
హంగ్ వస్తే ఎలా..?
న్యాయ, రాజ్యాంగ నిపుణుల అభిప్రాయాలు తెలుసుకున్న రాష్ట్రపతి
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో ఏ కూటమికి పూర్తి మెజారిటీ రాకుండా హంగ్ ఏర్పడితే అనుసరించాల్సిన విధివిధానాలపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ న్యాయ, రాజ్యాంగ నిపుణుల అభిప్రాయాలను సేకరించారు. ఈ మేరకు కిందటివారమే ప్రముఖ న్యాయ నిపుణులు ఫాలీ నారీమన్, సోలీ సొరాబ్జీ, సొలిసిటర్ జనరల్ మోహన్ పరాశరన్‌ల అభిప్రాయాలను తెలుసుకున్నారు. లోక్‌సభలోని మొత్తం 543 ఎంపీ స్థానాల్లో ఏ పార్టీ/కూటమి అయినా 272 సీట్లు నెగ్గితే రాష్ట్రపతి పాత్ర నామమాత్రంగానే ఉంటుంది.
మెజారిటీ సాధించిన పక్షాన్ని ప్రభుత్వ ఏర్పాటుకు స్వాగతిస్తారు. అయితే హంగ్ ఏర్పడితే రాష్ట్రపతి పాత్ర కీలకం. శుక్రవారమే ఎన్నికల ఫలితాలు వెల్లడికానున్నాయి. మరోవైపు ఫలితాల తర్వాత రాష్ట్రపతి భవన్‌కు రాజకీయ నేతలు, పాత్రికేయుల తాకిడి పెరగనుండడంతో సిబ్బంది ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రపతి భవన్‌లో శనివారం యూపీఏ-2 సర్కారుకు వీడ్కోలు ఏర్పాట్లు కూడా చురుగ్గా సాగుతున్నాయి.