ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో నూతనంగా నిర్మించిన మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ ఎయిర్‌పోర్టు అనేక విశేషాలను కలిగివుంది. అయోధ్య నగర చరిత్ర, విశిష్టత, ఆధ్యాత్మిక వాతావరణం ప్రతిబింబించేలా ఈ విమానాశ్రయ రూపుదిద్దుకుంది.
విమానాశ్రయం టెర్మినల్ భవనాన్ని శ్రీరామ మందిరాన్ని తలపించేలా తీర్చిదిద్దారు. ప్రధాన ద్వారంపై ఆలయ తోరణాల డిజైన్ రూపొందించారు. శ్రీరాముని జీవితాన్ని కళ్లకు కట్టే కళాఖండాలు, చిత్రాలు, కుడ్యచిత్రాలతో విమానాశ్రయం శోభాయమానంగా కనిపిస్తోంది.
విమానాశ్రయం సమీపంలో బస్సు పార్కింగ్‌తోపాటు దివ్యాంగులకు అనుకూలమైన వసతి సౌకర్యాలు కల్పించారు. ఎల్‌ఈడీ లైటింగ్, వాననీటి నిర్వహణ, సౌర విద్యుత్ ప్లాంట్, మురుగు శుద్ధి ప్లాంట్ ఏర్పాటు చేశారు. ప్రాంగణం చుట్టూ పరుచుకున్న పచ్చదనం నిర్వహణకు వాడిన నీటిని రీ సైకిల్ చేసి ఉపయోగించనున్నారు.
మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నిర్మాణం కేవలం 20 నెలల్లో పూర్తయిందని ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ సంజీవ్ కుమార్ చెప్పారు. ఈ ఎయిర్‌పోర్టు గతంలో కేవలం 178
ఎకరాల్లో ఉండేది. దీనిని ఇప్పుడు రూ.350 కోట్ల వ్యయంతో అంతర్జాతీయ విమానాశ్రయంగా తీర్చిదిద్దారు. యూపీ ప్రభుత్వం 821 ఎకరాల భూమిని విమానాశ్రయం కోసం కేటాయించింది.
ప్రతి ఏటా 10 వేల మంది ప్రయాణికుల రాకపోకలు సాగించేందుకు వీలుగా విమానాశ్రయాన్ని అత్యంత విశాలంగా నిర్మించారు. టెర్మినల్ భవనాన్ని 6,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించారు. 2.2 కిలోమీటర్ల పొడవైన రన్‌వేను ఏర్పాటు చేశారు. దీంతో ఎయిర్‌బస్–321 రకం విమానాల ల్యాండింగ్, టేకాఫ్ సులభతరం కానుంది.
ఇక్కడ రెండు లింక్ ‘టాక్సీ వే’లు ఉండటంతో ఒకేసారి ఎనిమిది విమానాలను పార్క్ చేసుకునేందుకు అవకాశం ఉంది. త్వరలో విమానాశ్రయ రెండో దశ విస్తరణ పనులు మొదలుకానున్నాయి. టెర్మినల్‌ను 50 వేల చదరపు మీటర్లకు విస్తరించనున్నారు. ఏటా ఏకంగా 60 లక్షల మంది రాకపోకలకు వీలుగా విస్తరణ ప్రతిపాదనలు ఇప్పటికే సిద్ధంచేశారు. రన్‌వేను 3.7 కిలోమీటర్లకు విస్తరించి, అదనంగా 18 విమానాల పార్కింగ్‌కు చోటు కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది.
ఇది కూడా చదవండి: భారత్‌లో ఐదు కొత్త సంవత్సరాలు... ఏడాది పొడవునా సంబరాలే!
Comments
Please login to add a commentAdd a comment