కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలకు హైకోర్టు ఆదేశం
హైదరాబాద్:సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యే వరకు పురపాలక, జెడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికలను వాయిదా వేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై వైఖరి ఏమిటో తెలియచేయాలని హైకోర్టు కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలను ఆదేశించింది.ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూతి రామ్మోహనరావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పురపాలక, జెడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికల ఫలితాల ప్రభావం సార్వత్రిక ఎన్నికలపై ఉంటుందని, దీని వల్ల ఓటర్లు నిష్పాక్షికంగా ఓటు వేయలేరని, ఈ దృష్ట్యా పురపాలక, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను నిలుపుదల చేయాలని, లేదా కనీసం వాయిదా వేయాలని కోరుతూ వి.పవన్‌కుమార్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు.
దీనిని విచారించిన న్యాయమూర్తి... దాదాపు 45 రోజుల పాటు బ్యాలెట్ బాక్సులకు రక్షణ కల్పించడం సాధ్యమేనా? అని ఎన్నికల సంఘాలను ప్రశ్నించారు. దీనిపై వైఖరి ఏమిటో తెలియచేయాలని కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలను ఆదేశిస్తూ విచారణను వచ్చే వారానికి వాయిదా వేశారు.
మున్సి‘పోల్స్’ ఫలితాలపై పిల్ : సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకు మునిసిపల్ ఎన్నికల ఫలితాలు నిలిపేసేలా ఉత్వర్వులివ్వాలని కోరుతూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. మునిసిపల్ ఎన్నికల ప్రభావం త్వరలో జరగబోయే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలపై ఉంటుందని, అందువల్ల మునిసిపల్ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి ప్రక్రియను చేపట్టకుండా రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలంటూ నల్లగొండ జిల్లాకు చెందిన బుక్యా సైదా, నెల్లూరు జిల్లాకు చెందిన న్యాయవాదులు రమేష్‌రెడ్డి, వి.రమణారెడ్డి, హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది ఎం.శివారావు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని బుధవారం ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించనున్నది.
‘పరిషత్తు’ ఎన్నికల వాయిదాపై మీ వైఖరేమిటి?
Published Wed, Mar 26 2014 2:25 AM | Last Updated on Sat, Sep 2 2017 5:09 AM