సీటు..ఫైటు
సాధారణ ఎన్నికలు, స్థానిక ఎన్నికలు ఒకేసారి రావడంతో రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. ఉద్యమ పార్టీగా టీఆర్‌ఎస్‌లో ఇన్నాళ్లు స్తబ్ధుగా ఉన్న వర్గపోరు ఇప్పుడు బయటపడుతోంది. ఎన్నికల తరుణంలో అవకాశాల కోసం శ్రేణుల మధ్య పోటీ ఘర్షణలకు దారితీస్తోంది. స్టేషన్ ఘన్‌పూర్ టీఆర్‌ఎస్‌లోని వర్గాలు ఇప్పుడు స్థానిక అవకాశాల కోసం పోరాటం మొదలుపెట్టాయి.
టీఆర్‌ఎస్ కీలక నేత కడియం శ్రీహరి, సిట్టింగ్ ఎమ్మెల్యే టి.రాజయ్య వర్గాల మధ్య కొన్నాళ్లుగా కొనసాగుతున్న వర్గపోరు... ద్వితీయ శ్రేణి నేతల ఘర్షణతో మంగళవారం మరోసారి బయటపడింది. తెలంగాణ ఏర్పాటుతో మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో కడియం శ్రీహరి వర్గీయులు తమ నేతను ఎమ్మెల్యేగా పోటీ చేయించే వ్యూహాన్ని ముందుకు తెచ్చారు. కడియం శ్రీహరితోపాటు టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన వర్గాన్ని సమీకరిస్తున్నారు.
ఎమ్మెల్యే టి.రాజయ్య నిర్లక్ష్యంగా వ్యవహరించారని భావిస్తున్న టీఆర్‌ఎస్ వ్యవస్థాపక శ్రేణులను కడియం వర్గీయులు అక్కున చేర్చుకుంటున్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అభ్యర్థిత్వాల ఖరారు అంశాన్ని ముందుకుపెట్టి ఎమ్మెల్యే అభ్యర్థిగా కడియం శ్రీహరి అయితే బాగుంటుందనే అంశాన్ని తెరపైకి తెచ్చారు. కడియం శ్రీహరి ఎమ్మెల్యే అయితేనే స్టేషన్ ఘన్‌పూర్ మళ్లీ అభివృద్ధి చెందుతుందనే ప్రచారం చేస్తున్నారు. మూడు రోజుల క్రితం మొదలైన ఈ ప్రక్రియ ఊపందుకుంది. దీన్ని పసిగట్టిన ఎమ్మెల్యే రాజయ్య వర్గీయులు ప్రతి వ్యూహాలతో సన్నద్ధమవుతున్నారు. స్థానిక ఎన్నికల్లో అవకాశాలు దక్కించుకునే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. వీరు సైతం టీఆర్‌ఎస్ మొదటి నేతలను కలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇలా రెండు వర్గాలు మొదటి నుంచి టీఆర్‌ఎస్‌లో ఉన్న వారిని దగ్గరగా చేర్చుకుంటూ తమ నేతలను ఎమ్మెల్యేగా పోటీ చేయించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇలా ఇరు వర్గాల వ్యూహాలు జోరందుకోవడంతో జఫర్‌గఢ్ మండలం తీగారం సమీపంలో ఏకంగా ఘర్షణ వరకు వెళ్లింది. ఒకరికొకరు తోపులాటకు దిగారు. ఈ ఘర్షణలో ఓ నాయకుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యూరు. ఆయనను వెంట నే జఫర్‌గఢ్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అరుు తే స్థానిక, సాధారణ ఎన్నికలలోపు ఇలాంటివి ఇంకా జరిగే పరిస్థితి ఉందని టీఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారు. కడియం శ్రీహరి, రాజయ్య వర్గీయుల పంచాయతీ.. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ వద్దకు వెళ్లిందని ప్రచారం జరుగుతోంది. రాజయ్య వర్గీయులు రెండుమూడు రోజుల్లో కేసీఆర్‌ను కలవనున్నట్లు చెబుతున్నారు.
పదవుల కోసం పోటీ
ఇన్నాళ్లు ఉద్యమం కారణంగా పదవుల కోసం పోటీ పడేందుకు సంశయంగా ఉన్న టీఆర్‌ఎస్ నేతలు మొహమాటం లేకుండా వ్యవహరిస్తున్నారు. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో మొదట టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి పనిచేసిన వారే ఉన్నారు. 1994, 1999లో కడియం శ్రీహరి స్టేషన్ ఘన్‌నూర్ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. పదేళ్లు మంత్రిగా పని చేశారు. 2004 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఇక్కడ గెలిచింది. జి.విజయరామారావు ఏకంగా రాష్ట్ర మంత్రి అయ్యారు. 2008 ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా కడియం శ్రీహరి గెలిచారు. 2009 ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి టి.రాజయ్య చేతిలో కడియం శ్రీహరి ఓడిపోయారు.
అనంతరం రాజయ్య టీఆర్‌ఎస్‌లో చేరారు. 2012లో జరిగిన ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కడియం శ్రీహరిపై రాజయ్య గెలిచారు. అనంతరం కడియం శ్రీహరి కూడా టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇలా మూడు పార్టీల్లో ముఖ్య నేతలుగా ఉన్న కడియం శ్రీహరి, జి.విజయరామారావు, ఎమ్మెల్యే రాజయ్యలు టీఆర్‌ఎస్‌లోనే చేరడంతో వర్గపోరు తీవ్రమైంది. తర్వాత విజయరామారావు కాంగ్రెస్‌లో చేరారు. అయినా కడియం, రాజయ్య వర్గాల మధ్య పోరు కొనసాగుతూనే ఉంది. ఎన్నికల తరుణంలో ఇది బయటపడుతోంది.