సార్వత్రికానికి’ రెడీ
పార్లమెంట్, అసెంబ్లీ సాధారణ ఎన్నికల్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి ఎం.గిరిజాశంకర్ విజ్ఞప్తి చేశారు. మంగళవారం స్థానిక రెవెన్యూ సమావేశపు మందిరంలో సాధారణ ఎన్నికలపై అఖిల పక్ష నేతలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సాధారణ ఎన్నికల్ని సమర్థంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లనూ సిద్దం చేసుకొని ఎన్నికలకు రెడీగా ఉన్నట్లు వెల్లండించారు.
ఇక రాజకీయ పార్టీలు కానీ అభ్యర్థులు ర్యాలీలు, సమావేశాలు నిర్వహించుకోవాలంటే ముందస్తు అనుమతు తప్పనిసరన్నారు. లేకుంటే ఎన్నికల నిబంధనల ప్రకారం చర్యలు తప్పవన్నారు. నామినేషన్ వేసే అభ్యర్థి వెంట మూడు వాహనాలకే అనుమతిస్తామనీ, కాన్వాయ్ పది వాహనాలకు మించరాదన్నారు. నామినేషన్ కేంద్రానికి వంద మీటర్ల దూరంలోనే ర్యాలీలు నిలిపి లోపలికి అభ్యర్థి వెంట ఐదుగురిని మాత్రమే అనుమతిస్తామన్నారు.
నేడు నోటిఫికేషన్..
పార్లమెంట్, సాధారణ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 2న నోటిఫికేషన్‌ను విడుదలవుతుందనీ, అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ చేపడతామన్నారు. ఇది ఈనెల 9వరకు ఉంటుందన్నారు. అయితే మధ్యలో 5, 6, 8 తేదీల్లో ప్రభుత్వ సెలవు దినాలైనా, నామినేషన్లను స్వీకరించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇక 10న నామినేషన్ల పరిశీలన, 11, 12 ఉపసంహరణకు గడువుతోపాటు, అదే రోజు బరిలో ఉండే అభ్యర్థుల జాబితా, వారికి గుర్తుల కేటాయింపు ఉంటుందన్నారు. ఇక నామినేషన్ల విషయానికొస్తే మహబూబ్‌నగర్ పార్లమెంట్ అభ్యర్థులు తన గదిలో, నాగర్‌కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థులు జేసీ గదిలో దాఖలు చేయాలన్నారు. అసెంబ్లీ విషయానికొస్తే నియోజకవర్గ తహశీల్దార్ కార్యాలయాలు, డివిజన్ అయితే ఆర్డీఓ కార్యాలయాల్లో దాఖలు చేయాలన్నారు.
నామినేషన్లు దాఖలు చేసే అభ్యర్థులు అఫిడవిట్లను క్షుణ్ణంగా పరిశీలించాలని, ఏమైనా ఖాళీలను భర్తీ చేయకుంటే వాటిని పరిశీలనలో తిరస్కరిస్తామన్నారు. జిల్లాతోపాటు, దేశం, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఆస్తులున్నా వాటిని పేర్కొనాలన్నారు. నామినేషను పత్రాలను అన్ని రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో అందుబాటులో ఉంచామని, వాటిని పూర్తి చేసేందుకు ఏమైనా సందేహాలుంటే హెల్ప్‌లైన్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. అభ్యర్థులంతా ఒక్కరోజు ముందుగా వచ్చి వాటిని తీసుకెళ్లి అన్ని కాలమ్స్‌ని భర్తీ చేసుకొని రావాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు.
ఇబ్బందులు సృష్టిస్తే.. కఠిన చర్యలు : జిల్లా ఎస్పీ
పోటీచేసే అభ్యర్థులు ఒక దానికి అనుమతి తీసుకొని ఇంకోలా ప్రవర్తించి ఇబ్బంది వాతావరణాన్ని సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ర్యాలీలు, మైక్ అనుమతులకు నేరుగా డీఎస్పీ కార్యాలయానికి వెళ్లాల్సిన పని లేదని, సంబంధిత పోలీస్ స్టేషన్‌లో దరఖాస్తు చేసుకొని రశీదు తీసుకొంటే చాలన్నారు. అక్కడ్నుంచి ఆ ప్రాంత ఎస్సై ఫ్యాక్స్‌లో డీఎస్పీకి సమాచారం పంపితే ఒక్కరోజులో అనుమతుల్ని జారీ చేస్తామన్నారు. డీజే సౌండ్‌కు అనుమతి లేదని, వాటిని వినియోగించినట్లు ఫిర్యాదులొస్తే చర్యలు తప్పవన్నారు. ఈ సందర్భంగా సీపీఐ పట్టణ అధ్యక్షుడు నల్లవల్లి కురుమూర్తి మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీ గూర్చి నేరుగా ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, ఈసారి అలా కాకుండా, అప్రమత్తంగా ఉండేలా చూడాలని కోరారు.
బీజేపీ నేత నాగురావు నామాజీ మాట్లాడుతూ, ప్రతి సారీ అనుమతుల విషయంలో కొంత అలస్యమవుతోందని దాన్ని సరిదిద్దాలన్నారు. ఈ సమావేశంలో అన్ని డివిజన్ల డీఎస్పీలు, రిటర్నింగ్ అధికారులతోపాటు, కాంగ్రెస్ తరుపున సత్తూర్ రాములు గౌడ్, రంగారావు, బిజెపి తరుపున రతంగ్ పాండురెడ్డి, సిపిఐ తరుపున కిల్లెగోపాల్, టీఆర్‌ఎస్ తరుపున బెక్కెం జనార్ధన్, వైఎస్సార్ కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు రవిప్రకాష్, టీడీపీ తరపున జయశ్రీ తదితరులు పాల్గొన్నారు.