పోలీసులకు సవాల్! | The challenge! | Sakshi
Sakshi News home page

పోలీసులకు సవాల్!

Published Tue, Mar 11 2014 4:43 AM | Last Updated on Sat, Sep 2 2017 4:33 AM

పోలీసులకు సవాల్!

పోలీసులకు సవాల్!

మున్సిపల్, స్థానికసంస్థలు, సార్వత్రిక ఎన్నికలు పోలీసులకు సవాల్‌గా మారాయి. వరుసగా ఎన్నికలు జరుగనుండడంతో పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా పోతోంది. తిరుపతి పోలీస్ అర్బన్ జిల్లాలో సాధారణ విధులకే పోలీసుల కొరత ఉండడంతో ఎన్నికల విధులు వీరికి అదనపు భారం కానున్నాయి. అయినప్పటికీ, ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు సన్నద్ధం అవుతున్నారు. అదనపు పోలీసు బలగాలను జిల్లాకు రప్పిస్తున్నారు. ఇప్పటికే రెండు కంపెనీల పారా మిలటరీ బలగాలు జిల్లాకు చేరాయి. మరో 10 కంపెనీల బలగాలు రానున్నాయి.
 

 పోలీసులకు సెలవులు రద్దు

 రెండు నెలల వ్యవధిలో వరుసగా ఎన్నికలు జరుగనుండడంతో పోలీసులకు సెలవులు రద్దు చేస్తూ అర్బన్ ఎస్పీ ఎస్వీ  రాజశేఖర్‌బాబు ఉత్తర్వులు జారీ చేశారు. అందరినీ వెంటనే సెలవులు రద్దు చేసుకుని సంబంధిత పోలీస్ స్టేషన్లలో రిపోర్టు చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికలు ముగిసేవరకు 24 గంటలు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అనారోగ్యంతో ఉన్న పోలీస్ సిబ్బంది కూడా సెలవులు రద్దు చేసుకుని రావాలన్నారు. శుభకార్యాలకు కూడా వెళ్లకూడదని, ఇతర ఎలాంటి కార్యక్రమాలు పెట్టుకోరాదని సూచించారు. సబ్‌డివిజన్ స్థాయి పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు గ్రామాల్లో పర్యటించి అక్కడి పరిస్థితులను తెలుసుకుంటూ ఉండాలని ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు.
 

 419 సమస్యాత్మక గ్రామాలు

 తిరుపతి అర్బన్ పోలీసు జిల్లా పరిధిలో 419 సమస్యాత్మక గ్రామాలను పోలీసు అధికారులు గుర్తించారు. ఆయా గ్రామా ల్లో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఇప్పటివరకు అర్బన్ జిల్లా పరిధిలో 52 మందిని ముందస్తుగా బైండోవర్ చేసుకున్నారు. అర్బన్ జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్ల పరిధిలో 460 మంది రౌడీషీటర్లు ఉన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వారిపై ప్రత్యేక నిఘా పెట్టారు.
 

 భారీ పోలీస్ బందోబస్తు

 ఎన్నికల నోటిఫికేషన్లు విడుదల కావడంతో జిల్లాలో పోలీసు బందోబస్తు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఓటర్లు ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకునేలా పోలింగ్ కేంద్రాల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. ఎన్నికల విధులకు అర్బన్ జిల్లాలో ఉన్న ప్రస్తుత పోలీస్ సిబ్బంది, అధికారులతో పాటు మరో 12 కంపెనీల పారామిలటరీ బలగాల అవసరం ఉంది. ఇప్పటికే రెండు కంపెనీల సీఆర్‌పీఎఫ్ బలగాలు అర్బన్ జిల్లాకు చేరుకున్నాయి. మరో వారం రోజుల్లోగా మిగిలిన బలగాలు రానున్నాయి. అర్బన్ జిల్లా పరిధిలో 9 చోట్ల చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. వాటితోపాటు సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టారు. చెక్‌పోస్టుల్లో స్పెషల్‌పార్టీ పోలీసులు, సివిల్ పోలీసులు ఇతర ప్రాంతాల నుంచి జిల్లాలోకి ప్రవేశించే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే    అభ్యర్థులను బట్టి గన్‌మెన్లను కేటాయించనున్నారు.
 

 మద్యం విక్రయాలపై నిఘా

 జిల్లాలో ఐఎంఎల్ లిక్కర్ గోడౌన్ల నుంచి తెచ్చిన మద్యాన్ని మాత్రమే విక్రయించాల్సి ఉంది. ఎన్నికల నేపథ్యంలో జిల్లాకు సరిహద్దుగా ఉన్న తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి రాజకీయ నేతలు మద్యాన్ని తీసుకొచ్చి రహస్య ప్రాంతాల్లో పెట్టుకున్నారనిసమాచారం. జిల్లాలోకి  ఇతర ప్రాంతాలకు చెందిన మద్యం రాకుండా నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకోసం ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి అన్ని నియోజకవర్గాల్లో నిఘా పెట్టాల్సి ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement