జిల్లా ఓటర్లు 25,41,607
నాలుగు మాసాల్లో 52వేలు పెరుగుదల
అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గం నకిరేకల్
అత్యల్ప ఓటర్లు ఉన్నది భువనగిరి
సార్వత్రిక ఎన్నికలకు ఓటరు జాబితా సిద్ధమైంది. ఏప్రిల్ 9వ తేదీ వరకు నమోదు చేసుకున్న వారికి కూడా ఓటుహక్కు కల్పించారు. జనవరి నుంచి ఏప్రిల్ మధ్యలో 52వేల మంది కొత్తగా ఓటరుగా నమోదయ్యారు.
నల్లగొండ, న్యూస్‌లైన్,సార్వత్రిక ఎన్నికలకు ఓటర్ల జాబితా సిద్ధమైంది. ఈ నెల 30 తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కొత్త ఓటర్ల జాబితాను జిల్లా యంత్రాంగం రూపొందించింది. ఈ ఎన్నికల్లో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. దీంతో ఈ నెల 9 తేదీ వరకు ఓటరుగా నమోదు చేసుకున్న వారందరికీ సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసే అవ కాశం కల్పించారు.
జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ 9 తేదీ వరకు కొత్తగా 52,379 మంది ఓటర్లు నమోదయ్యారు. జనవరి 1వ తేదీ నాటికి జిల్లాలో 24,89,228 మంది ఓటర్లు ఉన్నారు. కాగా ప్రస్తుతం కొత్తగా నమోదైన ఓటర్లతో కలుపుకుని మొత్తం వారి సంఖ్య 25,41 ,607కు పెరిగింది. వీరిలో పురుషులు 12,75,268, మహిళలు 12,66,253, ఇతరులు 86 మంది ఉన్నారు.
ఈ మొత్తం ఓటర్లలో అత్యధికంగా నకిరేకల్ నియోజకవర్గంలో 2,25,427 మంది ఉండగా, ఆ తర్వాతి స్థానంలో తుంగతుర్తి నియోజకవర్గంలో 2,23,507 మంది ఉన్నారు. అత్యల్పంగా భువనగిరి నియోజకవర్గంలో 1,86,607 మంది ఓటర్లు ఉన్నారు.
అనూహ్య స్పందన
కొత్తగా ఐదు నియోజకవర్గాల్లో ఓటర్లు పెరి గారు. నల్లగొండలో 6,414 మంది ఓటర్లు, మిర్యాలగూడలో 6,156 ,సూర్యాపేటలో 5,376, నాగార్జునసాగర్‌లో 2,712 మంది ఓటర్లు కొత్తగా చేరారు. పెరిగిన ఓటర్లలో పురుషులతో పోలిస్తే మహిళలు ఐదు నియోజకవర్గాల్లో అత్యధికంగా ఉన్నారు. కోదాడలో 2,022, సూర్యాపేటలో 1146, హుజూర్‌నగర్‌లో 1291, నాగార్జునసాగర్‌లో 448, మిర్యాలగూడలో 25 మంది పెరిగారు.
పెరిగిన యువ ఓటర్లు
ఈ ఏడాది జనవరి 1వ తేదీ నాటికి ప్రకటించిన ఓట ర్ల జాబితా ప్రకారం జిల్లాలో యువ ఓటర్లు 51,441 మంది ఉన్నారు. కాగా తాజాగా నమోదైన ఓటర్ల జాబి తా ప్రకారం యువ ఓటర్ల సంఖ్య 64,308కి పెరిగింది. ఈ నాలుగు మాసాల్లో 18-19 ఏళ్ల వయస్సు కలిగిన యువతీ, యువకులు ఓటు నమోదు చేసుకునేందుకు ఉత్సాహంగా ముందుకు వచ్చారు.
దీంతో గతంతో పోలి స్తే 12,867 మంది యువకులు కొత్తగా ఓటరు జాబితాలో నమోదయ్యారు. దీంట్లో అత్యధికంగా యువకులు ఆలేరు నియోజకవర్గంలో, యువతులు నల్లగొండలో నమోదయ్యారు. ఇక అత్యల్పంగా యువతీయువకుల ఓటర్లు హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఉన్నారు.