Ranjitsinha
-
నేడే సీబీఐ చీఫ్ ఎంపిక
ప్రధాని నేతృత్వంలో భేటీ కానున్న కమిటీ న్యూఢిల్లీ: సీబీఐ కొత్త చీఫ్‌ను ఎన్నుకునేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎంపిక కమిటీ మంగళవారం సమావేశం కానుంది. సీబీఐ ప్రస్తుత డెరైక్టర్ రంజిత్‌సిన్హా మంగళవారం పదవీ విరమణ చేయనున్నారు. సీబీఐ డెరైక్టర్ నియామక కమిటీలో లోక్‌సభలోని అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ నేతను కూడా చేరుస్తూ రూపొందించిన సవరణ బిల్లును రాష్ట్రపతి ఆమోదించిన నేపథ్యంలో.. ఆ కమిటీలో లోక్‌సభలో కాంగ్రెస్ నేత మల్లిఖార్జున్ ఖర్గేకు కూడా స్థానం లభించింది. కమిటీలో ప్రధాని, లోక్‌సభలో ప్రతిపక్ష నేతతో పాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, లేదా ఆయన తరఫు ప్రతినిధి కూడా ఉంటారు. లోక్‌పాల్ చట్టం అమల్లోకి వచ్చిన తరువాత జరుగుతున్న మొదటి సీబీఐ డెరైక్టర్ నియామకం ఇదే. ప్రస్తుతం సీబీఐ చీఫ్ రేసులో రాజస్తాన్ డీజీపీ ఒమేంద్ర భరద్వాజ్, హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి ప్రకాశ్ మిశ్రాలు ముందంజలో ఉన్నారు. వీరిద్దరూ 1977 కేడర్ ఐపీఎస్ అధికారులు. అలాగే, కేరళ పోలీస్ చీఫ్, 1978 బ్యాచ్ ఐపీఎస్ అధికారి బాలసుబ్రమణ్యం పేరు కూడా వినిపిస్తోంది. సీబీఐ డెరైక్టర్ నియామకానికి సంబంధించిన సవరణ బిల్లు(ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్(అమెండ్మెంట్)బిల్, 2014)ను గతవారం పార్లమెంటు ఆమోదించిన విషయం తెలిసిందే. ఆ బిల్లుకు రాష్ట్రపతి ప్రణబ్ శనివారం ఆమోదం తెలిపారని ప్రభుత్వం ఒక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. బిల్లులో చేర్చిన సవరణ ప్రకారం.. లోక్‌సభలో అధికారిక ప్రతిపక్ష నేత లేని పరిస్థితుల్లో అత్యధిక స్థానాలు సాధించిన ప్రతిపక్ష నేతకు సీబీ ఐ డెరైక్టర్ ఎంపిక కమిటీలో స్థానం కల్పిస్తారు. -
రంజిత్ సిన్హాకు అభిశంసన
మెత్తగా హితబోధ చేసినా చెవికెక్కించుకోనివారికి తగలాల్సినవి మొట్టికాయలే. అందువల్లే సీబీఐ డెరైక్టర్ రంజిత్‌సిన్హా విషయంలో గురువారం సుప్రీంకోర్టు కఠినంగానే వ్యవహరించింది. 2 జీ స్పెక్ట్రమ్ కేసు దర్యాప్తులో ఇకపై జోక్యం చేసుకోవద్దని ఆదేశించింది. ఆయనపై వచ్చిన ఆరోపణల్లో ‘విశ్వసనీయత’ ఉన్నదని స్పష్టంచేసింది. మరో పదిరోజుల్లో రిటైరవుతున్న సిన్హాకు ఇది జరగాల్సిన పరాభవమే. గత కొన్నేళ్లుగా సీబీఐ తీరుపై ఎన్నో విమర్శలూ, ఆరోపణలూ వస్తున్నాయి. అది పాలకుల చేతుల్లో పావుగా మారిందని ఎందరో చెప్పివున్నారు. ‘పంజరంలో ఒకే ఒక చిలుక. దానికి ఎందరో యజమానులు’ అని సీబీఐ గురించి ఏణ్ణర్థం క్రితం సాక్షాత్తూ సర్వోన్నత న్యాయస్థానమే వ్యాఖ్యానించింది. ఇలాంటి దశలో సీబీఐ సారథిగా ఉండే వ్యక్తి ఎంత బాధ్యతాయుతంగా ఉండాలో వేరే చెప్పనవసరం లేదు. కానీ, రంజిత్‌సిన్హా సరిగ్గా అందుకు విరుద్ధంగా ప్రవర్తించారు. ఒకపక్క తనకు సర్వంసహాధికారాలివ్వాలని...