ప్రతినిధి, అనంతపురం : సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిపే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను టీడీపీ అధినేత చంద్రబాబు ఓ కొలిక్కి తెచ్చినా ‘తమ్ముళ్ల’ గ్రూపు తగాదాలతో సతమతమవుతున్నారు. హిందూపురం అభ్యర్థిగా బాలకృష్ణ పేరును అధికారికంగా ఖరారు చేశారు. దీంతో 16న బాలకృష్ణ నామినేషన్ దాఖలు చేయనున్నారు. రాయ‘బేరం’ కుదరడంతో మాజీ ఎమ్మెల్యే మధుసూదన్‌గుప్తాకు టీడీపీ తీర్థం ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరించారు. పనిలో పనిగా గుంతకల్లు అభ్యర్థిత్వాన్ని ఆయనకే ఖరారు చేసినట్లు సమాచారం. మడకశిర అభ్యర్థిగా ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ ఈరన్ననే మరోసారి ఖరారు చేసినట్లు తెలిసింది.
ఈ రెండు అభ్యర్థిత్వాలను చంద్రబాబు ఆదివారం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. చంద్రబాబు ఏకపక్ష వైఖరిపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. బీజేపీతో పొత్తులో భాగంగా అనంతపురం శాసనసభ స్థానాన్ని ఆ పార్టీకి టీడీపీ వదిలేసిన విషయం విదితమే. రెండు లోక్‌సభ, 13 శాసనసభ స్థానాల్లో పోటీ చేయాలని టీడీపీ నిర్ణయించింది. హిందూపురం లోక్‌సభ అభ్యర్థిగా ఎంపీ నిమ్మల క్రిష్టప్ప, ఉరవకొండ, కళ్యాణదుర్గం, రాయదుర్గం, ధర్మవరం, రాప్తాడు, పెనుకొండ, కదిరి, పుట్టపర్తి అభ్యర్థులుగా పయ్యావుల కేశవ్, ఉన్నం హనుమంతరాయచౌదరి, కాలవ శ్రీనివాసులు, వరదాపురం సూరి, పరిటాల సునీత, బీకే పార్థసారధి, కందికుంట వెంకటప్రసాద్, పల్లె రఘునాథరెడ్డిలను తొలి జాబితాలోనే ఖరారు చేశారు. శుక్రవారం అర్ధరాత్రి విడుదల చేసిన రెండో జాబితాలో అనంతపురం లోక్‌సభ అభ్యర్థిగా జేసీ దివాకర్‌రెడ్డి, తాడిపత్రి, శింగనమల అభ్యర్థులు జేసీ ప్రభాకర్‌రెడ్డి, బండారు రవికుమార్‌లను ప్రకటించారు. రెండో జాబితాలోనే హిందూపురం అభ్యర్థిగా బాలకృష్ణ పేరును ప్రకటించాలని చంద్రబాబు నిర్ణయించారు. కానీ.. అదే సీటు కోసం హరికృష్ణ పట్టుబడుతుండటం, హిందూపురం స్థానిక నేతలు కూడా పోటీపడుతోండటంతో వ్యతిరేకత వ్యక్తమవుతుందన్న ఉద్దేశంతో బాలకృష్ణ పేరును చివరి నిముషంలో తప్పించారు. ఇది పసిగట్టిన బాలకృష్ణ శనివారం ఉదయం చంద్రబాబుతో సమావేశమై తన అభ్యర్థిత్వంపై నిలదీసినట్లు సమాచారం. దీంతో హిందూపురం ఎమ్మెల్యే అబ్దుల్‌ఘనీ, ఆ నియోజకవర్గ నేతలను హుటాహుటిన హైదరాబాద్‌కు రప్పించిన చంద్రబాబు.. వారికి సర్దిచెప్పి బాలకృష్ణ అభ్యర్థిత్వాన్ని శనివారం ఖరారు చేశారు. ‘పురం’ అభ్యర్థిగా బాలకృష్ణ ఈనెల 16న నామినేషన్ దాఖలు చేయనున్నారు.
