ్లదీసేవారి సంఖ్య కూడా తక్కువేమీ లేదు. 2010లో జరిగిన 4,30,654 ప్రమాదాల్లో 4,66,600మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఎక్కువమంది గడప దాటి బయటకు వెళ్లలేని స్థితికి చేరుకుని ఉపాధిని కోల్పోతున్నారు.
పర్యవసానంగా కుటుంబాలు ఆర్ధికంగా ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు ధర్మాసనం మానవాళి మనుగడకు రోడ్డు ప్రమాదాలు పెను సవాలుగా మారాయని వ్యాఖ్యానించింది. దేశంలో ఆర్ధిక సంస్కరణల తర్వాత సొంత వాహనాలు సమకూర్చుకోవాలన్న ఉబలాటం పెరిగింది. రైతులకు పంట రుణాలివ్వడానికి వెనకాడే బ్యాంకులు వాహన రుణాలను యధేచ్ఛగా ఇస్తున్నాయి. అందుకు ప్రభుత్వాల ప్రోత్సాహమూ ఉంటున్నది. అస్తవ్యస్థ రహదారులు అలాగే ఉండగా రోజురోజుకూ రోడ్డెక్కుతున్న మోటారు వాహనాల సంఖ్య మాత్రం పాపం పెరిగినట్టు పెరుగుతోంది. ప్రజారవాణా వ్యవస్థ నిర్వహణనుంచి తప్పించుకోజూసే ప్రభుత్వాల అసమర్ధత కూడా ఇందుకు తోడవుతోంది. ఇక డ్రైవింగ్ లెసైన్స్‌ల జారీ దగ్గరనుంచి రహదారుల డిజైన్ వరకూ ఎనెన్నో లోపాలు. నగరాల్లో అయితే పాదచారులు నడవడానికి, కనీసం సైకిళ్లపై వెళ్లడానికి వీలే ఉండదు. రహదారులన్నీ వాహనాల కోసమే పుట్టినట్టుంటాయి. పర్యవసానంగా ప్రమాదాలు పెరుగుతున్నాయి.
నిర్మించిన రోడ్లు సరిగా ఉంటున్నాయో లేదో...ఎక్కడెక్కడ ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయో, అవి ఎందుకు జరుగుతున్నాయో ఆరా తీసే వ్యవస్థ సక్రమంగా లేదు. దేశంలో అన్ని రకాల రహదారులనూ పరిగణనలోకి తీసుకుంటే మొత్తం 47 లక్షల కిలోమీటర్ల నిడివిగల రోడ్లున్నాయని కేంద్ర రహదారుల మంత్రిత్వశాఖ నివేదిక చెబుతోంది. అందులో జాతీయ రహదారులు 70,934 కిలోమీటర్లయితే, రాష్ట్ర రహదారులు 1,63,896 కిలోమీటర్లు. కేంద్ర, రాష్ట్ర రహదారుల నిర్వహణే పరమ అస్తవ్యవస్థంగా ఉండగా ఇతర రోడ్ల గురించి చెప్పనవసరం లేదు. రహదారుల పొడవునా ప్రతి 50 కిలోమీటర్లకూ ఒక గస్తీ వాహనాన్ని అందుబాటులో ఉంచడంతోపాటు క్షతగాత్రులను వెనువెంటనే చేర్చేందుకు ఆస్పత్రులు కూడా అవసరం. మన రాష్ట్రంలో 108 సర్వీసు సమర్ధవంతంగా పనిచేస్తున్న కాలంలో రోడ్డు ప్రమాదాల్లో మరణించేవారి సంఖ్య బాగా అదుపులోకొచ్చింది.
ఆ తరహా సేవలను ముమ్మరం చేయడంతోపాటు ట్రాఫిక్ నిబంధనల అమలుకు గట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సంకల్పశుద్ధి ఉంటే ప్రమాదాలను అదుపులోకి తీసుకురావడం కష్టమేమీ కాదని చైనా అనుభవం నిరూపిస్తున్నది. అక్కడ ఏడాదికి లక్షకుపైగా మరణాలు సంభవిస్తే అయిదేళ్లలో ఆ సంఖ్యను 67,759కి తగ్గించగలిగారు. మన దేశంలో అందుకు భిన్నంగా ప్రమాదాల సంఖ్య ఏటా పెరుగుతోంది. తాము కర్తవ్య నిష్టతో చేయాల్సిన పనిని సుప్రీంకోర్టుతో చెప్పించుకోవాల్సివచ్చిందని ప్రభుత్వాలు గుర్తించాలి. ఇప్పటినుంచి అయినా మనసుపెట్టి పనిచేస్తే... అవసరమైన చర్యలు తీసుకుంటే వేలాదిమంది ప్రాణాలను కాపాడినవారమవుతామని అధికార యంత్రాంగం తెలుసుకోవాలి.
నెత్తుటి రహదారులు!
Published Thu, Apr 24 2014 12:35 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement