inagaration
-
జ్ఞానాన్ని దగ్ధం చేయలేరు: ప్రధాని మోదీ
అగ్ని జ్వాలలు పుస్తకాలను కాల్చగలవు, జ్ఞానాన్ని మాత్రం కాదు’ అని నలంద విశ్వవిద్యాలయ నూతన క్యాంపస్ ప్రారంభోత్సవ సభలో ప్రధాని మోదీ పేర్కొన్నారు. బీహార్‌లోని నలంద విశ్వవిద్యాలయంలోని నూతన ప్రాంగణాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నలంద కేవలం భారతదేశ పునరుజ్జీవన భూమిక మాత్రమే కాదు. దీనికి ప్రపంచంతోపాటు ఆసియాలోని అనేక దేశాల వారసత్వంతో అనుబంధం ఉందని అన్నారు.నలంద విశ్వవిద్యాలయ పునర్నిర్మాణంలో మన భాగస్వామ్య దేశాలు కూడా పాలుపంచుకున్నాయని, ఆయా స్నేహపూర్వక దేశాలను అభినందిస్తున్నానని మోదీ పేర్కొన్నారు. నలందలోని ఈ కొత్త క్యాంపస్ భారతదేశ శక్తిసామర్థ్యాలను ప్రపంచానికి పరిచయం చేయనున్నదని మోదీ పేర్కొన్నారు. బలమైన మానవ విలువలపై నిలబడే దేశం మనదని, చరిత్రను పునరుద్ధరించడం ద్వారా మెరుగైన భవిష్యత్తుకు పునాది వేయడం ఎలాగో మనకు తెలుసన్నారు. నలంద అంటే ఒక గుర్తింపు, గౌరవం, ఒక విలువ, ఒక మంత్రం, ఒక అమోఘ కథ... నలంద అనంత సత్యానికి నిదర్శనం. పుస్తకాలు అగ్ని జ్వాలల్లో కాలిపోవచ్చు. కానీ అవే అగ్ని జ్వాలలు జ్ఞానాన్ని నాశనం చేయలేవని ప్రధాని మోదీ పేర్కొన్నారు.సభలో పాల్గొన్న బీహార్ సీఎం నితీష్ కుమార్ మాట్లాడుతూ ప్రధాని మోదీ ఆశీస్సులతో నలంద యూనివర్శిటీ క్యాంపస్ ప్రారంభం కావడం సంతోషించదగిన విషయమని అన్నారు. దేశంలోనే కాకుండా ప్రపంచంలోని అనేక ప్రాంతాల నుంచి విద్యార్థులు ఇక్కడికి వచ్చి చదువుకునేవారన్నారు. దురదృష్టవశాత్తు ఈ విశ్వవిద్యాలయం 1200 ఏడీలో ధ్వంసమైందన్నారు. 2005 నుంచి తాము బీహార్‌లో అభివృద్ధి పనులను ప్రారంభించామన్నారు. 2006లో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం బీహార్ వచ్చినప్పుడు తన నలంద యూనివర్శిటీని పునఃస్థాపన గురించి ప్రస్తావించారన్నారు. ఈ కార్యక్రమానికి ముందు ప్రధాని మోదీ క్యాంపస్‌ను పరిశీలించారు. #WATCH | Bihar: At the inauguration of the new campus of Nalanda University, Prime Minister Narendra Modi says, " I am happy that I got the opportunity to visit Nalanda within 10 days after swearing in as PM for the 3rd time...Nalanda is not just a name, it is an identity and… pic.twitter.com/jjZL7gWqDW— ANI (@ANI) June 19, 2024 -
అయోధ్య విమానాశ్రయం విశేషాలివే
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో నూతనంగా నిర్మించిన మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ ఎయిర్‌పోర్టు అనేక విశేషాలను కలిగివుంది. అయోధ్య నగర చరిత్ర, విశిష్టత, ఆధ్యాత్మిక వాతావరణం ప్రతిబింబించేలా ఈ విమానాశ్రయ రూపుదిద్దుకుంది. విమానాశ్రయం టెర్మినల్ భవనాన్ని శ్రీరామ మందిరాన్ని తలపించేలా తీర్చిదిద్దారు. ప్రధాన ద్వారంపై ఆలయ తోరణాల డిజైన్ రూపొందించారు. శ్రీరాముని జీవితాన్ని కళ్లకు కట్టే కళాఖండాలు, చిత్రాలు, కుడ్యచిత్రాలతో విమానాశ్రయం శోభాయమానంగా కనిపిస్తోంది. విమానాశ్రయం సమీపంలో బస్సు పార్కింగ్‌తోపాటు దివ్యాంగులకు అనుకూలమైన వసతి సౌకర్యాలు కల్పించారు. ఎల్ఈడీ లైటింగ్, వాననీటి నిర్వహణ, సౌర విద్యుత్ ప్లాంట్, మురుగు శుద్ధి ప్లాంట్ ఏర్పాటు చేశారు. ప్రాంగణం చుట్టూ పరుచుకున్న పచ్చదనం నిర్వహణకు వాడిన నీటిని రీ సైకిల్ చేసి ఉపయోగించనున్నారు. మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నిర్మాణం కేవలం 20 నెలల్లో పూర్తయిందని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ సంజీవ్ కుమార్ చెప్పారు. ఈ ఎయిర్‌పోర్టు గతంలో కేవలం 178 ఎకరాల్లో ఉండేది. దీనిని ఇప్పుడు రూ.350 కోట్ల వ్యయంతో అంతర్జాతీయ విమానాశ్రయంగా తీర్చిదిద్దారు. యూపీ ప్రభుత్వం 821 ఎకరాల భూమిని విమానాశ్రయం కోసం కేటాయించింది. ప్రతి ఏటా 10 వేల మంది ప్రయాణికుల రాకపోకలు సాగించేందుకు వీలుగా విమానాశ్రయాన్ని అత్యంత విశాలంగా నిర్మించారు. టెర్మినల్ భవనాన్ని 6,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించారు. 2.2 కిలోమీటర్ల పొడవైన రన్‌వేను ఏర్పాటు చేశారు. దీంతో ఎయిర్‌బస్–321 రకం విమానాల ల్యాండింగ్, టేకాఫ్ సులభతరం కానుంది. ఇక్కడ రెండు లింక్ ‘టాక్సీ వే’లు ఉండటంతో ఒకేసారి ఎనిమిది విమానాలను పార్క్ చేసుకునేందుకు అవకాశం ఉంది. త్వరలో విమానాశ్రయ రెండో దశ విస్తరణ పనులు మొదలుకానున్నాయి. టెర్మినల్‌ను 50 వేల చదరపు మీటర్లకు విస్తరించనున్నారు. ఏటా ఏకంగా 60 లక్షల మంది రాకపోకలకు వీలుగా విస్తరణ ప్రతిపాదనలు ఇప్పటికే సిద్ధంచేశారు. రన్‌వేను 3.7 కిలోమీటర్లకు విస్తరించి, అదనంగా 18 విమానాల పార్కింగ్‌కు చోటు కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇది కూడా చదవండి: భారత్‌లో ఐదు కొత్త సంవత్సరాలు... ఏడాది పొడవునా సంబరాలే! -
దేశంలో ఐటీ విప్లవాన్ని తీసుకొచ్చిన మహనీయుడు రాజీవ్‌గాంధీ
నారాయణ్‌పేట్: దేశంలో ఐటీ విప్లవాన్ని తీసుకొచ్చిన మహనీయుడు మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ అని డీసీసీ అద్యక్షులు వాకిటి శ్రీహరీ అన్నారు. గురువారం రాత్రి పెద్దకడ్మూర్‌లో నిర్వహించిన రాజీవ్‌గాంధీ విగ్రహావిష్కరణ, కాంగ్రెస్ పార్టీ జెండావిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐ ఫోరం రాష్ట్ర కమిటి సభ్యులు పోలీస్ చంద్రశేఖర్‌రెడ్డి ఆద్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరణతో పాటు కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం జరిగిన సభలో నాయకులు మాట్లాడుతూ.. దేశంలో, రాష్ట్రంలో కాంగ్రేస్ పార్టీ చేపట్టిన అనేక సంక్షేమ పథకాలు, ప్రాజెక్టులు, నేటికీ చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచాయన్నారు. ఆనాడు ఇందిరమ్మ, రాజీవ్‌గాంధీ అందించిన గొప్ప పథకాల కోసం రాష్ట్రంలో ఇటీవల సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలు రావాలంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్నారు. పీసీసీ అద్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు విదేశాలను వదిలి జన్మభూమికోసం వచ్చి ఈ కార్యక్రమాన్ని చేపట్టిన ఎన్ఆర్ఐ పోలీస్ చంద్రశేఖర్‌రెడ్డిని అభినందించారు. కార్యక్రమంలో నాయకులు ప్రశాంత్‌రెడ్డి, నాగరాజుగౌడ్, గౌని బాలకృష్ణారెడ్డి, గడ్డంపల్లి హన్మంతు, గోపాల్‌రెడ్డి, రవికుమార్‌యాదవ్, లక్ష్మారెడ్డి, బల్‌రాంగౌడ్, చెన్నయ్యసాగర్ పాల్గొన్నారు. -
కూత.. సంబరాల మోత.. దశాబ్దాల కల సాకారమైన వేళ..
