ముషీరాబాద్‌కు ‘సన్’స్ట్రోక్
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ పార్టీ టికె ట్లు ఆశిస్తున్నవారిలో టెన్షన్ పెరిగిపోతోంది. ప్రధాన పార్టీలు కొన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేయకపోవడం.. ఎప్పటినుంచో టికెట్ తమకే ఇస్తారని ఆశల పల్లకిలో ఊరేగి ఊహల్లో తేలిపోతున్నవారు ఇప్పుడు ఏం జరుగుతుందోనని మదన పడుతున్నారు. ఒక్కో పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్నవారు ఇద్దరికంటే ఎక్కువమంది ఉన్న నియోజకవర్గాల్లో అయితే పార్టీ జెండా ఎవరు ఎత్తుకుంటారోనని ప్రజలు సైతం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
మలక్‌పేటలో ఎవరికి వారు..
మలక్‌పేట నియోజకవర్గంలో అభ్యర్థుల ఎంపిక ఇంకా ఓ కొలిక్కిరాలేదు. వైఎస్సార్‌సీపీ, టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ, టీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీలు ఈ స్థానం నుంచి ఎవరికీ టిక్కెట్ కేటాయించనప్పటికీ ఇక్కడి నేతలు ఎవరికివారు తమకే టిక్కెట్ వస్తుందంటూ ప్రచారం చేసుకుంటున్నారు.వైఎస్సార్‌సీపీ నుంచి నగర యువజన విభాగం అధ్యక్షుడు, మలక్‌పేట నియోజకవర్గ సమన్వయకర్త లింగాల హరిగౌడ్‌తో పాటు మరో సమన్వయకర్త బొడ్డు సాయినాథ్‌రెడ్డి కూడా సీటుపై ఆశలు పెట్టుకున్నారు. ఎవరికివారు సీటు కోసం తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు.
టీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్సీ మహ్మద్ అలీ కుమారుడు ఆజం అలీ మలక్‌పేట నుంచి తానే పోటీ చేస్తున్నట్టు ప్రచారం మొదలెట్టగా.. కార్మికశాఖ నాయకుడు చెవ్వ సతీష్‌కుమార్ ఈ సీటు కోసం ప్రయత్నం చేస్తున్నారు. లేదంటే ఇబ్రహీంపట్నం టికెట్టు ఇవ్వాలని చెవ్వ పట్టుబడుతున్నారు. టీడీపీ నుంచి ఇప్పటికే ముజఫర్ అలీఖాన్ ప్రచారం మొదలెట్టారు. మరోవైపు జీహెచ్‌ఎంసీలో టీడీపీ ఫ్లోర్ లీడర్ సింగిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, సలీంనగర్ కార్పొరేటర్ చెకొలేకర్ శ్రీనివాస్ కూడా ఎమ్మెల్యే టికెట్ కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. బీజేపీ, టీడీపీ మధ్య పొత్తు ఉంటుందని కింది స్థాయి కార్యకర్తలు బలంగా నమ్ముతున్నారు. ఒకవేళ పొత్తు ఉంటే ఈ సీటు టీడీపీకే కేటాయించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
లేకుంటే బీజేపీ నుంచి పార్టీ నగర అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, బద్దం బాల్‌రెడ్డి కూడా ఈ సీటుపై కన్నేసినట్టు సమాచారం. స్థానిక నాయకుడు మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్‌చందర్‌జీతో పాటు బి.నర్సింహలు కూడా బీజేపీ నుంచి మలక్‌పేట సీటు కోసం పట్టుపడుతున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో కొనసాగుతున్న విజయసింహారెడ్డి బీజేపీలో చేరితే ఆయనకు టికెట్ ఇవ్వవచ్చనే ప్రచారం కూడా ఉంది. కాంగ్రెస్‌పార్టీ నుంచి ఆశావాహుల్లో పీసీసీ కార్యదర్శి బొల్లు కిషన్, బాలకృష్ణయాదవ్ పోటీలో ఉన్నారు. మొత్తానికి సిట్టింగ్ స్థానమైన ఎంఐఎం పార్టీకి ఈ ఎన్నికల్లో గెలుపు అంత సులువు కాదన్నది ఆ పార్టీని కొంత ఆందోళనకు గురిచేస్తోంది.
ముషీరాబాద్‌కు ‘సన్’స్ట్రోక్
ముషీరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థే ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఇక్కడి నుంచి పోటీ చేయడానికి అనేక మంది కాంగ్రెస్ నాయకులు ఉవ్విళ్లూరుతున్నారు. గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్షుడు దానం నాగేందర్ సోమవారం టీపీసీసీకి పంపించిన జాబితాలో నగరం నుంచే అత్యధికంగా ఏడుగురు అభ్యర్థుల పేర్లతో కూడిన జాబితాను అందించడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అందులో టి.శ్రీనివాస్‌రెడ్డి, అనిల్‌కుమార్‌యాదవ్, విక్రమ్‌గౌడ్, వినయ్‌కుమార్, కోదండరెడ్డి, బాలరాజు, సురేష్‌కుమార్ పేర్లు ఉన్నాయి.
వీరిలో బాల్‌రాజ్, కోదండరెడ్డి మినహా మిగతా ఐదుగురూ కాంగ్రెస్ ముఖ్య నేతల కుమారులే కావడం గమనార్హం. దివంగత మాజీ ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య, ప్రస్తుత ఎమ్మెల్యే టి.మణెమ్మల కుమారుడు శ్రీనివాస్‌రెడ్డి, సికింద్రాబాద్ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ కుమారుడు అనిల్‌కుమార్ యాదవ్, మంత్రి ముఖేష్‌గౌడ్ కుమారుడు విక్రమ్‌గౌడ్, దివంగత కేంద్ర మాజీ మంత్రి పి.శివశంకర్ కుమారుడు డాక్టర్ వినయ్‌కుమార్, ఎస్.యాదగిరి కుమారుడు సురేష్‌కుమార్ దానం పంపిన జాబితాలో ఉన్నారు.
ఇక్కడి ప్రస్తుత ఎమ్మెల్యే మణెమ్మ కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతుండటం, ఆమె కొడుకు శ్రీనివాస్‌రెడ్డి ఉత్సాహంగా పని చేయక పోవడమే ఈ నియోజకవర్గం నుంచి ఏడుగురి పేర్లను సిఫార్సు చేయడానికి కారణమని చెప్పుకుంటున్నారు. అందుకే కాంగ్రెస్ నేతల కళ్లు ఈ స్థానంపై పడ్డాయని అభిప్రాయపడుతున్నారు. ఇదిలావుండగా, నియోజకవర్గంలో ప్రస్తు తం ఆరు డివిజన్లలో కాంగ్రెస్ కార్పొరేటర్లు, నలుగురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉన్నప్పటికీ వారి అభిప్రాయాలను తీసుకోకుండా కేవలం నాయకుల కొడుకుల పేర్లను మాత్రమే పీసీసీకి పంపించడంతో వారంతా మండిపడుతున్నారు. కోదండరెడ్డి గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర కాంగ్రెస్‌లో కీలక పాత్ర పోషించారు.
ఈయన ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని కృతనిశ్చయంతో ఉండి ఇప్పటికే పలుమార్లు ఢిల్లీ పెద్దలను కలిసి వచ్చారు. ఇంతమంది పోటీలో ఉన్నా ఎవరికివారు సీటు మాత్రం తమకే వస్తుందని పైకి ధీమా వ్యక్తం చేస్తున్నారు. నామినేషన్ల సమయం దగ్గరపడుతుండటం, జాబితా ఇంకా సిద్ధం కాకపోవడంతో బీఫాం ఎంవరిని వరిస్తుందోనని కాంగ్రెస్ నేతల్లో ఉత్కంఠ పెరుగుతోంది.