తాను స్వతంత్రంగా, నిష్పక్ష పాతంగా వ్యవహరించాలంటే అదొక్కటే మార్గమని సుప్రీంకోర్టు ముందు అఫిడవిట్లు దాఖలుచేస్తూనే ఆ స్ఫూర్తికి గండికొట్టేలా ప్రవర్తించారు. ఆయన ఇంటికి తరచు 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంలో ముద్దాయిలుగా ఉన్నవారు వచ్చి కలుస్తున్నారని నాలుగు నెలలక్రితం ఒక స్వచ్ఛంద సంస్థ ఆరోపించింది. అందుకు సాక్ష్యంగా ఆయన నివాసంలోని లాగ్‌బుక్‌లో నమోదైన సందర్శకుల వివరాలను సుప్రీంకోర్టు ముందుంచింది. ఏ అధికారైనా ఈ వివరాలు వెల్లడయ్యేసరికి ఏం సంజాయిషీ ఇచ్చుకోవాలో, ఎలా బయటపడాలో తెలియక తడబడతారు. నీళ్లు నములుతారు. కానీ, రంజిత్‌సిన్హా దబాయింపులకు దిగారు. అదంతా బోగస్ అని వాదించడంతో మొదలుపెట్టి ‘నా ఇంటి తలుపులు ఎవరికైనా తెరిచే ఉంటాయ’ని చెప్పేవరకూ వచ్చారు. ఆయన ఇంటి తలుపులు తెరిచే ఉంటాయన్న సంగతి 2జీ స్పెక్ట్రమ్ స్కాంలోనూ, ఇతర కుంభకోణాల్లోనూ నిందితులుగా ఉన్నవారికి మాత్రమే ఎలా తెలుసునో ఎవరికీ అర్థంకాలేదు. ఆ తర్వాత ఆయన మరో నిరర్థకమైన వాదన చేశారు. కేసు దర్యాప్తు సమయంలో ఎవరో ఒకరు వచ్చి సమాచారం ఇవ్వడం సర్వసాధారణమన్న తర్కం లేవదీశారు. అంతటితో ఆగక ‘వారంతా నా స్నేహితులు. కేసులో ముద్దాయిలైనంత మాత్రాన వారిని కలవకూడదా?’ అన్నారు. వారిని కలిశాక ఆయా కేసుల్లో వాదనలేమైనా తారుమారయ్యాయా అని సవాల్‌చేశారు. సాక్షాత్తూ సర్వోన్నత న్యాయస్థానం పర్యవేక్షిస్తున్న కేసు విషయంలో... ఏ కానిస్టేబుల్ స్థాయి ఉద్యోగో కాదు, ఆ సంస్థ డెరైక్టరే ఇలా మాట్లాడటం అందరినీ దిగ్భ్రాంతిపరిచింది. సీబీఐకి స్వయంప్రతిపత్తి ఇవ్వాలనడం ఆ సంస్థ డెరైక్టర్, ఇతర అధికారులు ఇష్టానుసారం ప్రవర్తించడానికి కాదు. ఖజానాను కొల్లగొడుతున్న వ్యక్తులు, ఇతరేతర నేరాలకు పాల్పడుతున్న వ్యక్తులు ఏ స్థాయివారైనా, ఎంతటి పలుకుబడి కలవారైనా ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకూ లొంగకుండా దర్యాప్తు చేయడానికి. అనవసర వేధింపులకు దూరంగా ఉండటానికి. రంజిత్‌సిన్హాకు ఇది బొత్తిగా అర్థంకాలేదని ఆయన ప్రవర్తన నిరూపించింది. 