ఓటు హక్కుపై అవగాహన కల్పించాలి | should be awareness of the vote right | Sakshi
Sakshi News home page

ఓటు హక్కుపై అవగాహన కల్పించాలి

Published Thu, Mar 13 2014 11:53 PM | Last Updated on Sat, Sep 2 2017 4:40 AM

should be awareness of the vote right

 కలెక్టరేట్, న్యూస్‌లైన్:  త్వరలో నిర్వహించనున్న ఎన్నికల్లో యువ ఓటర్లతో పాటు ఓటు హక్కు వినియోగించుకోని ఓటర్లను సైతం ఓటింగ్‌లో పాల్గొనేలా చైతన్యం చేయడానికి జిల్లా వ్యాప్తంగా విస్తృత కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు జేసీ శరత్ పేర్కొన్నారు. ఓటర్లు పోలింగ్‌లో తప్పనిసరిగా పాల్గొనాలని కోరుతూ అవగాహన, భాగస్వామ్యం కార్యక్రమ నిర్వహణపై గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టరేట్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో జేసీ శరత్ మాట్లాడుతూ ఓటర్లు తమ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని గ్రామైక్య సంఘాలు, యువకులతో చైతన్య ర్యాలీలు నిర్వహించాలన్నారు.

గతంలో ఏ పోలింగ్ బూత్‌లు లేదా గ్రామాల్లో తక్కువ పోలింగ్ శాతం నమోదైందో గుర్తించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని రిటర్నింగ్ అధికారులకు సూచించారు. గ్రామైక్య సంఘాల సమావేశాల్లోనూ ఓటు హక్కు వినియోగించుకొనే అంశం చర్చనీయాంశంగా ఉండాలని తెలిపారు. ఓటు హక్కు వినియోగం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ఓటు హక్కు ప్రాధాన్యత, పాత్రపై కళాశాల స్థాయిలోను చైతన్య కార్యక్రమాలు చేపట్టాలని చెప్పారు. మండల, నియోజకవర్గం, డివిజన్ స్థాయిలో యువతతో ర్యాలీలు నిర్వహించాలన్నారు. సమావేశంలో డీఆర్వో దయానంద్, జెడ్పీ సీఈఓ ఆశీర్వాదం, డీఆర్‌డీఏ పీడీ  రాజేశ్వర్‌రెడ్డి, డీఐఓ శాంతికుమార్, తదితరులు పాల్గొన్నారు.

 సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహించాలి
 కలెక్టరేట్: ఎన్నికల నిర్వహణ ప్రతి అధికారికి గౌరవనీయమైన బాధ్యతగా గుర్తించి సమర్థవంతంగా నిర్వహించాలని జేసీ శరత్ సూచించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణపై గురువారం కలెక్టరేట్‌లో ఎంపీడీఓలు, రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 17న ప్రాదేశిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయాలన్నారు. ప్రతి మండల రిటర్నింగ్ అధికారి సమర్థవంతంగా విధులు నిర్వహించాలని, ఎన్నికలు సజావుగా జరిగేలా బాధ్యతలు నిర్వహించాలన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ రూపొందించిన నిబంధనలను తూచ తప్పకుండా పాటించాలన్నారు. ఈనెల 17 నుంచి 20 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని,  21న నామినేషన్ల స్కూృటినీ ఉంటుందన్నారు.

 నామినేషన్ల ఉపసంహరణ 24న మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఉంటుందన్నారు. ఎంపీటీసీగా నామినేషన్ వేసే ఎస్సీ,ఎస్టీ,బీసీలకు రూ.1250, ఇతరులకు రూ. 2500 డిపాజిట్ చేయాలన్నారు. జెడ్పీటీసీ అభ్యర్థులకు ఎస్సీ,ఎస్టీ, బీసీలకు రూ.2500, ఇతరులకు రూ.5వేలు డిపాజిట్ చేయాలని సూచించారు. నామినేషన్, స్కూృటినీ, రిటర్నింగ్ అధికారులు మాత్రమే చేయాలని స్పష్టం చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఉంటేనే నామినేషన్లు స్వీకరించాలన్నారు. స్కూృటినీ సమయంలో పాటించాల్సిన నిబంధనలు రిటర్నింగ్ అధికారులకు వివరించారు. ఎలాంటి నామినేషన్లను తిరస్కరించవచ్చో తెలిపారు. అర్హులైన అభ్యర్థుల  పేర్లను నోటీసు బోర్డులో అతికించాలన్నారు. పోటీ చేసే అభ్యర్థుల పేర్లను తెలుగు వర్ణమాల క్రమంలో తయారు చేసి గుర్తులు కేటాయించాలని సూచించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటించని, పార్టీలపై, పార్టీ అభ్యర్థులపై చర్యలు తీసుకోవాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. ఓటరు స్లిప్పులను పంపిణీ చేయాలని సూచించారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ ఆశీర్వాదం, సంగారెడ్డి డివిజన్ పంచాయతీ అధికారి మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement