సాక్షి, అమరావతి: ఓటర్ల జాబితాలో మీ ఓటు ఉందా? ఒకసారి పరిశీలించుకోండి. ఓటు లేకపోతే తక్షణం నమోదు చేయించుకోండి. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల కోసం ఎన్నికల సంఘం తుది ఓటర్ల జాబితా రూపకల్పనకు శుక్రవారం శ్రీకారం చుడుతోంది. ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణలో భాగంగా శుక్రవారం నుంచి వచ్చే నెల 21 వరకు అధికారులు ఇంటింటికీ తిరిగి ఓటర్ల జాబితాను పరిశీలిస్తారు.
జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్‌వోలు) నెల రోజుల పాటు ఈ కార్యక్రమం చేపడతారు. ఓటర్ల జాబితాను పరిశీలించి సవరణలు చేస్తారు. రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ బూత్ లెవల్ ఏజెంట్లను నియమించుకొని బీఎల్‌వోలతో కలిసి ఓటర్ల పరిశీలనలో పాల్గొంటాయి. ఇంటింటి సర్వే పూర్తయిన తర్వాత ఆగస్టు 22 నుంచి రాజకీయ పార్టీల సూచనల మేరకు పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ చేస్తారు.
ఈ ప్రక్రియను సెప్టెంబర్ 30కి పూర్తి చేసి అక్టోబరు 17న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురిస్తారు. నవంబర్ 30 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. శనివారం, ఆదివారం అయిన అక్టోబర్ 28, 29, నవంబర్ 18, 19 తేదీల్లో క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణకు బూత్ స్థాయిల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తారు. డిసెంబరు 26 కల్లా క్లెయిమ్‌లు, అభ్యంతరాలను పరిష్కరించి జనవరి 5న తుది ఓటర్ల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటిస్తుంది.
కొత్త ఓటర్ల నమోదుపై దృష్టి
రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన ఓటర్ల సంఖ్య చాలా తక్కువగా ఉండటంతో వీటి నమోదుపై ఎన్నికల సంఘం ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. రాష్ట్ర జనాభా ప్రకారం 18 నుంచి 19 ఏళ్లు ఉన్న ఓటర్లు కనీసం 12 లక్షలు ఉండాలి. కానీ 3.50 లక్షల ఓటర్లు మాత్రమే నమోదయ్యారు. 2024 జనవరి1 నాటికి 18 ఏళ్లు నిండే వారు కూడా ఓటరుగా నమోదు చేసుకోవడానికి అవకాశం ఉండటంతో వీరి నమోదుపైనా దృష్టి సారిస్తున్నారు.
వీరు ఫారం 6ను వినియోగించి కొత్త ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. చనిపోయిన వారు, వేరే రాష్ట్రాలకు వెళ్లిపోయిన వారిని ఓటర్ల జాబితా నుంచి తొలగించడానికి ఫారం 7ను వినియోగించుకోవాలి. చిరునామా, నియోజకవర్గం మార్చుకోవడానికి ఫారం 8 ఇవ్వాలి. ప్రవాసాంధ్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలంటే ఫారం 6 ఏను ఇవ్వాలి.
పరిశీలనకు తీసుకొనే అంశాలు
♦ ఓటరు జాబితాలో ఒకే వ్యక్తి రెండు మూడు చోట్ల ఓటు కలిగి ఉంటే వారి అభీష్టం మేరకు ఒక చోట ఉంచి మిగిలిన ఓట్లను తొలగిస్తారు.
♦ నకిలీ ఓట్ల గుర్తింపు, చనిపోయిన వారి ఓట్ల తొలగింపు, వందేళ్లు వయస్సు పైబడిన వారిని గుర్తిస్తారు.
♦ డోర్ నంబర్లు లేకుండా ఉన్నా, ఒకే డోర్ నంబరుపై పదుల సంఖ్యలో ఉన్న ఓట్లను పరిశీలిస్తారు.
♦ ఇంటి నంబరు లేనివి, ఒకే ఇంటి నంబరు, వీధి పేరుపై వందలాది ఓట్లు ఉంటే వాటిని క్షుణ్ణంగా పరిశీలించి, పరిష్కరిస్తారు.
♦ దీర్ఘ కాలంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి ఓట్లను వారి అభీష్టం మేరకు ఒక్క ప్రాంతంలోనే ఉంచుతారు
♦ ఒక బూత్‌లో సరాసరి 1,500 ఓట్లకు మించి ఉంటే కొత్త బూత్ సిఫారసు చేస్తారు.
దొంగ ఓట్ల దొంగ బాబే!
2019 ఎన్నికల్లో గెలవడానికి అప్పట్లో సీఎంగా ఉన్న చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. ఇవ్వని హామీలేదు. అయినా నమ్మకం కుదరక ఇష్టానుసారంగా దొంగ ఓట్లు నమోదు చేయించారు. ఒకే ఇంట్లో 40–50 మొదలు.. ఏకంగా 600–700 ఓట్ల వరకు గంపగుత్తగా ఓట్లు ఉన్నట్లు సృష్టించారు. అయినప్పటికీ ఆ ఎన్నికల్లో వైఎస్ జగన్ ప్రభంజనం ముందు తట్టుకోలేక తల వంచారు.
ఇప్పుడు మళ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో నాటి లీలలు ఒక్కటొక్కటిగా బయట పడుతుంటే ఉలిక్కిపడుతున్నారు. గంపగుత్తగా ఉన్న దొంగ ఓట్లను ప్రభుత్వం గుర్తించి తొలగిస్తుంటే బెంబేలెత్తిపోతున్నారు. విచారించగా ఆ దొంగ ఓట్లన్నీ నాటి బాబు పాలనలో రికార్డుల్లోకి ఎక్కినవేనని స్పష్టమవుతోంది. ఇలాగైతే ప్రజల్లో ఇంకా చులకనవుతానని భావించి ఎల్లో మీడియాను రంగంలోకి దింపారు.
తను చేసిన తప్పును ప్రస్తుత ప్రభుత్వంపై, వైఎస్సార్‌సీపీపై వేసి.. తప్పించుకునేందుకు యత్నిస్తున్నారు. రోజుకో రీతిన తప్పుడు కథనాలు వండి వార్చుతూ ప్రజలను తప్పుదోవ పట్టించి, రాజకీయంగా లబ్ధి పొందాలని వ్యూహం పన్నారు. ఇది కూడా బెడిసి కొడుతోంది. బాబు తీరు చూస్తుంటే దొంగే.. దొంగ దొంగ అని అరిచినట్లుంది.
Comments
Please login to add a commentAdd a comment