అలాగైతే నోటానే! | No Development, No Vote, Telangana | Sakshi
Sakshi News home page

అలాగైతే నోటానే!

Published Fri, Nov 9 2018 11:31 AM | Last Updated on Fri, Nov 9 2018 11:54 AM

No Development, No Vote, Telangana - Sakshi


సాక్షి,ఉట్కూర్‌ (మక్తల్‌):  సమాజంలో మార్పును తీసుకవచ్చి జాతి భవిష్యత్‌ను మార్చగల సత్తా యువతకే ఉంది. వచ్చే నెలలో జరగనున్న ఎన్నికల్లో ప్రలోభాలకు లొంగకుండా మంచి అ«భ్యర్థులను ఎన్నునకునేందుకు తమ ఓటు హక్కు వినియోగిస్తామని పలువురు యువతీయువకులు చెబుతున్నారు. పోటీ చేసే వారిలో సరైన అభ్యర్థులు లేకపోతే ‘నోటా’కే ఓటు వేస్తామని మండలంలోని యువత అంటున్నారు. నోటుకు కాదు – నేతలను చూద్దాం, మనిషిని కాదు – నేతల మనసును చూద్దాం,  అవినీతిని కాదు–  నిజాయితీని గెలిపిద్దామని ప్రతిన బూనడమే కాకుండా ఇతరులకు కూడా అవగాహన కల్పిస్తామని చెబుతున్నారు. ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థులు నచ్చకపోతే తిరష్కరణ ఓటు వేసే అవకాశాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఓటర్లకు కల్పించింది. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల్లో అభ్యర్థుల గుర్తుతో పాటు నోటా(నన్‌ ఆఫ్‌ ది ఎబోవ్‌) మీట ఏర్పాటు చేశారు. దీనిపై పలువురు యువత అభిప్రాయాలు ఇలా ఉన్నాయి. 


సుస్థిర పాలన అందించే పార్టీకే.. 
రాష్ట్రంలో సుస్థిర, సుపరిపాలన అందించడమే కాకుండా యువతకు ఉద్యోగావకాశాలు, ఉపాధి కల్పించి ప్రణాళికబద్ధంగా పరిపాలించే పార్టీకే ఓటు వేయడానికి ప్రాధాన్యత ఇస్తా. ఈ విషయమై నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యాక అభ్యర్థులందరినీ పరిశీలించి మంచి వారిని గుర్తిస్తా.  
– సాదతుల్లా ఖాన్, ఊట్కూర్‌ 


విద్యాభివృధ్దికిపాటుపడే వ్యక్తికే ఓటు 
ఎమ్మెల్యేగా పోటీ చేసే వ్యక్తి స్థానిక సమస్యలపై పూర్తిగా అవగాహన కలిగి ఉండాలి. పాఠశాలల్లో మౌలిక వసతులు, ఉపా«ధ్యాయులు లేక విద్యార్థులకు చదువు నామమాత్రంగా అందుతుంది. విద్యాభివృద్ధికి పాటుపడే వ్యక్తికి ఓటు వేస్తా. 
– అబ్దుల్‌ రషీద్‌, నగిరి


 ఊట్కూర్‌ సాగు నీరందించే వారికే ఓటు 

మండలంలో పంట పొలాలు ఎడారులుగా మారుతుండడంతో రైతులు వలసలు పోతున్నారు. వలసలను నివారించి ఎత్తిపోతల పథకం ద్వారా పంట పొలాలకు సాగునీరందించాలి. ప్రభుత్వంతో ఒప్పించి వ్యవసాయ అభివృద్ధికి పాటు పడే వ్యక్తికే ఓటు వేస్తా. 
– సి.ఆనంద్‌ కుమార్, ఊట్కూర్‌ 


అవినీతిని అరికట్టే వ్యక్తి కావాలి 
ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల్లో అవినీతి రాజ్యమేలుతోంది. పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు దక్కడం లేదు. అవినీతిని పూర్తిస్థాయిలో అరికట్టే అ«భ్యర్థి ఎన్నిక కావాల్సి ఉంది. అలాంటి అభ్యర్థిని గుర్తించి నా ఓటు వేస్తా. 
– శాంతికుమార్‌రెడ్డి, ఊట్కూర్‌  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement