
మహారాష్ట్రలో హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్య
రాయ్‌గఢ్: జగజ్జేత(అలంగీర్)నని చెప్పుకున్న మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ జీవితమంతా మహారాష్ట్రలో మరాఠాలతో పోరాటంతోనే గడిపి, ఓటమిపాలై ఈ గడ్డపైనే సమాధి అయ్యాడని హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ ధైర్యసాహసాలను ఆయన ప్రశంసించారు. శివాజీ 345 వర్ధంతి సందర్భంగా ఆయన శనివారం రాయ్‌గఢ్ కోటలో ఆయనకు నివాళులరి్పంచారు. 100వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకునే నాటికి సూపర్ పవర్‌గా ఎదగాలన్న భారతదేశం లక్ష్యానికి శివాజీ మహారాజే స్ఫూర్తి అని అమిత్ షా పేర్కొన్నారు.
ఛత్రపతి శివాజీ మహారాజ్‌ను మహారాష్ట్రకు మాత్రమే పరిమితం చేయవద్దని ప్రజలకు ఆయన విజŠక్షప్తి చేశారు. శివాజీ దీక్ష, పట్టుదల, సాహసం దేశానికే ఆదర్శమని, సమాజంలోని అన్ని వర్గాలను వ్యూహాత్మకంగా ఆయన ఏకం చేశారని చెప్పారు. మారాఠా సామ్రాజ్యానికి రాజధానిగా ఉన్న రాయ్‌గఢ్ కోటలోని శివాజీ సమాధి భవిష్యత్తు తరాలకు స్ఫూర్తినిస్తుందని తెలిపారు. సంభాజీనగర్ జిల్లా ఖుల్టాబాద్‌లో ఉన్న 17వ శతాబ్దం నాటి మొఘల్ చక్రవర్తి సమాధిని మరో చోటుకు తరలించాలన్న డిమాండ్లు ఇటీవల ఎక్కువైన నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.