అమాత్యా..ఇది తగునా?
-
అనుమతి లేని క్లబ్ భవనాన్ని ప్రారంభించిన మంత్రి ప్రత్తిపాటి
చిలకలూరిపేటటౌన్: అనుమతులు లేకుండా నిర్మించిన క్లబ్ భవనాన్ని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సోమవారం ప్రారంభించారు. అదేమన్నా ప్రజలకు ఉపయోగపడేదా అంటే కానే కాదు. జేబుల్లో డబ్బు ఖాళీచేసే పేకాట క్లబ్ భవనం. మంత్రి అనుచరుడి సారధ్యంలో పేకాటరాయుళ్ల కోసం అధునాతన సౌకర్యాలతో రూ.కోట్లు వెచ్చించి ఎలాంటి అనుమతి లేకుండా నిర్మించిన భవంతి అది.
గతంలో ఘనమైన చరిత్ర ....
చిలకలూరిపేట పట్టణంలోని సీఆర్ క్లబ్ (చిలకలూరిపేట రిక్రియేషన్ క్లబ్) కు గతంలో ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. 1942లో ప్రారంభించబడిన ఈ క్లబ్‌లో డాక్టర్లు, లాయర్లు, సమాజంలో ఎంతో గౌరవప్రదమైన వారు మాత్రమే సభ్యులుగా ఉండేవారు. టెన్నిస్, షటిల్, చెస్ వంటి క్రీడలను పోత్సహిస్తూ రిక్రియేషన్ అనే పదానికి నిర్వచనంగా ఉండేది. కేవలం క్లబ్ సభ్యులకు మాత్రమే అనుమతించిన రమ్మీ (13 ముక్కల పేకాట) ఆడుకొనేవారు.
మంత్రి అనుచరుడి పెత్తనంలో ...
2015 సంవత్సరంలో క్లబ్ నూతన కార్యవర్గానికి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో మంత్రి ముఖ్యఅనుచరుడు కార్యవర్గంలో కీలక పదవి చేపట్టాడు. అప్పటి నుంచి క్లబ్ స్వరూపమే మారిపోయింది. పేకాట నిలయంగా మారింది. సాధారణంగా క్లబ్‌లో సభ్యులు మాత్రమే రమ్మీ ఆడుకోవచ్చు. కానీ ప్రస్తుతం సొసైటీల చట్టం ద్వారా రిజిస్టర్ అయి ఉన్న ఈ క్లబ్‌లో బైలాకు విరుద్దంగా గెస్ట్ వ్యవస్థకు ద్వారాలు తెరిచారు. క్లబ్‌లో సభ్యుడు కాని వ్యక్తి నెలకు మూడు వేలు చెల్లించి గెస్ట్ సభ్వత్వం పొందే అవకాశం కల్పించారు. దీంతో ఈ క్లబ్‌కు గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి పేకాట రాయుళ్లు క్యూ కడుతున్నారు. రోజు లక్షల్లో ఇక్కడ పేకాట జరుగుతుందన్నది బహిరంగ రహస్యం. క్లబ్‌కు పేకాట ద్వారా భారీగా లబ్ధి చేకూరుతుంది. ఈ క్రమంలోనే క్లబ్ ఓపెన్ ఆడిటోరియం ప్రాంగణంలో సుమారు రూ. రెండుకోట్లు వెచ్చించి ఆధునిక వసతులతో భవనాన్ని నిర్మించి మంత్రితో ప్రారంభింపచేశారు. సొసైటీ యాక్టు ద్వారా నిర్వహిస్తున్న ఈ క్లబ్‌లో వచ్చే ఆదాయవ్యయాల వివరాలను అధికారికంగా చూపించాల్సి ఉంటుంది. అయితే ఎలాంటి వివరాలు లేకుండా, అనుమతులు పొందకుండా భవనం నిర్మించి ప్రారంభించారు. ఈ విషయమై ఆదాయపన్నుశాఖ అధికారులు దృష్టి సారిస్తే ఇక్కడ జరుగుతున్న తతంగం మొత్తం బయటకు వచ్చే అవకాశం ఉంది.
అనుమతులు లేవు.. నామా కనకారావు, మున్సిపల్ కమిషనర్
క్లబ్ ప్రాంగణంలో నిర్మించిన భవనానికి ఎలాంటి అనుమతులు లేవు. ఆ భవంతిపై వందశాతం అదనంగా పన్ను విధిస్తాం. భవనం ఉన్నంతకాలం నిబంధనల ప్రకారం వందశాతం అదనపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
––––––––––––––––––––––––––––––––––––
02సికెపిటి08–13020005: కొత్తగా సీఆర్‌క్లబ్‌లో ప్రారంభమైన భవనం
02సికెపిటి09–13020005: భవనం ప్రారంభిస్తున్న మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు