
ముంబై: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమీపిస్తోంది. ఈ నేపథ్యంలో అధికార మహాయుతి కూటమి (బీజేపీ, అజిత్ పవార్(ఎన్సీపీ), షిండే(శివసేన), ప్రతిప్రక్షాల మహా వికాస్ అఘాడీ కూటమి (కాంగ్రెస్, ఠాక్రే (శివసేన), శరద్ పవార్ (ఎన్సీపీ) ప్రచారంతో దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలో తాజాగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయం రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం తుది ఓటర్ల జాబితాను విడుదల చేసింది.
ఇక.. తుది ఓటర్ల జాబితా ప్రకారం మహారాష్ట్రలో మొత్తం 9.7 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. అందులో 4 కోట్లమంది పురుష ఓటర్లు, 4.7కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నట్లు పేర్కొంది. ఎన్నికల తేదీలు ప్రకటించిన అక్టోబర్ 15, అసెంబ్లీ ఎన్నికలకు ముందు నమోదుకు చివరి తేదీ అక్టోబర్ 19 మధ్య సుమారు 6.55 లక్షల మంది కొత్త ఓటర్లుగా నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు అధికంగా ఉండటం గమనార్హం. కూటమి పార్టీల గెలుపులో మహిళా ఓటర్లు కీలకంగా మారనున్నారని ఎన్నికల విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇక.. మహారాష్ట్రలో నవంబర్ 20న ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. నవంబర్ 23న ఫలితాలు వెలువడనున్నాయి.