
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఎన్నికల అనంతరం హంగ్ పరిస్థితి రాకుండా ప్రజలకు ఒక అవకాశం కల్పించేందుకే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నట్లు నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్‌సీ) ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దులా వివరించారు. ప్రభుత్వం ఏర్పాటు కాదేమోనన్న అనుమానాలు అక్కర్లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. దాల్ సరస్సులో ఆదివారం షికారా(పడవ)లతో చేపట్టిన ర్యాలీలో అబ్దుల్లా మాట్లాడారు.
ఎన్నికల తర్వాత జమ్మూకశ్మీర్‌లో హంగ్ ఏర్పడాలని బీజేపీ కోరుకుంటోందని, తద్వారా లెఫ్టినెంట్ గవర్నర్ పాలనను పొడిగించాలని చూస్తోందని ఆరోపించారు. అయితే, ప్రజలు బీజేపీకి ఆ అవకాశం ఇవ్వబోరని చెప్పారు. కశ్మీర్ లోయలో ప్రచారంతో ఫలితం ఉండదని ముందుగానే గ్రహించిన బీజేపీ నేతలు జమ్మూలో మాత్రమే పర్యటిస్తున్నారని ఒమర్ వ్యాఖ్యానించారు. బీజేపీ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే జమ్మూకశ్మీర్‌లో మూడు కుటుంబాల పాలన అంటూ విమర్శలు చేస్తోందన్నారు.