
ఇస్లామాబాద్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 మ్యాచ్‌లకు సంబంధించి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆ దేశ ప్రభుత్వానికి కీలక సమాచారమందించినట్లు తెలుస్తోంది. ట్రోఫీలో మ్యాచ్‌లకు హాజరయ్యే విదేశీయులను ముఖ్యంగా చైనా,అరబ్ దేశస్తులను ‘ఐఎస్‌కేపీ’ ఉగ్రవాద సంస్థ కిడ్నాప్ చేసే ప్రమాదముందని హెచ్చరించింది. చైనా,అరబ్ దేశస్తులు ఎక్కువగా సందర్శించే హోటళ్లు, ఇతర ప్రదేశాలపై ఐఎస్‌కేపీ ఉగ్రవాదులు నిఘా ఉంచినట్లు తెలిపింది.
కిడ్నాప్ చేసిన వారిని ఉంచేందుకు మ్యాచ్‌లు జరుగుతున్న ఆయా నగరాల శివార్లలో ఐఎస్‌కేపీ ప్రత్యేక గదులు అద్దెకు తీసుకున్నట్లు సమాచారమిచ్చింది. అంతర్జాతీయ ఈవెంట్లను నిర్వహించే విషయంలో పాకిస్తాన్ సామర్థ్యాన్ని తాజా ఇంటెలిజెన్స్ నివేదిక మరోసారి ప్రశ్నార్థకంలో పడేసింది. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్‌తో పాటు ఆఫ్ఘనిస్తాన్ ఇంటెలిజెన్స్ కూడా ఐఎస్‌కేపీ దాడులపై ఒకే తరహా సమాచారం అందించించడం గమనార్హం.