Warangal districts
-
గొర్రెలు యాడబోయె..!
సాక్షి, వరంగల్: గొర్రెల పంపిణీ పథకం రెండో విడతకు మోక్షం కలిగేలా లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని పక్కదారి పట్టించిన వారిపై విచారణ ముమ్మరమైంది. ఈ అక్రమాలపై ఓ వైపు కోర్టు కేసు.. మరోవైపు శాఖాపరమైన ఎంక్వైరీలు జరుగుతున్నాయి. గొర్రెల పంపిణీ పథకం రెండో విడతకు ఇప్పట్లో మోక్షం కలిగే పరిస్థితి కనిపించడం లేదు. తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని పక్కదారి పట్టించిన వారి అవినీతి అక్రమాలపై విచారణ ముమ్మరమైంది. కొందరు అధి కారుల నిర్లక్ష్యం, కక్కుర్తి, దళారుల ప్రలోభాల కారణంగా క్షేత్రస్థాయిలో ఈ పథకం అబాసుపాలైన విషయం తెలిసిందే. ఇదే పథకంలో అక్రమాలపై ఓ వైపు కోర్టులో ‘పిల్’పై విచారణ.. మరోవైపు శాఖాపరమైన ఎంక్వైరీలు జరుగుతుండటంతో రెండో విడత పంపిణీపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఉమ్మడి జిల్లాలో రెండో విడతలో 47,750 యూనిట్లు పంపిణీ లక్ష్యం కాగా 3,787 యూనిట్లు పంపిణీ చేసిన తర్వాత బ్రేక్ వేశారు. లబ్ధిదారులు డీడీ(డిమాండ్ డ్రాఫ్ట్) కట్టి ఆరు నెలలు గడుస్తున్నా పంపిణీ చేయకపోవడంపై ఆందోళన చెందుతున్నారు. మొదటి విడతలో అక్రమాలు ఇలా.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 575 సహకార సంఘాలున్నాయి. వీటిలో సుమారు 60 వేల మంది సభ్యులుగా ఉన్నారు. అయితే మొదటి విడతలో ప్రభుత్వం యాదవులను మాత్రమే పెంపకందారులుగా గుర్తించింది. విడతల వారీగా అర్హులందరికీ ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరేలా ప్రభుత్వం లక్ష్యాలను నిర్దేశించింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు మొదటి విడత(ఎ–లిస్టు)లో 50,678 యూనిట్లు మంజూరు చేసింది. ప్రతి యూనిట్‌కు 20 గొర్రెలు, ఒక పొట్టేలు చొప్పున జిల్లాల వారీగా కోటా నిర్ణయించి పంపిణీ చేశారు. జిల్లా అధికార యంత్రాంగం ఇద్దరు ఏడీలు, ఒక డాక్టర్, ఇద్దరు పారా సిబ్బంది ఒక కమిటీగా మొత్తం ఉమ్మడి జిల్లాలో సుమారు 12 కమిటీల ద్వారా కొనుగోళ్లు, పంపిణీ జరిగింది. మహారాష్ట్రతో పాటు కడప జిల్లాలోని ఆరు మండలాల్లో గొర్రెల కొనుగోలు ప్రక్రియ చేపట్టారు. వాటికి ఇన్సూరెన్స్ ట్యాగ్లు పూర్తయిన అనంతరం అక్కడి నుంచి వాహనాల ద్వారా జిల్లాకు పంపాల్సి వుండగా.. ఇక్కడే అనేక అక్రమాలు జరిగినట్లు ఒక్కటొక్కటిగా బయటకు వచ్చాయి. వరంగల్ పాత జిల్లా పరిధిలో 50,678 యూనిట్లకుగాను అధికారులు 49,276 యూనిట్లు(97 శాతం) గ్రౌండింగ్ చేయగా.. చాలా చోట్ల రీ–సైక్లింగ్ జరిగినట్లు ఇప్పటికీ వెలుగు చూస్తున్నాయి. ఇదే క్రమంలో జయశంకర్ భూపాలపల్లికి చెందిన డీవీఅండ్ఏహెచ్ఓ డాక్టర్ ఎం.బాలకిషన్, జనగామ జిల్లా బచ్చన్నపేట వీఏఎస్ డాక్టర్ కె.హరికిషన్లపై చర్యలకు ఈ బృందం ఫెడరేషన్ ఎండీకి సిఫారసు చేసింది. కొనుగోలు పథకంలో జరిగిన అక్రమాల జాబితాపై విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ రంగంలోకి దిగడం కలకలం రేపుతోంది. రెండో విడత ఇప్పట్లో లేనట్టేనా..? రెండో విడతలో 47,750 యూనిట్లకు ప్రణాళిక సిద్ధం చేశారు. దాని ప్రకారం వరంగల్ అర్బన్ జిల్లాలో 5,571 యూనిట్లు, వరంగల్ రూరల్‌లో 12,748, మహబూబాబాద్‌లో 11,868, భూపాలపల్లి/ములుగు జిల్లాల్లో 6,791, జనగామలో 10,772 యూనిట్లు పంపిణీ చేయాల్సి ఉంది. ఒక్క వరంగల్ అర్బన్ జిల్లాలోనే సుమారు 4,200 మందికిపైగా డీడీలు చెల్లించగా 1,349 యూనిట్లు గ్రౌండింగ్ అయ్యాయి. అయితే ఇదే సమయంలో మొదటి విడతలో పలుచోట్ల లెక్కలేనన్ని అవినీతి అక్రమాలు జరగడం.. అవి ఇప్పుడిప్పుడు వెలుగు చూస్తుండటంతో మొత్తానికే పంపిణీ నిలిపి వేశారు. ఇదిలా ఉండగా గొర్రెల పంపిణీకి తాత్కాలికంగా బ్రేక్ పడినట్లేనన్ని భావించిన పశు సంవర్థకశాఖ అధికారులు వర్షాకాలం ప్రారంభం కావడంతో సుమారు నెలన్నర నుంచి పశువుల రోగనిరోధక చర్యల్లో భాగంగా నట్టల మందు, గాలికుంటు వ్యాధి, చిటుకు రోగాల నివారణ టీకాలు ఇచ్చే పనిలో ఉన్నారు. పెద్దరోగం(పీపీఆర్) లాంటి వ్యాధులు వచ్చే ప్రమాదముందన్న సంకేతాలతో ముందస్తుగా నివారణ చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమం మరో 25 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉండగా, రెండో విడత గొర్రెల పంపిణీ ఇప్పట్లో మొదలు కాకపోవచ్చనే అధికారులు చెప్తున్నారు. -
ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో వర్షాలు
హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షలు కురుస్తున్నాయి. గత రెండు రోజలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. మరోవైపు రాంపూర్, రామకృష్ణాపూర్, డోర్లి-1, డోర్లి-2, కైరిగూడ ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల్లోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక వరంగల్ జిల్లాలో భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. -
నేటినుంచి ‘పట్టభద్రుల’ ఓటరు జాబితా సవరణ
ఇదీ..షెడ్యూల్ ఫొటో గుర్తింపు కార్డుసంఖ్య సేకరణ : ఈ నెల 1 - 10 వరకు కంప్యూటరీకరణ : 11 -15 వరకు అనుబంధ జాబితాల అనుసంధానం : 16 - 20 వరకు ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ : 23 ఫిర్యాదులు, అభ్యంతరాల స్వీకరణ : 25 - డిసెంబర్ 16 వరకు అభ్యంతరాలపై విచారణకు తుది గడువు : జనవరి 5 అనుబంధ జాబితాల తయారీ, ముద్రణ : జనవరి 13 తుది ఓటర్ల జాబితా ప్రచురణ : జనవరి 15 నల్లగొండ : నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభంకానుంది. ఈ నియోజకవర్గం ఎన్నిక కాలపరిమితి వచ్చే ఏడాది జనవరితో ముగియనుంది. దీంతో తిరిగి అదే నెలలో పట్టభద్రుల ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఎన్నికకు రెండు మాసాల ముందుగానే ఓటరు జాబితా సవరణను ప్రారంభించాలని ఎన్నికల కమిషన్ శుక్రవారం షెడ్యూల్ జారీ చేసింది. దీనిలోభాగంగా పట్టభద్రుల నియోజకవర్గం ఓటరు జాబితా-2008ని మండలాల వారీగా వీఆర్వోకు అందజేస్తారు. ఈ జాబితాపై ప్రతి ఓటరు వివరాలు కాలం నంబర్ 2 నుంచి 7 వరకు తాజా వివరాలతో జతపర్చాలి. ఈ కార్యక్రమం శనివారం నుంచి 10వ తేదీ వరకు జరుగుతుంది. ఈ జాబితాలోని ఓటరు ఫొటోగుర్తింపు సంఖ్య, సెల్ఫోన్నంబర్ సేకరించి నమోదు చేయాలి. గత సాధారణ ఎన్నికల ఓటర్ల జాబితాతో ఈ వివరాలను సరిచూడాలి. ఒకవేళ శాసనసభ ఓటర్ల జాబితాలో ఓటరుగా నమోదు కాని పక్షంలో ఆ వివరాలు కూడా నమోదు చేయాలి. సదరు ఓటరు నుంచి కలర్ ఫొటో సేకరించి తాజా ఓటరు జాబితాతోపాటు తహసీల్దారు కార్యాలయంలో అందజేయాలి. ఈ జాబితాలో ఓటరుగా నమోదు అయిన వ్యక్తి సదరు చిరునామాలో/గ్రామంలో నివాసం లేనట్లయితే ఆ వివరాలను ఇచ్చిన నియామావళి పత్రంలోని కాలం నంబర్ 2లో నమోదు చేయాలి. ఈ ప్రక్రియ అంతా కూడా ఈ నెల 10వ తేదీలోగా పూర్తిచేయాల్సి ఉంటుంది. ఈ విధంగా సేకరించిన వివరాలను 11 నుంచి 15వ తేదీ వరకు కంప్యూటరీకరిస్తారు. అనంతరం ముసాయిదా ఓటరు జాబితాలు తయారు చేసి 25వ తేదీన ఫొటో ఓటర్ల జాబితా నల్లగొండ-ఖమ్మం-వరంగల్ జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రచురిస్తారు. ఈ జాబితాపై 25 నుంచి డిసెంబర్ 16వ తేదీ వరకు ఫిర్యాదులు, అభ్యంతరాలు స్వీకరిస్తారు. వచ్చిన అభ్యంతరాలు, ఫిర్యాదులను జనవరి 5వ తేదీలోగా విచారిస్తారు. తుది ఓటర్లు జాబితాను జనవరి 15న అధికారికంగా ప్రకటిస్తారు. రెండు మాసాల్లో ఎన్నిక... 2008 ఓటరు జాబితా ప్రకారం ఈ మూడు జిల్లాల్లో ఓటర్లు లక్షా 34 వేల మంది ఉన్నారు. వీటిలో వరంగల్ జిల్లాలో 45వేలు, ఖమ్మంలో 42 వేలు, నల్లగొండ జిల్లాలో 47వేల మంది ఉన్నారు. ఈ నియోజకవర్గానికి 2009 జనవరి13 ఎన్నికల నోటిఫికేషన్ జారీచేశారు. ఫిబ్రవరి 6 తేదీన ఎన్నికలు జరగ్గా... 9 తేదీన ఓట్ల లెక్కింపు పూర్తియ్యింది. నాటి ఎన్నికల్లో నలుగురు అభ్యర్థులు పోటీ చేశారు. వీరిలో కపిలవాయి దిలీప్‌కుమార్(టీఆర్ఎస్), ఎ. అశోక్‌రెడ్డి (బీజేపీ), ఎం.శ్రీనివాస్‌రెడ్డి (నేషనలిస్ట్ తెలంగాణ రాష్ట్ర సమితి), దునుకు వేలాద్రి (స్వతంత్ర అభ్యర్థి) పోటీ చేశారు. టీఆర్ఎస్ తరఫున పోటీచేసిన దిలీప్‌కుమార్ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆయన పదవీ కాలం జనవరితో పూర్తికానుంది.