2012 డిసెంబర్ 3న బాధ్యతలు చేపట్టిననాటినుంచి రంజిత్‌సిన్హా తన వ్యవహారశైలితో వివాదాస్పదుడిగా మారారు. ఆ మాటకొస్తే అసలు ఆయన నియామకమే వివాదాస్పదమైనది. ప్రధాని, విపక్షనేత తదితరులుండే కొలీజియం ద్వారానే సీబీఐ, సీవీసీ వంటి సంస్థలకు అధిపతులను నియమించాలన్న ప్రతిపాదనలున్న లోక్‌పాల్ బిల్లు పార్లమెంటు పరిశీలనలో ఉండగానే యూపీఏ సర్కారు ఆదరా బాదరాగా ఆయన నియామకాన్ని కానిచ్చేసింది. ఆ విషయంలో తన కృతజ్ఞత చాటుకోవడానికన్నట్టు ఆదినుంచీ 2జీ స్పెక్ట్రమ్ కేసులో రంజిత్ వ్యవహారశైలి తేడాగానే ఉన్నది. 2జీ స్కాంలో నిందితులుగా ఉన్నవారిని ఆయన అనేకమార్లు కలిశారు. కొందరు నిందితులతో ఆయన వందకు పైగా సందర్భాల్లో సమావేశమయ్యారని తేలింది. రంజిత్‌సిన్హా అసలు రంగేమిటో సాక్షాత్తూ సీబీఐ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆనంద్ గ్రోవర్ సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు బయటపెట్టారు. ఈ స్కాంలో రంజిత్ తరచుగా జోక్యం చేసుకుంటూ సంస్థ వైఖరికి పూర్తిగా భిన్నమైన సలహాలనిచ్చేవారని వెల్లడించారు. అంతేకాదు...ఆ సలహాలే స్వీకరించి ఉంటే కేసు మొత్తం కుప్పకూలేదని చెప్పారు. సుప్రీంకోర్టు 2జీ స్కాం దర్యాప్తు విషయంలో జోక్యం చేసుకోవద్దని చెప్పి ఉండొచ్చుగానీ నిజానికిది మొత్తంగా రంజిత్ సిన్హాకు అభిశంసన. ఒక సంస్థకు అధిపతిగా ఉంటూ ఇంతమాట అనిపించుకున్న తర్వాత...కేసును పక్కదోవ పట్టించడానికి ప్రయత్నించినట్టు సర్వోన్నత న్యాయస్థానం ముందు సాక్షాత్తూ తమ సంస్థ న్యాయవాదే చెప్పాక ఆయన తన పదవికి రాజీనామా చేసి ఉండాలి. కానీ, రంజిత్ చరిత్ర తెలిసివున్నవారెవరూ ఆయన ఆ పని చేస్తారని భావించరు. రంజిత్‌సిన్హా వ్యవహారశైలి తర్వాతనైనా సీబీఐ ప్రక్షాళనపై కేంద్ర ప్రభుత్వం దృష్టిపెట్టాలి. రంజిత్‌సిన్హాకు తగినంత చాకచక్యం లేకపోవడం వల్ల దొరికిపోయి ఉండొచ్చుగానీ... రిటైర్మెంట్ అనంతరం వచ్చే పదవులకు ఆశపడి డెరైక్టర్లుగా ఉంటున్నవారు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఎన్నాళ్లనుంచో ఆరోపణలున్నాయి. అది నిజమేనని ఇప్పుడు ససాక్ష్యంగా రుజువైంది గనుక సీబీఐని ఎలా తీర్చిదిద్దితే బాగుంటుందో అందరూ ఆలోచించాలి. ఆ సంస్థకు స్వయంప్రతిపత్తి ఇవ్వడం అవసరమేగానీ, అంతకుమించిన జవాబుదారీతనాన్ని కూడా అలవాటు చేయాలి. సీబీఐ సారథులతో సహా ఎవరూ దాన్ని తమ స్వప్రయోజనాలకోసం వినియోగించుకోకుండా కట్టుదిట్టమైన నిబంధనలు రూపొందించాలి. లేనట్టయితే సీబీఐ విశ్వసనీయత కోల్పోవడం మాత్రమే కాదు...ప్రపంచంలో మన దేశం పరువుప్రతిష్టలు సైతం గల్లంతవుతాయి. -
సీబీఐ ప్రక్షాళనకు మార్గం!