కుదిరిన రాయ‘బేరం’
గుంతకల్లు టీడీపీ అభ్యర్థిత్వం కోసం జితేందర్‌గౌడ్, కేసీ నారాయణస్వామి, వెంకటశివుడు యాదవ్‌లు పోటీపడగా వారి పేర్లను చంద్రబాబు కనీసం పరిశీలించలేదు. మధుసూదన్ గుప్తాతో సీఎం రమేష్, జేసీ దివాకర్‌రెడ్డి ద్వారా రాయ‘బేరం’ జరిపారు. ‘బేరం’ కుదరడంతో గుప్తాను టీడీపీలో చేర్చుకోవడానికి చంద్రబాబు అంగీకరించారు. గుంతకల్లు అభ్యర్థిగా ఆయన పేరును ఖరారు చేసినట్లు తెలిసింది. అధికారిక ప్రకటన ఆదివారం వెలువడే అవకాశం ఉంది. చంద్రబాబు తీరుపై జితేందర్‌గౌడ్, కేసీ నారాయణస్వామి, వెంకటశివుడు యాదవ్‌లు మండిపడుతున్నారు. ఆ ముగ్గురిని సంతృప్తిపరచి రాజీ చేసుకునే బాధ్యతను కూడా మధుసూదన్‌గుప్తాకే చంద్రబాబు అప్పగించినట్లు సమాచారం. రాయదుర్గం అభ్యర్థిత్వాన్ని కాలవ శ్రీనివాసులకు ఖరారు చేయడంపై దీపక్‌రెడ్డి భగ్గుమంటున్నారు. కాలవకు సహకరించే ప్రశ్నే లేదని తెగేసి చెబుతున్నారు. కార్యకర్తలతో ఆదివారం మరోమారు సమావేశమై భవిష్యత్‌పై దీపక్‌రెడ్డి నిర్ణయం తీసుకోనున్నారు. శింగనమల నియోజకవర్గంలో బండారు రవికుమార్‌కు కూడా ఆపార్టీ శ్రేణుల నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతోంది. చంద్రబాబు నిర్ణయంపై ఎమ్మెల్సీ శమంతకమణి మండిపడుతున్నారు.
‘అనంత’ కమలనాథులదే..
శుక్రవారం అర్ధరాత్రి చంద్రబాబుతో సమావేశమైన బీజేపీ నేతలు.. అనంతపురం శాసనసభ స్థానం తమకు వద్దని మరో స్థానం కేటాయించాలని ప్రతిపాదించారు. కానీ.. ఆ ప్రతిపాదనను చంద్రబాబు తోసిపుచ్చారు. అనంతపురం నియోజకవర్గంలో టీడీపీ ముఠా తగాదాలు భారీ స్థాయిలో ఉన్నందున ఆ స్థానాన్ని మీకు కేటాయించామని చంద్రబాబు స్పష్టీకరించడంతో కమలనాథలు తెల్లబోయారట. అనంతపురం బీజేపీ అభ్యర్థిగా తాళంకి శ్రీధర్ లేదా ఎన్‌టీ చౌదరిని ఎంపిక చేయాలని చంద్రబాబు ఉచిత సలహా ఇవ్వడం కమలనాథులను ఆగ్రహానికి గురిచేసినట్లు సమాచారం. తాళంకి శ్రీధర్ తండ్రి తాళంకి కృష్ణమూర్తి బీజేపీలో దశాబ్దాల పాటు పనిచేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌లో కూడా పనిచేశారు. తాళంకి శ్రీధర్ అమెరికాలో స్థిరపడ్డారు.
కుదిరిన రాయ‘బేరం’
Published Sun, Apr 13 2014 3:29 AM | Last Updated on Fri, Aug 10 2018 8:06 PM
Advertisement
Advertisement