వాషింగ్టన్: రాబోయే సార్వత్రిక ఎన్నికలు భారతదేశ చరిత్రలోనే అత్యంత ఖరీదైనవి కాబోతున్నాయని అమెరికాకు చెందిన నిపుణుడు అంచనా వేశారు. ప్రజాస్వామ్య దేశాల్లో ఇప్పటి దాకా జరిగిన అత్యంత ఖరీదైన ఎన్నికలుగా కూడా ఇవి నిలిచే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ‘2016లో అమెరికా అధ్యక్ష, కాంగ్రెస్ ఎన్నికలకు అయిన వ్యయం 6.5 బిలియన్ డాలర్లు(రూ.46,166 కోట్లు). భారత్‌లో 2014 లోక్‌సభ ఎన్నికల ఖర్చు సుమారు 5 బిలియన్ డాలర్లు(రూ.35,512 కోట్లు). ఈసారి వ్యయం దానికి రెట్టింపు(రూ.71,025 కోట్లు) అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. దీంతో భారత ఎన్నికలే ప్రపంచంలో అత్యంత ఖరీదైనవిగా నిలవబోతున్నాయి’ అని మిలాన్ వైష్ణవ్ అనే రాజకీయ నిపుణుడు అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం ఆయన వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తున్న కార్నెజీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్ దక్షిణాసియా డైరెక్టర్, ఫెలోగా పనిచేస్తున్నారు. ఈసారి బీజేపీ, ఇతర విపక్షాల మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని అంచనా వేస్తున్న నేపథ్యంలో ఖర్చుకు రాజకీయ పక్షాలు ఏమాత్రం వెనకాడబోవని మిలాన్ చెప్పారు. భారత్‌లో రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చే విధానంలో పారదర్శకత లేకపోవడం పెద్ద లోపమని పేర్కొన్నారు. దీని వల్ల ఏ పార్టీ ఎక్కడి నుంచి ఎంత మొత్తాన్ని సేకరిస్తోందో తెలుసుకోవడం కష్టమవుతోందని తెలిపారు. తాము ఫండింగ్ చేసిన పార్టీ అధికారంలోకి రాకపోతే వేధింపులు తప్పవన్న భయంతో చాలా మంది విరాళాలను బహిర్గతం చేయడంలేదని అన్నారు. తాజాగా అమల్లోకి వచ్చిన ఎన్నికల బాండ్ల విధానం వల్ల పరిస్థితిలో పెద్దగా మార్పు రాలేదని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment