ఓటు నమోదు.. పట్టని యువత
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: ఓటర్లుగా నమోదు కావడానికి యువత ఆసక్తి చూపడం లేదు. యువతను వంద శాతం ఓటర్లుగా నమోదు చేయించేందుకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకున్నా ఫలితం లేదు. గత నెల 31న ప్రకటించిన ఓటర్ల తుది జాబితాను పరిశీలిస్తే యువత ఓటర్లుగా నమోదయ్యేందుకు ఉత్సాహం చూపడం లేదని స్పష్టమవుతోంది.
జిల్లాలో 18 ఏళ్ల పైబడిన వారు 27,11,140 మంది ఉన్నారు. ఇందులో 18, 19 ఏళ్ల మధ్య ఉండే యువత 1,55,010 మంది ఉన్నారు. వీరందరిని ఓటర్లుగా గుర్తించేందుకు నవంబర్ 18 నుంచి డిసెంబర్ 23 వరకు నిర్వహించిన ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో అధికార యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఓటర్లుగా నమోదు కానివారిలో అత్యధికంగా విద్యార్థులే ఉన్నట్లుగా గుర్తించిన అధికార యంత్రాంగం విద్యాసంస్థల ప్రిన్సిపాళ్లతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ఓటర్లుగా నమోదయ్యేలా ప్రోత్సహించాలని కోరింది. కానీ 18, 19 ఏళ్లు యువత 71,756 మంది మాత్రమే ఓటు హక్కు కోసం నమోదు చేసుకున్నారు. మొత్తంగా 18 ఏళ్ల పైబడిన వారు 27,11,140 మంది ఉంటే ఓటర్లు మాత్రం 29,64,172 మంది ఉన్నారు. అంటే జనాభా కంటే ఓటర్లు 2,53,032 మంది ఎక్కువగా ఉన్నారు. వీరందరినీ బోగస్ ఓటర్లుగా పరిగణిస్తారు. బోగస్ ఓటర్ల తొలగింపునకు ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసిన ఎన్నికల ముందు బోగస్ ఓటర్లను తొలగిస్తే కాంగ్రెస్ రాజకీయ పార్టీల నుంచి ఇబ్బందులు ఉంటాయనే ఉద్దేశంతో అధికారులు బోగస్ ఓటర్ల జోలికి వెళ్లలేదనే ఆరోపణలున్నాయి.
బోగస్ ఓటర్లకు నిదర్శనాలు:
గోనెగండ్ల మండలం లింగందిన్నెలోని దాదాపు 10 కుటుంబాలు దశాబ్దాల క్రితం కోడుమూరుకు వలస వెళ్లి అక్కడే స్థిరపడ్డాయి. ఈ కుటుంబాలకు సంబంధించి లింగందిన్నె గ్రామంలో ఇప్పటికి 45 ఓట్లు ఉండటం విశేషం. గ్రామస్తులు ఫారం-7 ద్వారా పలుసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తీసివేయడం లేదు. కర్నూలు మండలం దిన్నెదేవరపాడు గ్రామానికి చెందిన 200 మంది కర్నూలులోని మద్దూర్‌నగర్, లక్ష్మీనగర్‌లోని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లుగా ఉన్నారు.
వీటిపైన ఫారం-7 దరఖాస్తులు ఇచ్చినా అధికారులు ఎన్నికల సమయంలో వీటిని తొలగిస్తే అధికార పార్టీ ప్రజాప్రతినిధి ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని తొలగించ లేదు. ప్యాపిలి మండలం అలేబాదు గ్రామానికి చెందిన దాదాపు 15 కుటుంబాలు వివిధ ప్రాంతాలకు కొన్నేళ్ల క్రితమే వలస వెళ్లాయి. ఈ కుటుంబాలకు చెందిన 65 మంది ఇప్పటి గ్రామంలో ఓటర్లుగా ఉన్నారు. వీటిని తొలగించేందుకు పలుసార్లు ఫారం-7 ద్వారా ఫిర్యాదులు చేసినా అధికార యంత్రాంగం స్పందించలేదు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా బోగస్ ఓటర్లపై అధికారులు దృష్టి పెట్టలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
జనాభాతో పోలిస్తే ఓటర్ల వివరాలు ఇలా ఉన్నాయి
వయస్సు గ్రూపు ఓటర్లు జనాభా
18-19 71,756 15,570
20-29 9,23,996 7,97,301
30-39 7,78,433 6,33,913
40-49 5,49,112 4,66,014
50-59 3,47,071 2,95,414
60-69 1,96,078 2,55,332
70-79 79,468 85,323
80 ప్లస్ 18,438 52,833
మొత్తం 29,64,352 26,01700