మెత్తగా హితబోధ చేసినా చెవికెక్కించుకోనివారికి తగలాల్సినవి మొట్టికాయలే. అందువల్లే సీబీఐ డెరైక్టర్ రంజిత్‌సిన్హా విషయంలో గురువారం సుప్రీంకోర్టు కఠినంగానే వ్యవహరించింది. 2 జీ స్పెక్ట్రమ్ కేసు దర్యాప్తులో ఇకపై జోక్యం చేసుకోవద్దని ఆదేశించింది. ఆయనపై వచ్చిన ఆరోపణల్లో ‘విశ్వసనీయత’ ఉన్నదని స్పష్టంచేసింది. మరో పదిరోజుల్లో రిటైరవుతున్న సిన్హాకు ఇది జరగాల్సిన పరాభవమే. గత కొన్నేళ్లుగా సీబీఐ తీరుపై ఎన్నో విమర్శలూ, ఆరోపణలూ వస్తున్నాయి.
అది పాలకుల చేతుల్లో పావుగా మారిందని ఎందరో చెప్పివున్నారు. ‘పంజరంలో ఒకే ఒక చిలుక. దానికి ఎందరో యజమానులు’ అని సీబీఐ గురించి ఏణ్ణర్థం క్రితం సాక్షాత్తూ సర్వోన్నత న్యాయస్థానమే వ్యాఖ్యానించింది. ఇలాంటి దశలో సీబీఐ సారథిగా ఉండే వ్యక్తి ఎంత బాధ్యతాయుతంగా ఉండాలో వేరే చెప్పనవసరం లేదు. కానీ, రంజిత్‌సిన్హా సరిగ్గా అందుకు విరుద్ధంగా ప్రవర్తించారు. ఒకపక్క తనకు సర్వంసహాధికారాలివ్వాలని...తాను స్వతంత్రంగా, నిష్పక్ష పాతంగా వ్యవహరించాలంటే అదొక్కటే మార్గమని సుప్రీంకోర్టు ముందు అఫిడవిట్లు దాఖలుచేస్తూనే ఆ స్ఫూర్తికి గండికొట్టేలా ప్రవర్తించారు.
ఆయన ఇంటికి తరచు 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంలో ముద్దాయిలుగా ఉన్నవారు వచ్చి కలుస్తున్నారని నాలుగు నెలలక్రితం ఒక స్వచ్ఛంద సంస్థ ఆరోపించింది. అందుకు సాక్ష్యంగా ఆయన నివాసంలోని లాగ్‌బుక్‌లో నమోదైన సందర్శకుల వివరాలను సుప్రీంకోర్టు ముందుంచింది. ఏ అధికారైనా ఈ వివరాలు వెల్లడయ్యేసరికి ఏం సంజాయిషీ ఇచ్చుకోవాలో, ఎలా బయటపడాలో తెలియక తడబడతారు. నీళ్లు నములుతారు. కానీ, రంజిత్‌సిన్హా దబాయింపులకు దిగారు. అదంతా బోగస్ అని వాదించడంతో మొదలుపెట్టి ‘నా ఇంటి తలుపులు ఎవరికైనా తెరిచే ఉంటాయ’ని చెప్పేవరకూ వచ్చారు.
ఆయన ఇంటి తలుపులు తెరిచే ఉంటాయన్న సంగతి 2జీ స్పెక్ట్రమ్ స్కాంలోనూ, ఇతర కుంభకోణాల్లోనూ నిందితులుగా ఉన్నవారికి మాత్రమే ఎలా తెలుసునో ఎవరికీ అర్థంకాలేదు. ఆ తర్వాత ఆయన మరో నిరర్థకమైన వాదన చేశారు. కేసు దర్యాప్తు సమయంలో ఎవరో ఒకరు వచ్చి సమాచారం ఇవ్వడం సర్వసాధారణమన్న తర్కం లేవదీశారు. అంతటితో ఆగక ‘వారంతా నా స్నేహితులు. కేసులో ముద్దాయిలైనంత మాత్రాన వారిని కలవకూడదా?’ అన్నారు. వారిని కలిశాక ఆయా కేసుల్లో వాదనలేమైనా తారుమారయ్యాయా అని సవాల్‌చేశారు. సాక్షాత్తూ సర్వోన్నత న్యాయస్థానం పర్యవేక్షిస్తున్న కేసు విషయంలో... ఏ కానిస్టేబుల్ స్థాయి ఉద్యోగో కాదు, ఆ సంస్థ డెరైక్టరే ఇలా మాట్లాడటం అందరినీ దిగ్భ్రాంతిపరిచింది.
సీబీఐకి స్వయంప్రతిపత్తి ఇవ్వాలనడం ఆ సంస్థ డెరైక్టర్, ఇతర అధికారులు ఇష్టానుసారం ప్రవర్తించడానికి కాదు. ఖజానాను కొల్లగొడుతున్న వ్యక్తులు, ఇతరేతర నేరాలకు పాల్పడుతున్న వ్యక్తులు ఏ స్థాయివారైనా, ఎంతటి పలుకుబడి కలవారైనా ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకూ లొంగకుండా దర్యాప్తు చేయడానికి. అనవసర వేధింపులకు దూరంగా ఉండటానికి. రంజిత్‌సిన్హాకు ఇది బొత్తిగా అర్థంకాలేదని ఆయన ప్రవర్తన నిరూపించింది.
2012 డిసెంబర్ 3న బాధ్యతలు చేపట్టిననాటినుంచి రంజిత్‌సిన్హా తన వ్యవహారశైలితో వివాదాస్పదుడిగా మారారు. ఆ మాటకొస్తే అసలు ఆయన నియామకమే వివాదాస్పదమైనది. ప్రధాని, విపక్షనేత తదితరులుండే కొలీజియం ద్వారానే సీబీఐ, సీవీసీ వంటి సంస్థలకు అధిపతులను నియమించాలన్న ప్రతిపాదనలున్న లోక్‌పాల్ బిల్లు పార్లమెంటు పరిశీలనలో ఉండగానే యూపీఏ సర్కారు ఆదరా బాదరాగా ఆయన నియామకాన్ని కానిచ్చేసింది. ఆ విషయంలో తన కృతజ్ఞత చాటుకోవడానికన్నట్టు ఆదినుంచీ 2జీ స్పెక్ట్రమ్ కేసులో రంజిత్ వ్యవహారశైలి తేడాగానే ఉన్నది. 2జీ స్కాంలో నిందితులుగా ఉన్నవారిని ఆయన అనేకమార్లు కలిశారు.
కొందరు నిందితులతో ఆయన వందకు పైగా సందర్భాల్లో సమావేశమయ్యారని తేలింది. రంజిత్‌సిన్హా అసలు రంగేమిటో సాక్షాత్తూ సీబీఐ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆనంద్ గ్రోవర్ సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు బయటపెట్టారు. ఈ స్కాంలో రంజిత్ తరచుగా జోక్యం చేసుకుంటూ సంస్థ వైఖరికి పూర్తిగా భిన్నమైన సలహాలనిచ్చేవారని వెల్లడించారు. అంతేకాదు...ఆ సలహాలే స్వీకరించి ఉంటే కేసు మొత్తం కుప్పకూలేదని చెప్పారు.
సుప్రీంకోర్టు 2జీ స్కాం దర్యాప్తు విషయంలో జోక్యం చేసుకోవద్దని చెప్పి ఉండొచ్చుగానీ నిజానికిది మొత్తంగా రంజిత్ సిన్హాకు అభిశంసన. ఒక సంస్థకు అధిపతిగా ఉంటూ ఇంతమాట అనిపించుకున్న తర్వాత...కేసును పక్కదోవ పట్టించడానికి ప్రయత్నించినట్టు సర్వోన్నత న్యాయస్థానం ముందు సాక్షాత్తూ తమ సంస్థ న్యాయవాదే చెప్పాక ఆయన తన పదవికి రాజీనామా చేసి ఉండాలి. కానీ, రంజిత్ చరిత్ర తెలిసివున్నవారెవరూ ఆయన ఆ పని చేస్తారని భావించరు.
రంజిత్‌సిన్హా వ్యవహారశైలి తర్వాతనైనా సీబీఐ ప్రక్షాళనపై కేంద్ర ప్రభుత్వం దృష్టిపెట్టాలి. రంజిత్‌సిన్హాకు తగినంత చాకచక్యం లేకపోవడం వల్ల దొరికిపోయి ఉండొచ్చుగానీ... రిటైర్మెంట్ అనంతరం వచ్చే పదవులకు ఆశపడి డెరైక్టర్లుగా ఉంటున్నవారు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఎన్నాళ్లనుంచో ఆరోపణలున్నాయి. అది నిజమేనని ఇప్పుడు ససాక్ష్యంగా రుజువైంది గనుక సీబీఐని ఎలా తీర్చిదిద్దితే బాగుంటుందో అందరూ ఆలోచించాలి.
ఆ సంస్థకు స్వయంప్రతిపత్తి ఇవ్వడం అవసరమేగానీ, అంతకుమించిన జవాబుదారీతనాన్ని కూడా అలవాటు చేయాలి. సీబీఐ సారథులతో సహా ఎవరూ దాన్ని తమ స్వప్రయోజనాలకోసం వినియోగించుకోకుండా కట్టుదిట్టమైన నిబంధనలు రూపొందించాలి. లేనట్టయితే సీబీఐ విశ్వసనీయత కోల్పోవడం మాత్రమే కాదు...ప్రపంచంలో మన దేశం పరువుప్రతిష్టలు సైతం గల్లంతవుతాయి.
రంజిత్ సిన్హాకు అభిశంసన
Published Fri, Nov 21 2014 12:30 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM
Advertisement
Advertisement