సాక్షిప్రతినిధి, నల్లగొండ : అసెంబ్లీ సమరం ముగియగానే జిల్లా అధికార యంత్రాంగం మరోమారు ఎన్నికల నిర్వహణకు సిద్ధమవుతోంది. రాష్ట్ర హైకోర్టు తీర్పు మేరకు గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణను త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించడంతో, ఆ మేరకు అధికారులు కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు విడుదలైనా, ఎలాంటి సమస్య లేకుండా పంచాయతీ సమరాన్ని ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
దీనిలో భాగంగానే.. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు మొత్తం పదకొండు విభాగాలుగా విధులను విభజించారు. ఒక్కో విభాగానికి ఒకరినుంచి ఐదుగురు దాకా నోడల్ అధికారులను నియమించారు. మొత్తంగా ఎన్నికల విధులకు సంబంధించి 11 విభాగాలకు 32 మందిని నోడల్ అధికారులుగా నియమించి బాధ్యతలు అప్పజెప్పారు. ఇప్పటికే నోడల్ అధికారులు తమ విధుల్లో నిమగ్నమయ్యారు. ఇక, క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారులు, సిబ్బందికి శిక్షణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వీరిలో స్టేజ్ –1, 2 అధికారుల శిక్షణ కూడా పూర్తయినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.
ఏడుగురు నోడల్ అధికారులకు ‘మ్యాన్‌పవర్ మేనేజ్‌మెంటు’ బాధ్యతలు
పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా ముగించేందుకు ఏడుగురు నోడల్ అధికారులకు ‘మ్యాన్‌పవర్ మేనేజ్‌మెంటు’ బాధ్యతలు అప్పజెప్పారు. ఎన్నికల నిర్వహణకు ఎంత మంది సిబ్బంది అవసరమవుతారో గుర్తిం చడం, వారిని నియమించుకోవడం, స్టేజ్–1 ఆర్వోలు, స్టేజ్–2 ఆర్వోలు, అసిస్టెం ట్ ఆర్వోలు, ప్రిసైడింగ్ అధికారుల నియామకం, జోనల్ అధికారులు, రూట్ అధి కారుల నియామకం తదితర బాధ్యతలను మ్యాన్‌పవర్ మేనేజ్‌మెంట్ నోడల్ అధి కారులు నిర్వహించనున్నారు.
పంచాయతీ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్‌ను వినియోగిస్తారు. బ్యాలెట్ బాక్స్ మేనేజ్‌మెంట్ కోసం కూడా మరో నోడల్ అధికారిని నియమించారు. బ్యాలట్ బాక్స్ రిప్లేస్, ఇతరత్రా సరిచూసుకోవడం వంటి విధులను ఈ అధికారికి కేటాయించారు. ఇవి కాకుండా, ట్రాన్స్‌పోర్ట్ మేనేజ్‌మెంట్‌కు ముగ్గురు, శిక్షణ కోసం ఐదుగురు, ఎన్నికల సామగ్రి నిర్వహణకు ఇద్దరిని, ఎన్నికల సంఘం నియమించే జనరల్ అబ్జర్వర్లు, ఖర్చుల పరిశీలకుల కోసం ముగ్గురు, బ్యాలెట్ పేపర్ల ముద్రణ, వాటిని మండలాలకు చేరవేయడం వంటి విధుల కోసం ఇద్దరు, మీడియా కమ్యునికేషన్ కోసం ఒకరిని, కంట్రోల్ రూమ్ (హెల్ప్ లైన్, ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం) కోసం ఇద్దరు, ఓటర్ల జాబితా ముద్రణ వంటి విధుల నిర్వహణకు మరో ముగ్గురు నోడల్ అధికారులను, మొత్తంగా 32 మంది జిల్లా అధికారులకు నోడల్ అధికారుల బాధ్యతలను అప్పజెప్పారు.
ఉపాధ్యాయులకే బాధ్యతలు
క్షేత్ర స్థాయిలో పనిచేసే ఎన్నికల సిబ్బందిలో ఉపాధ్యాయులే అధికంగా ఉండనున్నారు. గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లను ప్రిసైడింగ్ అధికారులుగా తీసుకుంటున్నారు. ప్రతి 200 ఓట్లున్న పంచాయతీకి ఒక పీఓ, ఇతర సిబ్బంది ఇద్దరు చొప్పున ముగ్గురికి, 500 ఓట్లున్న పంచాయతీలో నలుగురు చొప్పున ఎన్నికల సిబ్బందిని నియమిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 844 పంచాయతీలకు గాను ఈ సారి 837 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి.
ఉదయం ఏడు గంటలకు మొదలయ్యే పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంట వరకు ముగుస్తుందని, ఆ తర్వాత ఓట్లను లెక్కించి విజేతలను అదే రోజు ప్రకటిస్తారని అధికార వర్గాలు చెబుతున్నాయి. కాగా, ఉప సర్పంచ్ ఎన్నిక పోలింగ్ రోజు కానీ, లేదంటే మరునాడు ఎన్నుకునే అవకాశం ఉందని అంటున్నారు. జనవరి 13వ తేదీలోగా ఎన్నికలు నిర్వహించాన్న ఆదేశాల మేరకు ప్రభుత్వ నిర్ణయాలు వేగంగా తీసుకుంటోంది. దానికి తగినట్లే జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది.
Comments
Please login to add a commentAdd a comment