కర్నూలులో బండలపైనే కూర్చొని దరఖాస్తులు స్వీకరిస్తున్న బీఎల్‌ఓలు
ఓటరు నమోదుకు స్పందన కరువు
Published Sun, Dec 11 2016 10:39 PM | Last Updated on Mon, Sep 4 2017 10:28 PM
– తెరచుకోని పోలింగ్ కేంద్రాలు
– పట్టించుకోని రెవెన్యూ అధికారులు
–ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులు 22 వేల లోపే
కర్నూలు(అగ్రికల్చర్): ఓటరు నమోదుకు స్పందన కరువైంది. జిల్లాలో జనవరి1 నాటికి 18 ఏళ్లు నిండే యువతీ యువకులు దాదాపు 50 వేల మంది ఉన్నారు. అలాగే 20 ఏళ్లు లోపు యువత లక్షకు పైగా ఉన్నారు. వీరందరూ ఓటర్లుగా నమోదు అయ్యేందుకు అర్హులే.... కాని ఓటర్లుగా నమోదు కావడం లేదు. ఓటర్లుగా నమోదు కావడానికి ప్రభుత్వం తరుపున ప్రోత్సాహం కూడా కరువైంది. గత నెల 15 నుంచి ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం మొదలైంది. ఆదివారాన్ని (11వతేదీని) ఎన్నికల కమీషన్ ప్రత్యేక ఓటరు నమోదు దినంగా ప్రకటించింది. ఈ రోజున జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాలను తెరచి ఉంచాలి. జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజక వర్గాల్లో జిల్లాలో 3541 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 50శాతం కూడా తెరవలేదు.
ఐదు నియోజక వర్గాల్లో మెరుగు...
కర్నూలు, పాణ్యం, మంత్రాలయం, పత్తికొండ, బనగానపల్లె నియోజక వర్గాల్లో పలు పోలింగ్ కేంద్రాలను తెరచి ఓటరు నమోదు కోసం దరఖాస్తులు స్వీకరించారు. మిగిలిన నియోజక వర్గాల్లో పోలింగ్ కేంద్రాలను చాలా వరకు తెరవ లేదు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం రాజకీయ పార్టీలు కూడా బూత్ లెవల్ ఏజెంట్లను నియమించుకోవాలి. ఓటరు నమోదులో సహకరించాల్సి ఉంది. వైఎస్‌ఆర్‌సీపీ చాలా వరకు బూత్ లెవల్ ఏజెంట్లను నియమించినా మిగిలిన రాజకీయ పార్టీలు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇప్పటి వరకు ఓటరు నమోదు కోసం వచ్చిన దరఖాస్తులు 22వేలకు మించలేదంటే అవగాహన కార్యక్రమాలు లేకపోవడమే ప్రాధాన కారణం.
అవగాహన ఏదీ?
పోలింగ్ కేంద్రాల్లో ముసాయిదా ఓటర్ల జాబితా, ఫారం–6, 7 ధరఖాస్తులను బిఎల్‌ఓలు ఉంచుకోవాలి. ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంపై టాంటాం చేసి 18 ఏళ్లు నిండిన యువతీ, యువకులు, ఓటర్ల జాబితాలో పేర్లు లేని వారందరూ దీనిని వినయోగించుకునే విధంగా అవగాహన కల్పించాలి. కాని దీనిని పట్టించుకున్న ధాఖలాలు లేవు. కొన్ని మండలాల్లో బీఎల్‌ఓలు ఆదివారం ప్రత్యేక ఓటరు నమోదు దినం అన్న విషయాన్ని తమకు ఎవ్వరు చెప్పలేదంటున్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం పక్కనే ఇందిరాగాంధీ స్మారక ఉన్నత పాఠశాలలో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమానికి బీఎల్‌ఓలు హాజరైన వారికి కూర్చోడానికి కుర్చీలు కూడ లేవు. బండలపైనే బీఎల్‌ఓలు కూర్చొని పారం–6 ధరణాస్తులు స్వీకరించారు. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఏర్పడింది. జనవరి1 నాటికి 18 ఏళ్లు నిండే వారందరూ.. ఓటర్లుగా నమోదు కావాలని ఎన్నికల కమిషన్ పిలుపునిస్తున్నా అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇది సాధ్యం కావడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Advertisement