ఎన్నికలకు ఘడియలు సమీపిస్తుండటంతో టికెట్ల రభస పెరుగుతోంది. గ్రూపు రాజకీయాలు రాజుకొని నేతలను హడలెత్తిస్తున్నాయి. జిల్లా కాంగ్రెసులో మాజీ మంత్రులు డీకే అరుణ, జైపాల్ రెడ్డిల ప్రభావం కొట్టొచ్చినట్లు కన్పిస్తోంది. ఎవరికి వారు తమవారిని బరిలో నిలిపేందుకు పావులు కదుపుతున్నారు. ఇక పురపాలక ఎన్నికల్లో ఆశావహులు డీసీసీ కార్యాలయంలో గురువారం చేసిన హంగామా వర్గాల తీవ్రతను తెలియజేస్తోంది. కిటికీల అద్దాలు ధ్వంసం చేసి వారు తమ ప్రతాపాన్ని చాటారు. పార్టీని నమ్ముకున్న వారిని కాదని కొత్తగా వచ్చిన వారికి ‘బీ ఫారం’ ఇస్తారా అని తిరగబడ్డారు.
సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కాంగ్రెస్ నేతలు ఎంపీ, ఎమ్మెల్యే టికెట్ వేటలో పావులు కదుపుతుండటంతో గ్రూపు రాజకీయాలు జోరందుకున్నాయి. తెలంగాణ ఎన్నికల కమిటీ ఏర్పాటు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల పరిశీలకుడు దిగ్విజయ్ సింగ్ రాకతో టికెట్ రాజకీయాలు వేడెక్కాయి. రెండు రోజుల క్రితం కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించిన తెలంగాణ ఎన్నికల కమిటీలో 23 మందికి చోటు కల్పించారు. కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డితో పాటు జిల్లాకు చెందిన మాజీ మంత్రి డీకే అరుణకు ఈ కమిటీలో ప్రాతినిథ్యం దక్కింది. దీంతో ఈ ఇద్దరు నేతలు కేంద్రంగా జిల్లా కాంగ్రెస్‌లో కొనసాగుతున్న గ్రూపు రాజకీయాలు ఊపందుకున్నాయి.
కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం ఆయన వర్గీయుల్లో ఉత్సాహం నింపింది. మరోవైపు ఎన్నికల కమిటీలో డీకే అరుణకు కూడా చోటు దక్కడంతో మాజీ మంత్రి వర్గీయులూ ధీమాతో వున్నారు. గద్వాల, వనపర్తి మినహా మిగతా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ నేతలు రెండు వర్గాలుగా చీలి టికెట్ల కోసం పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిటీలో సభ్యులుగా వున్న జైపాల్‌రెడ్డి, అరుణపై టికెట్ కోసం సొంత వర్గీయుల నుంచి తీవ్ర ఒత్తిడి వుండే అవకాశం కనిపిస్తోంది.
అసెంబ్లీకి విఠల్‌రావు?
కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తారనే ప్రచారంతో కాంగ్రెస్‌లో రాజకీయ సమీకరణాలు మారే సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో మహబూబ్‌నగర్ లోక్‌సభ నుంచి పోటీ చేసిన మాజీ ఎంపీ విఠల్‌రావు అసెంబ్లీ బరిలో నిలిచే అవకాశం వుంది. నారాయణపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు విఠల్‌రావు ఆసక్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు లోక్‌సభకు విఠల్‌రావు పోటీ చేయడంపైనా కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు మాజీ ఎమ్మెల్యేలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.
జైపాల్‌రెడ్డి ఎంపీగా బరిలో లేని పక్షంలో మాజీ ఎంపీ మల్లికార్జున్ సతీమణిని పోటీలో నిలిపేందుకు ఓ వర్గం ప్రయత్నం చేస్తోంది. జడ్చర్ల అసెంబ్లీ స్థానం ఖరారైందంటూ మాజీ ఎంపీ మల్లు రవి వర్గీయులు హడావుడి చేస్తున్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల పరిశీలకులు దిగ్విజయ్ సింగ్ మరో రెండు రోజులు హైదరాబాద్‌లోనే వుండబోతున్నారు. దీంతో జిల్లా నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న నేతలు దిగ్విజయ్‌కు వినతిపత్రాల సమర్పణ, బల ప్రదర్శనకు సన్నద్దమవుతున్నారు.
బీ ఫారాల కోసం ఒత్తిడి
కొద్ది గంటల్లో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగియ నుంది. ఆశావహుల నుంచి ఒత్తిడి ఎక్కువగా వుండటం తో బీ ఫారాల జారీ మరింత ఆలస్యమ య్యే సూచనలు కనిపిస్తున్నాయి. నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువు మా ర్చి 18 కావడంతో ఆలోపు బీ ఫారాలు జారీ చేసే అవకాశం వుంది. పార్టీ టికెట్‌పై ఆశతో ఔత్సాహికులు స్వతంత్రులుగా నామినేషన్లు వేసి బీ ఫారాల కోసం పార్టీ నేతలు, కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. తమకే బీ ఫారం దక్కేలా ముఖ్య నేతలపై ఒత్తిళ్లు తెస్తున్నా జనరల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ముఖం చాటేస్తున్నారు.
గద్వాలలో మాజీ మంత్రి డీకే అరుణ, వనపర్తిలో మాజీ మంత్రి చిన్నారెడ్డి, నాగర్‌కర్నూలులో జడ్పీ మాజీ చైర్మన్ దామోదర్ రెడ్డి అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. షాద్‌నగర్‌లో ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి, ఐజలో ఎమ్మెల్యే అబ్రహం, నారాయణపేటలో ఆప్కాబ్ చైర్మన్ వీరారెడ్డి అభ్యర్థుల జాబితా సిద్దం చేస్తున్నారు. మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ, కల్వకుర్తి నగర పంచాయతీలో మాత్రం నేతలు గ్రూపులుగా విడిపోవడంతో కమిటీలు ఏర్పాటు చేసినా కసరత్తు కొలిక్కి రావడం లేదు.