సీబీఐ డెరైక్టర్ రంజిత్‌సిన్హా నివాసంలోని లాగ్ బుక్‌ను బయటపెట్టిన వ్యక్తుల వివరాలివ్వాలంటూ కొన్నిరోజులక్రితం ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు పునరాలోచన చేయడం అవినీతి, అక్రమాలను వెల్లడించేందుకు ముందుకొచ్చేవారికి ఊరటనిస్తుంది. సిన్హాను కలిసిన ప్రముఖుల్లో 2జీ స్కాం మొదలుకొని అనేక కేసుల్లో కీలక నిందితులైనవారున్నారు. వీరి వివరాలన్నీ సిన్హా ఇంటివద్ద నిర్వహిస్తున్న లాగ్‌బుక్‌లో నమోదై ఉన్నాయి. ఒకపక్క సీబీఐకి ఇవ్వాల్సిన స్వయం ప్రతిపత్తి, దానికి ఉండాల్సిన జవాబుదారీతనంపై చర్చ నడుస్తుంటే రంజిత్ సిన్హా ఇలా నిందితులుగా ఉన్నవారితో సమావేశంకావడం దిగ్భ్రాంతిపరిచింది. ఈ విషయంలో నిజానిజాలు తేలేవరకూ కీలక కేసుల దర్యాప్తు బాధ్యతలనుంచి సిన్హాను తప్పించాలని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌భూషణ్ సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరారు. పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తులు... ఈ సమాచారం ఎవరిచ్చారో తమకు సీల్డ్ కవర్లో అందజేయాలని ఆదేశించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. సాధారణంగా అవినీతి, అక్రమాలు జరిగాయని తమ దృష్టికొచ్చినప్పుడు దర్యాప్తునకు ఆదేశించడం తప్ప అందుకు సంబంధించిన నిర్దిష్ట సమాచారం పిటిషనర్లకు ఎలా వచ్చిందన్న లోతుల్లోకి న్యాయస్థానాలు వెళ్లవు. వారు లేవనెత్తిన అంశాల్లో నిజానిజాలేమిటో పరిశీలిస్తాయంతే. అయితే, రంజిత్‌సిన్హా కలిసినవారి విషయంలో ఇలా ఆదేశించడానికి ఒక కారణం ఉంది. సిన్హా ఇంటివద్ద సందర్శకుల వివరాలను నమోదుచేసే లాగ్‌బుక్ ఉన్నమాట వాస్తవమే అయినా... న్యాయస్థానానికి సమర్పించిన జిరాక్స్ కాపీలోని కొన్ని పేజీలు అందులోనివి కాదని ఆయన తరఫు న్యాయవాది ఆరోపిస్తు న్నారు. సిన్హాను అప్రదిష్టపాలు చేసేందుకు కొందరు నిందితుల పేర్లను కావాలని చేర్చి ఈ పేజీలను సృష్టించారని ఆయన వాదన. ఈ క్రమంలో అసలు ఈ జాబితా మీకు ఎవరి ద్వారా వచ్చిందో చెప్పాలని ప్రశాంత్ భూషణ్‌నూ, ఆయనతో పాటు పిటిషన్ దాఖలు చేసిన మరో స్వచ్ఛంద సంస్థనూ న్యాయమూర్తులు ఆదేశించారు. ఏదైనా సంస్థలోనో, ప్రభుత్వంలోనో అక్రమాలు జరిగాయని సమాచారం ఇచ్చేవారు నూటికి నూరుపాళ్లూ నిజాయితీపరులే కానక్కరలేదు. అక్రమాలకు పాల్పడుతున్న వ్యక్తులు తమకు వ్యతిరేకులు కావడంవల్ల కావొచ్చు, ఆ అక్రమాల్లో తమకు దక్కాల్సిన వాటా దక్కడంలేదని కావొచ్చు, తమకు రావల్సింది మరొకరు తన్నుకు పోయారన్న దుగ్ధ కావొచ్చు...