సిద్దిపేట: సిద్దిపేట ప్రజల దశాబ్దాల కల కళ్ల ముందు ఆవిష్కృతమైంది. ఎన్నో ఏళ్లుగా రైలు సౌకర్యం కోసం ఎదురుచూసిన క్షణాలు నిజమయ్యాయి. సిద్దిపేట–సికింద్రాబాద్ మధ్య రైలు ప్రయాణికులతో పరుగులు పెట్టింది. మంగళవారం నిజామాబాద్ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా, సిద్దిపేట రైల్వేస్టేషన్ వద్ద రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు జెండా ఊపి రైలును ప్రారంభించారు. ఈ సందర్భంగా రైల్వేస్టేషన్, పరిసరాలను అందంగా ముస్తాబు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. రైలు వద్ద సెల్ఫీలు దిగుతూ మురిసిపోయారు. కొంత మంది సరదాగా రైలులోకి ఎక్కారు. బీఆర్ఎస్ కార్యకర్తలు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకుంటూ మంత్రికి స్వాగతం పలికారు. మంత్రి హరీశ్‌రావు దుద్దెడ స్టేషన్ వరకు రైలులో ప్రయాణించారు. తొలి ప్రయాణంలో 327 మంది ప్రయాణించినట్లు అధికారులు తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్‌రావు, ఫారుఖ్ హుస్సేన్, జెడ్పీ చైర్ పర్సన్ రోజాశర్మ, కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికలు ఎప్పుడొచ్చినా వైఎస్సార్ సీపీదే విజయం
రౌతులపూడి (ప్రత్తిపాడు) : ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్సార్ సీపీదే విజయమని కాకినాడ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు అన్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గ కో ఆర్డినేటర్ పర్వత పూర్ణచంద్రప్రసాద్ ఆధ్వర్యంలో రౌతులపూడి మండలంలోని ఎన్ఎన్ పట్నంలో పార్టీనాయులు, కార్యకర్తలు ఏర్పాటు చేసిన దివంగత మహానేత వైస్ రాజశేఖర్‌రెడ్డి, దళిత వర్గాల ఆశాజ్యోతి బాబూ జగ్జీవన్‌రామ్ విగ్రహాల ప్రారంభోత్సవానికి గురువారం ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నాలుగేళ్లపాటు ప్రజా సంక్షేమం పట్టని బాబుకు ఇప్పుడు ప్రత్యేక హోదా అంటూ ప్రజలను మభ్యపెట్టేందుకు దీక్షలు అంటున్నారని ఎద్దేవా చేశారు. కేంద్రంతో కుమ్మక్కై ప్యాకేజికోసం హోదాను అడ్డుకున్న బాబు హోదా కోసం మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో నియోజకవర్గాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేసేలా పర్వత పూర్ణచంద్రప్రసాద్‌ను ఎమ్మెల్యేగా గెలిపించి వైఎస్సార్సీపీకి పట్టం కట్టాలని ఆయన ప్రజలకు సూచించారు. గత సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి పట్టకట్టారని, అయితే దురదృష్టవశాత్తూ ఆ ఎమ్మెల్యే టీడీపీ గేలానికి చిక్కి వెళ్లిపోయారని గుర్తుచేశారు. అంతకు ముందు దివంగత మహానేత సతీమణి, జగన్మోహన్రెడ్డి మాతృమూర్తి వైఎస్ విజయమ్మ జన్మదినం సందర్భంగా స్థానిక నేత సింగంపల్లి చిట్టిబాబు స్వృగృహంలో జన్మదిన కేక్‌ను కట్‌చేసి పార్టీ కార్యకర్తలకు, నాయకులకు పంచారు. అనంతరం గ్రామంలో నూతనంగా ప్రారంభించిన నూకాలమ్మ అమ్మవారి ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రౌతులపూడి, శంఖవరం, ప్రత్తిపాడు, మండల కన్వీనర్లు జిగిరెడ్డి శ్రీను, కూనిశెట్టి మాణిఖ్యం, బెహరా దొరబాబు, ఎంపీటీసీ సభ్యురాలు సింగంపల్లి వెంకటలక్ష్మి, దళే చిట్టిబాబు, సీహెచ్ వీరవెంకట సత్యనారాయణ, గాబు కృష్ణ, అడపా సోమేష్, సకురు గుర్రాజు, యెనుముల కోటిబాబు, మానివెల్తి వెంకటరమణ, వడల సత్యనారాయణ, చిట్రా రెడ్డి, మాదాసు దొంగబాబు, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
అమాత్యా..ఇది తగునా?
