నేటినుంచి ‘పట్టభద్రుల’ ఓటరు జాబితా సవరణ
ఇదీ..షెడ్యూల్
ఫొటో గుర్తింపు కార్డుసంఖ్య సేకరణ : ఈ నెల 1 - 10 వరకు
కంప్యూటరీకరణ : 11 -15 వరకు
అనుబంధ జాబితాల అనుసంధానం : 16 - 20 వరకు
ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ : 23
ఫిర్యాదులు, అభ్యంతరాల స్వీకరణ : 25 - డిసెంబర్ 16 వరకు
అభ్యంతరాలపై విచారణకు తుది గడువు : జనవరి 5
అనుబంధ జాబితాల తయారీ, ముద్రణ : జనవరి 13
తుది ఓటర్ల జాబితా ప్రచురణ : జనవరి 15
నల్లగొండ : నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభంకానుంది. ఈ నియోజకవర్గం ఎన్నిక కాలపరిమితి వచ్చే ఏడాది జనవరితో ముగియనుంది. దీంతో తిరిగి అదే నెలలో పట్టభద్రుల ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఎన్నికకు రెండు మాసాల ముందుగానే ఓటరు జాబితా సవరణను ప్రారంభించాలని ఎన్నికల కమిషన్ శుక్రవారం షెడ్యూల్ జారీ చేసింది. దీనిలోభాగంగా పట్టభద్రుల నియోజకవర్గం ఓటరు జాబితా-2008ని మండలాల వారీగా వీఆర్వోకు అందజేస్తారు. ఈ జాబితాపై ప్రతి ఓటరు వివరాలు కాలం నంబర్ 2 నుంచి 7 వరకు తాజా వివరాలతో జతపర్చాలి. ఈ కార్యక్రమం శనివారం నుంచి 10వ తేదీ వరకు జరుగుతుంది. ఈ జాబితాలోని ఓటరు ఫొటోగుర్తింపు సంఖ్య, సెల్‌ఫోన్‌నంబర్ సేకరించి నమోదు చేయాలి. గత సాధారణ ఎన్నికల ఓటర్ల జాబితాతో ఈ వివరాలను సరిచూడాలి. ఒకవేళ శాసనసభ ఓటర్ల జాబితాలో ఓటరుగా నమోదు కాని పక్షంలో ఆ వివరాలు కూడా నమోదు చేయాలి. సదరు ఓటరు నుంచి కలర్ ఫొటో సేకరించి తాజా ఓటరు జాబితాతోపాటు తహసీల్దారు కార్యాలయంలో అందజేయాలి.
ఈ జాబితాలో ఓటరుగా నమోదు అయిన వ్యక్తి సదరు చిరునామాలో/గ్రామంలో నివాసం లేనట్లయితే ఆ వివరాలను ఇచ్చిన నియామావళి పత్రంలోని కాలం నంబర్ 2లో నమోదు చేయాలి. ఈ ప్రక్రియ అంతా కూడా ఈ నెల 10వ తేదీలోగా పూర్తిచేయాల్సి ఉంటుంది. ఈ విధంగా సేకరించిన వివరాలను 11 నుంచి 15వ తేదీ వరకు కంప్యూటరీకరిస్తారు. అనంతరం ముసాయిదా ఓటరు జాబితాలు తయారు చేసి 25వ తేదీన ఫొటో ఓటర్ల జాబితా నల్లగొండ-ఖమ్మం-వరంగల్ జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రచురిస్తారు. ఈ జాబితాపై 25 నుంచి డిసెంబర్ 16వ తేదీ వరకు ఫిర్యాదులు, అభ్యంతరాలు స్వీకరిస్తారు. వచ్చిన అభ్యంతరాలు, ఫిర్యాదులను జనవరి 5వ తేదీలోగా విచారిస్తారు. తుది ఓటర్లు జాబితాను జనవరి 15న అధికారికంగా ప్రకటిస్తారు.
రెండు మాసాల్లో ఎన్నిక...
2008 ఓటరు జాబితా ప్రకారం ఈ మూడు జిల్లాల్లో ఓటర్లు లక్షా 34 వేల మంది ఉన్నారు. వీటిలో వరంగల్ జిల్లాలో 45వేలు, ఖమ్మంలో 42 వేలు, నల్లగొండ జిల్లాలో 47వేల మంది ఉన్నారు. ఈ నియోజకవర్గానికి 2009 జనవరి13 ఎన్నికల నోటిఫికేషన్ జారీచేశారు. ఫిబ్రవరి 6 తేదీన ఎన్నికలు జరగ్గా... 9 తేదీన ఓట్ల లెక్కింపు పూర్తియ్యింది. నాటి ఎన్నికల్లో నలుగురు అభ్యర్థులు పోటీ చేశారు. వీరిలో కపిలవాయి దిలీప్‌కుమార్(టీఆర్‌ఎస్), ఎ. అశోక్‌రెడ్డి (బీజేపీ), ఎం.శ్రీనివాస్‌రెడ్డి (నేషనలిస్ట్ తెలంగాణ రాష్ట్ర సమితి), దునుకు వేలాద్రి (స్వతంత్ర అభ్యర్థి) పోటీ చేశారు. టీఆర్‌ఎస్ తరఫున పోటీచేసిన దిలీప్‌కుమార్ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆయన పదవీ కాలం జనవరితో పూర్తికానుంది.