జ్ఞానాన్ని దగ్ధం చేయలేరు: ప్రధాని మోదీ | Modi to inaugurate new campus of Nalanda | Sakshi
Sakshi News home page

జ్ఞానాన్ని దగ్ధం చేయలేరు: ప్రధాని మోదీ

Published Wed, Jun 19 2024 12:26 PM | Last Updated on Wed, Jun 19 2024 1:38 PM

modi to inaugurate new campus of nalanda

అగ్ని జ్వాలలు పుస్తకాలను కాల్చగలవు, జ్ఞానాన్ని మాత్రం కాదు’ అని నలంద విశ్వవిద్యాలయ నూతన క్యాంపస్‌ ప్రారంభోత్సవ సభలో ప్రధాని మోదీ  పేర్కొన్నారు. బీహార్‌లోని నలంద విశ్వవిద్యాలయంలోని నూతన ప్రాంగణాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నలంద కేవలం భారతదేశ పునరుజ్జీవన భూమిక మాత్రమే కాదు. దీనికి ప్రపంచంతోపాటు ఆసియాలోని అనేక దేశాల వారసత్వంతో అనుబంధం ఉందని అన్నారు.

నలంద విశ్వవిద్యాలయ పునర్నిర్మాణంలో మన భాగస్వామ్య దేశాలు కూడా పాలుపంచుకున్నాయని,  ఆయా స్నేహపూర్వక దేశాలను అభినందిస్తున్నానని మోదీ పేర్కొన్నారు. నలందలోని ఈ కొత్త క్యాంపస్ భారతదేశ శక్తిసామర్థ్యాలను ప్రపంచానికి పరిచయం చేయనున్నదని మోదీ పేర్కొన్నారు. బలమైన మానవ విలువలపై నిలబడే దేశం మనదని, చరిత్రను పునరుద్ధరించడం ద్వారా మెరుగైన భవిష్యత్తుకు పునాది వేయడం ఎలాగో మనకు తెలుసన్నారు. నలంద అంటే ఒక గుర్తింపు, గౌరవం, ఒక విలువ, ఒక మంత్రం, ఒక అమోఘ కథ... నలంద  అనంత సత్యానికి నిదర్శనం. పుస్తకాలు అగ్ని జ్వాలల్లో కాలిపోవచ్చు. కానీ అవే అగ్ని జ్వాలలు జ్ఞానాన్ని నాశనం చేయలేవని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

సభలో పాల్గొన్న బీహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ మాట్లాడుతూ ప్రధాని మోదీ ఆశీస్సులతో నలంద యూనివర్శిటీ క్యాంపస్ ప్రారంభం కావడం సంతోషించదగిన విషయమని అన్నారు. దేశంలోనే కాకుండా ప్రపంచంలోని అనేక ప్రాంతాల నుంచి విద్యార్థులు ఇక్కడికి వచ్చి చదువుకునేవారన్నారు. దురదృష్టవశాత్తు ఈ విశ్వవిద్యాలయం 1200 ఏడీలో ధ్వంసమైందన్నారు. 2005 నుంచి తాము బీహార్‌లో అభివృద్ధి పనులను ప్రారంభించామన్నారు. 2006లో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం బీహార్ వచ్చినప్పుడు తన నలంద యూనివర్శిటీని పునఃస్థాపన గురించి ప్రస్తావించారన్నారు. ఈ కార్యక్రమానికి ముందు ప్రధాని మోదీ క్యాంపస్‌ను పరిశీలించారు.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement