అప్పుల్లో కూరుకుపోయిన పాకిస్థాన్‌కు ప్రపంచ బ్యాంకు హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోవాలని సూచించింది. దేశంలో నెలకొన్న ఆర్ధిక సంక్షోభాన్ని సరిదిద్దడానికి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. సైనిక, రాజకీయ, వాణిజ్యంలో నాయకుల స్వార్ధప్రయోజనాలు పక్కకు పెట్టి నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని వరల్డ్ బ్యాంకు పాక్ ప్రతినిధి నజీ బాన్‌హాస్సిన్ అన్నారు.
పాకిస్థాన్ ప్రస్తుతం సంక్షోభం అంచున ఉంది. 40 శాతం జనాభా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నారు. ద్రవ్యోల్బణం, పెరుగుతున్న విద్యుత్ ధరలు, తగినన్ని వనరులు లేకపోవడం సహా అనేక ఆర్ధిక కష్టాలను పాక్ ఎదుర్కొంటోంది. పిల్లల విద్యా ప్రమాణాలు, చిన్నారుల మరణాలు వంటి సూచికలు.. పాక్ పేదరికం తారా స్థాయికి చేరిందని చెబుతున్నాయని నజీ బాన్‌హాస్సిన్ తెలిపారు.
2000 నుంచి 2020 మధ్య కాలంలో పాకిస్థాన్ సగటు వాస్తవ తలసరి వృద్ధి రేటు కేవలం 1.7 శాతం మాత్రమే. ఇది దక్షిణాఫ్రికా దేశాల సగటు తలసరి వృద్ధి రేటులో సగం కంటే తక్కువగా ఉందని నజీ వెల్లడించారు. పాక్ మానవాభివృద్ధి సూచికలోనూ దక్షిణాసియాలో చిట్టచివరన ఉంది. విదేశీ నిల్వలు అడుగంటాయి. వాతావరణ మార్పులు ఆ దేశానికి శాపంగా మారుతున్నాయి.
పాక్‌లో వచ్చే జనవరిలో జాతీయ స్థాయిలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. దేశంలో ఆర్ధిక పరిస్థితులు బాగులేని కారణంగా ప్రపంచ బ్యాంకు హెచ్చరికలు జారీ చేసింది. ఆర్ధిక వ్యవస్థను సరిచేసుకోవాల్సిన సమయమని సూచించింది. నాయకులు స్వార్థ ప్రయోజనాల కోసం ఉచిత హామీలకు పోకూడదని పేర్కొంది. ఆర్ధిక రంగాన్ని గాడిన పెట్టడానికి నిర్మాణాత్మక చర్యలు తీసుకోవాలని కోరింది. వృధా ఖర్చులను తగ్గించుకోవాలని ప్రపంచ బ్యాంకు సూచించింది. ప్రజా సేవలు, మౌలిక సదుపాయాల్లో పరిమితమైన ఖర్చు చేయాలని స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: పీఓకేను ఖాళీ చేయండి: భారత్ అల్టిమేటమ్
Comments
Please login to add a commentAdd a comment