
యువోహం
కొండనైనా ఢీకొట్టే దైర్యం.. ఉప్పెనకే ఎదురెళ్లే సాహసం.. ఉరకలెత్తే ఉత్సాహం.. ఆలోచనతో కూడిన ఆవేశం..యువత సొంతం. కరో కరో జర జల్సా.. అనుకుంటూ ఎంజాయ్ చేసే కొత్త తరం కుర్రాళ్లంతా ప్రస్తుతం నవ సమాజం గురించి కలలు కంటున్నారు. ఎన్నికల వేళ... నడుస్తున్న రాజకీయం పైనా, విశ్వసనీయత కరువైన నాయకులపైనా గళమెత్తాలని ఆరాటపడుతున్నారు.
వారి ఆరాటానికి.. ఆలోచనలకు మార్గం చూపే చుక్కాని లాంటి యువ నాయకత్వం ఇప్పుడు తక్షణావసరం. ఆవేశం, ఆలోచన కలగలిపిన నవతరం నేతను ఇప్పటి యువత కోరుకుంటోంది. నాన్న స్థానంలో నిలబడి ఫీజు కట్టే నాయకత్వం కావాలన్నా... అమ్మకో, నాన్నకో, అవ్వకో జబ్బు చేస్తే ఆత్మీయుడిలా నిలబడే అన్నలాంటి పాలకుడు కావాలన్నా.. యువత ప్రయోగించాల్సింది వారి చేతుల్లోని వజ్రాయుధం లాంటి ఓటునే. చీకటి రాజకీయాల్ని చీల్చి, కుట్రల రాజకీయాల్ని అంతం చేసి నిఖార్సయిన రాజకీయానికి ప్రాణం పోసేందుకు దాన్ని ప్రయోగించాలి. ఓ యువకుడి ఆలోచన, అవసరం.. మరో యువకుడికే అర్థమవుతుంది. అందుకే యువత లోంచే నాయకుడు రావాలని, యువ నాయకత్వానికే పగ్గాలు చిక్కాలని యువతీయువకులంతా కోరుకుంటున్నారు. - దారుషిఫా, న్యూస్‌లైన్
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కొత్తతరం ఓట్లే కీలకంగా మారబోతున్నాయి. అంటే 18-21 ఏళ్ల యువకుల ఓట్లు నేతల తలరాతలు మార్చనున్నాయి. గత ఎన్నికల చరిత్రను చూస్తే.. 19వ దశకం వరకు విద్యార్థులు ఉద్యమాలు, కాలేజీ ఎన్నికల్లో చురుకుగా పాల్గొనేవారు. దేశంలో ఎక్కడ ఏ ఉద్యమం ఉనికి లోకి వచ్చినా... అందులో యువకులు, విద్యార్థులదే కీలకపాత్ర. అనంతరం అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా ఇటు విద్యార్థులు, అటు యువకులు తమ జీవిత ఆశయాలు, లక్ష్యాలను సాధించడంలో నిమగ్నమయ్యారు. అందుకే గత రెండు దశబ్దాలుగా సమాజంలో జరుగుతున్న మార్పులు, రాజకీయ పరిణామాలపై యువకులు, విద్యార్థులు ఎక్కువ శాతం శ్రద్ధ చూపలేదు. కానీ మళ్లీ వారు రీచార్జ్ అయ్యారు.
పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం, ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్స్ యాప్ తదితర సోషల్ నెట్‌వర్క్ మీడియా పుణ్యమా అని చైతన్యవంతమయ్యారు. సమాచార ప్రసార మాధ్యమాల్లో వస్తున్న నూతన మార్పులు, సమాజంలో జరుగుతున్న పరిణామాలు, రాజకీయాల్లో వస్తున్న మార్పులు ఎప్పటికప్పుడు ఫాలో అవుతున్నారు. ప్రతీ అంశానికి తమదైన రీతిలో స్పందిస్తున్నారు. అంతేకాదు.. గత రెండు, మూడేళ్లలో జరిగిన ఎన్నికల్లో కీలకపాత్ర పోషించి, రాజకీయ మార్పుల కోసం కూడా ప్రయత్నించారు. గతేడాది జరిగిన ఢిల్లీ ఎన్నికలే దీనికి నిదర్శనం.
భారీగా పెరిగిన యువ ఓటర్లు
యువత ఈ ఎన్నికల్లో చైతన్యవంతమైన పాత్ర పోషించనుందని చెప్పడానికి పెరిగిన కొత్తతరం ఓట్లే నిదర్శనం. ఇప్పటివరకూ ఎన్నికలను అంతగా పట్టించుకోని యువతరం ఈసారి ఓటర్లుగా పేరు నమోదు చేయించుకోవడానికి పోటీపడింది. ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం ఈసారి 18-19 ఏళ్ల వయసు గల ఓటర్ల సంఖ్య గతంలో ఎన్నడూ లేని విధంగా 23 కోట్లకు చేరింది. ఇది మొత్తం దేశ ఓటర్లలో 2.88 శాతంగా ఉంది. ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం.. ఈ ఎన్నికల్లో 15వ లోక్‌సభ ఎన్నికల కంటే 10 కోట్ల మంది ఎక్కువగా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. గణంకాల ప్రకారం చూస్తే భారతదేశంలో సగం జనాభా 25 ఏళ్ల కంటే తక్కువగా ఉన్నారు. అంటే ఈ వయసు గల ఓటర్లే రాబోయే ఎన్నికల్లో తమ ప్రభావాన్ని చూపనున్నారు. ఇప్పటి వరకు జరిగిన అన్ని సార్వత్రిక ఎన్నికల్లో ఈ వయసున్న ఓటర్లు ఇప్పటి వరకు సగం కూడా లేరు... ఇలా జరగడం ఇదే మొదటిసారి.
టెక్నాలజీతో ఆకర్ష్ మంత్ర
సార్వత్రిక ఎన్నికల్లో ఈ సారి అన్ని రాజకీయ పార్టీల
‘నవ’ భావమిదీ...
రాజకీయ నాయకులు ఓట్ల కోసం పలు రకాలుగా పాట్లు పడుతుంటే.. యువ ఓటర్లు మాత్రం జాతి, కుల, మత భావాలకతీతంగా ఆలోచిస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమం, మార్పునకు కట్టుబడే నాయకుల వైపు మొగ్గు చూపుతున్నారు. నాయకుడంటే దీర్ఘకాల లక్ష్యాలతో సమాజానికి దిశానిర్దేశం చేసేవాడై ఉండాలంటోంది నగరానికి చెందిన కంప్యూటర్ సైన్స్ విద్యార్థిని ఎ.చిన్మయి. యువత రాజకీయాలకు దూరంగా ఉండాలనుకోవడం సరికాదు. వారి నిర్ణయాలే సమాజాన్ని శాసిస్తాయి కనుక ఏ నాయకుడైతే మన ఆకాంక్షలు నెరవే రుస్తాడో తెలుసుకుని వారికి ఓటేయాలంటోందామె. వయసు పైబడిన వారు పార్టీని, అభ్యర్థి పలుకుబడిని చూసి ఓట్లు వేస్తారు. అలా కాకుండా నేటి యువత రాజకీయాల్లో జరుగుతున్న మార్పులను ఎప్పటికప్పుడు తెలుసుకొని పార్టీ సిద్ధాంతాలను పక్కనబెట్టి దేశ తలరాతలను మార్చే విద్యావంతులైన యువ నాయకులకు పట్టం కట్టేందుకు సిద్ధమవుతున్నారు. విద్యావంతులైన నాయకులైతేనే సమాజానికి ఏది మేలో సరియైన నిర్ణయం తీసుకోగలరని సంతోష్‌కుమార్ రెడ్డి అభిప్రాయపడుతున్నారు.
ఉన్న వ్యవస్థను మార్చడం యువకులకే సాధ్యమని, రాజకీయాలపై అవగాహన పెంచుకుని సరైన నేతలను ఎంచుకోవాలని ఆయన సహవిద్యార్థులకు సూచిస్తున్నాడు. డబ్బు సంపాదన కోసమే రాజకీయాల్లోకి వచ్చే నేతల పట్ల కూడా యువత అప్రమత్తమవుతోంది. ఇలాంటి నేతల గురించి మాట్లాడుతూ అలవిగాని పథకాలు ప్రకటించే నేతలు, డబ్బులు పంచే నాయకులకు దూరంగా ఉండాలని ఇంజనీరింగ్ విద్యార్థిని అనురాధ యువతకు పిలుపునిస్తోంది. డబ్బు, మద్యం తదితర ప్రలోభాలకు లొంగవద్దని మరో ఇంజనీరింగ్ విద్యార్థి స్మరణ్ కోరుతున్నారు. యువకుడే యువకులు సమస్యలను తెలుసుకొని ప్రపంచ దేశాల్లో జరుగుతున్న అభివృద్ధిని మన దేశంలో చేస్తాడని ఆయన భావిస్తున్నారు.
తొలిసారిగా ప్రవేశపెడుతున్న ‘నోటా’పైనా యువత ఆసక్తిగా ఉంది. సరైన నాయకుడు లేనప్పుడు ‘నోటా’ను ఆయుధంగా ప్రయోగించాలని నవతరం ప్రతినిధి విశాల అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా ఈ ఎన్నికల్లో యువత ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చే ప్రజాప్రతి‘నిధులను’ ఎన్నుకోవడమే కొత్తతరం ఏకైక లక్ష్యంగా మారింది.