ఏదో ఒక కారణంతో అందుకు సంబంధించిన సమాచారాన్ని బయటివారికి వెల్లడించేవారుంటారు. కామన్వెల్త్ స్కాం అయినా, మరొకటైనా లోకానికి వెల్లడైంది ఈ విధంగానే. ఇలాంటి కుంభకోణాల్లో తీగలాగితే డొంకంతా కదులుతుంది. దర్యాప్తు ఊహించని మలుపులు తీసుకుంటుంది. ఇప్పుడు రంజిత్‌సిన్హా నివాసగృహానికి సంబంధించిన లాగ్‌బుక్‌లోని పేజీలుగా చెబుతున్నవి కూడా ఆ విధంగా బయటపడినవే. గుజరాత్లో జరిగిన ఇష్రాత్ జహాన్ ఎన్కౌంటర్ కేసులో తమను ఇబ్బందులు పెడుతున్న సిన్హాను ఇరుకున పెట్టేందుకు ఇంటెలిజెన్స్ బ్యూరో వలపన్ని ఈ లాగ్‌బుక్ వ్యవహారాన్ని బయటకు లాగిందని ఆరోపిస్తున్నవారూ ఉన్నారు. పనిలోపనిగా కేసును ‘బలంగా’ మార్చేందుకు కొన్ని బోగస్ ఎంట్రీలను కూడా చేర్చిందని వారంటున్నారు. ఇందులో నిజానిజాలు ఏమైనప్పటికీ సిన్హాను వివిధ కేసుల్లో నిందితులుగా ఉన్నవారు కలిసిన మాట వాస్తవం. ఆ సంగతి ఆయనే అంగీకరించారు. అందువల్ల ఆయా కేసుల్లో సీబీఐ వైఖరేమైనా మారిందా అని ఆయన ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ సమస్య వైఖరి మారిందా, లేదా అని కాదు... అసలు తాము దర్యాప్తు చేస్తున్న కేసుల్లోని నిందితులను కలవడం నైతికంగా సమర్ధనీయమేనా అన్నది కీలకం. ఆ సంగతిని రంజిత్‌సిన్హా ఆలోచించాలి. తాము నిష్పక్షపాతంగా ఉన్నామని చెప్పడమే కాదు... వారలా ఉంటున్నారని అందరికీ అన్పించాలి. సీబీఐ ఏ కేసు విషయంలో ఏం చేస్తున్నదో, ఎలా మాట మారుస్తున్నదో తెలుసుకోవడం సామా న్యులకు సాధ్యం కాదు. వారికి తెలిసినదల్లా నిందితులుగా ఉన్నవారితో కేసు దర్యాప్తు చేస్తున్నవారు చెట్టపట్టాలేసుకుని తిరగకూడదన్నదే. ఈ చిన్న విషయం సిన్హాకు అర్ధంకావడంలేదు. ఇప్పుడు లాగ్‌బుక్ వ్యవహారంలో తాను లోగడ ఇచ్చిన ఆదేశాల విషయంలో సుప్రీంకోర్టు పునరాలోచన చేస్తున్నదని ధర్మాసనం తాజా వ్యాఖ్యలు చూస్తే అర్ధమవుతుంది. కీలక సమాచారం అందించేవారికి రక్షణ లేకపోతే ఏ కుంభకోణమూ వెల్లడికాదు. పాలనలో పారదర్శకత కోసం దాదాపు పదేళ్లకిందట మనకు సమాచార హక్కు చట్టం వచ్చింది. ప్రభుత్వాల నిర్ణయ ప్రక్రియలో చోటు చేసుకుంటున్న అవినీతి, అక్రమాలను బయటపెట్టేందుకు ఈ చట్టం వీలు కల్పిస్తున్నది. అయితే, దీనికి అనుబంధంగా అవినీతి, అక్రమాలపై పోరాడేవారికి రక్షణ కల్పించే చట్టాన్ని కూడా తీసుకొస్తే సమాచార హక్కు చట్టం మరింత సార్థకమ య్యేది. అయితే, ఆ చట్టం తీసుకురావడంలో మన పాలకులు విఫలమ య్యారు. ఇప్పుడు సిన్హా ప్రశాంత్‌భూషణ్ వెల్లడించిన జాబితాలోని పేర్లు అన్నీ బోగస్ అనడంలేదు. అందులో కొన్ని మాత్రమే తప్పుల తడక అంటున్నారు. కనుక సిన్హాను కలిసిన నిందితులెవరో, అలా కలవడంలోని హేతుబద్ధతేమిటో తేల్చడమే సరైంది. ఇప్పుడు కేసు ఆ దిశగా సాగే సూచనలు కనిపిస్తున్నాయి. రంజిత్‌సిన్హా స్వయంప్రతిపత్తి కోసం పాకులాడుతున్నారు తప్ప జవాబుదారితనానికి సిద్ధపడటంలేదని ఆయన మాటల్నిబట్టి చూస్తే అర్ధమవుతున్నది. ఈ స్థితిలో ప్రస్తుత కేసు విచారణ సీబీఐ ప్రక్షాళనకు దోహదపడితే దేశానికి ఎంతో మేలు కలుగు తుంది. ఆ సంస్థకు సారథ్యంవహిస్తున్నవారితోసహా ఎవరూ దాన్ని దుర్వినియోగం చేయడానికి ఆస్కారం ఉండదు.