అనుమతి లేని క్లబ్ భవనాన్ని ప్రారంభించిన మంత్రి ప్రత్తిపాటి చిలకలూరిపేటటౌన్: అనుమతులు లేకుండా నిర్మించిన క్లబ్ భవనాన్ని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సోమవారం ప్రారంభించారు. అదేమన్నా ప్రజలకు ఉపయోగపడేదా అంటే కానే కాదు. జేబుల్లో డబ్బు ఖాళీచేసే పేకాట క్లబ్ భవనం. మంత్రి అనుచరుడి సారధ్యంలో పేకాటరాయుళ్ల కోసం అధునాతన సౌకర్యాలతో రూ.కోట్లు వెచ్చించి ఎలాంటి అనుమతి లేకుండా నిర్మించిన భవంతి అది. గతంలో ఘనమైన చరిత్ర .... చిలకలూరిపేట పట్టణంలోని సీఆర్ క్లబ్ (చిలకలూరిపేట రిక్రియేషన్ క్లబ్) కు గతంలో ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. 1942లో ప్రారంభించబడిన ఈ క్లబ్లో డాక్టర్లు, లాయర్లు, సమాజంలో ఎంతో గౌరవప్రదమైన వారు మాత్రమే సభ్యులుగా ఉండేవారు. టెన్నిస్, షటిల్, చెస్ వంటి క్రీడలను పోత్సహిస్తూ రిక్రియేషన్ అనే పదానికి నిర్వచనంగా ఉండేది. కేవలం క్లబ్ సభ్యులకు మాత్రమే అనుమతించిన రమ్మీ (13 ముక్కల పేకాట) ఆడుకొనేవారు. మంత్రి అనుచరుడి పెత్తనంలో ... 2015 సంవత్సరంలో క్లబ్ నూతన కార్యవర్గానికి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో మంత్రి ముఖ్యఅనుచరుడు కార్యవర్గంలో కీలక పదవి చేపట్టాడు. అప్పటి నుంచి క్లబ్ స్వరూపమే మారిపోయింది. పేకాట నిలయంగా మారింది. సాధారణంగా క్లబ్లో సభ్యులు మాత్రమే రమ్మీ ఆడుకోవచ్చు. కానీ ప్రస్తుతం సొసైటీల చట్టం ద్వారా రిజిస్టర్ అయి ఉన్న ఈ క్లబ్లో బైలాకు విరుద్దంగా గెస్ట్ వ్యవస్థకు ద్వారాలు తెరిచారు. క్లబ్లో సభ్యుడు కాని వ్యక్తి నెలకు మూడు వేలు చెల్లించి గెస్ట్ సభ్వత్వం పొందే అవకాశం కల్పించారు. దీంతో ఈ క్లబ్‌కు గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి పేకాట రాయుళ్లు క్యూ కడుతున్నారు. రోజు లక్షల్లో ఇక్కడ పేకాట జరుగుతుందన్నది బహిరంగ రహస్యం. క్లబ్‌కు పేకాట ద్వారా భారీగా లబ్ధి చేకూరుతుంది. ఈ క్రమంలోనే క్లబ్ ఓపెన్ ఆడిటోరియం ప్రాంగణంలో సుమారు రూ. రెండుకోట్లు వెచ్చించి ఆధునిక వసతులతో భవనాన్ని నిర్మించి మంత్రితో ప్రారంభింపచేశారు. సొసైటీ యాక్టు ద్వారా నిర్వహిస్తున్న ఈ క్లబ్లో వచ్చే ఆదాయవ్యయాల వివరాలను అధికారికంగా చూపించాల్సి ఉంటుంది. అయితే ఎలాంటి వివరాలు లేకుండా, అనుమతులు పొందకుండా భవనం నిర్మించి ప్రారంభించారు. ఈ విషయమై ఆదాయపన్నుశాఖ అధికారులు దృష్టి సారిస్తే ఇక్కడ జరుగుతున్న తతంగం మొత్తం బయటకు వచ్చే అవకాశం ఉంది. అనుమతులు లేవు.. నామా కనకారావు, మున్సిపల్ కమిషనర్ క్లబ్ ప్రాంగణంలో నిర్మించిన భవనానికి ఎలాంటి అనుమతులు లేవు. ఆ భవంతిపై వందశాతం అదనంగా పన్ను విధిస్తాం. భవనం ఉన్నంతకాలం నిబంధనల ప్రకారం వందశాతం అదనపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. –––––––––––––––––––––––––––––––––––– 02సికెపిటి08–13020005: కొత్తగా సీఆర్క్లబ్లో ప్రారంభమైన భవనం 02సికెపిటి09–13020005: భవనం ప్రారంభిస్తున్న మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు