Krishna railway station
-
దేవరకద్ర మార్గంలో ఎలక్ట్రిక్ రైళ్లు
సాక్షి, హైదరాబాద్: పాత లైన్ల విద్యుదీకరణ పూర్తి చేసిన రైల్వే శాఖ ఇప్పుడు కొత్త లైన్లను వేగంగా విద్యుదీకరిస్తోంది. మహబూబ్‌నగర్–కర్నాటకలోని మునీరాబాద్ మధ్య రైల్వే లైన్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో తెలంగాణ సరిహద్దు పరిధిలో దేవరకద్ర– కృష్ణా స్టేషన్ల మధ్య ఇటీవలే లైన్ అందుబాటులోకి వచ్చింది. 64 కి.మీ. ఈ నిడివిలో ప్రయాణికుల రైళ్లను ఇటీవలే స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. తాజాగా ఇప్పుడు దేవరకద్ర–కృష్ణా స్టేషన్ల మధ్య మార్గాన్ని కూడా విద్యుదీకరించారు. పనులు పూర్తి కావటంతో డీజిల్ లోకోమోటివ్ల బదులు ఎలక్ట్రిక్ లోకో మోటివ్‌లతో రైళ్లను తిప్పనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే శుక్రవారం ప్రకటించింది. ఉపయోగాలెన్నో.. ప్రస్తుతం కాచిగూడ నుంచి బెంగుళూరు, రాయచూరు తదితర ప్రాంతాలకు గద్వాల మీదు గా ఎలక్ట్రిక్ లోకోమోటివ్ రైళ్లు నడుస్తున్నాయి. వాస్తవానికి రాయచూరుకు గద్వాల మీదుగా కాకుండా కృష్ణా మీదుగా వెళ్లేది దగ్గరి దారి. ఇన్నాళ్లూ విద్యుదీకరణ పూర్తి కాకపోవటంతో రైళ్లను నడపటం సాధ్యం కాలేదు. ఇప్పుడు దేవరకద్ర– కృష్ణా స్టేషన్ల మధ్య విద్యుత్ లైన్ అందుబాటులోకి రావటంతో ఇక రాయచూరు సహా కొన్ని ఇతర రైళ్లను ఈ మార్గం మీదుగా మళ్లించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనివల్ల గద్వాల మార్గంపై ఒత్తిడి తగ్గుతుంది. ఎలక్ట్రిక్ ఇంజన్లతో పోలిస్తే డీజిల్ లోకోమోటివ్ల వినియోగం ఖర్చుతో కూడుకున్నది. ఇప్పుడు ఆ ఇంధన భారం కూడా తగ్గనుంది. వేగంలో పెద్దగా తేడా రాకున్నా, ఇంజన్ పికప్ బాగా మెరుగుపడుతుంది. ఇది ప్రయాణ సమయాన్ని తగ్గిస్తుంది. సరుకు రవాణా రైళ్లకు ఒకటికి మించి ఇంజన్లను వాడుతుంటారు. మూడు డీజిల్ ఇంజన్ల బదులు రెండు ఎలక్ట్రిక్ ఇంజన్లు ఎక్కువ వ్యాగన్లు ఉన్న రైలును సులభంగా లాగుతాయి. కొన్ని రకాల సరుకును తరలించే సందర్భంలో.. రెండు డీజిల్ ఇంజిన్ల బదులు ఒక్క ఎలక్ట్రిక్ ఇంజన్ సరిపోతుంది. ఇక విద్యుదీకరించాల్సింది ఆ రెండు మార్గాలే ఇక మనోహరాబాద్–కొత్తపల్లి రైల్వే లైన్ (పనులు జరుగుతున్నాయి), ఇటీవలే అందుబాటులోకి వచ్చిన మెదక్–అక్కన్నపేట మార్గాలను మాత్రమే విద్యుదీకరించాల్సి ఉంది. మనోహరాబాద్–కొత్తపల్లి ప్రాజెక్టులో భాగంగా, సిద్దిపేట వరకు లైన్ అందుబాటులోకి రావటంతో ఇటీవలే ప్రయాణికుల రైళ్లను ప్రారంభించిన విషయం తెలిసిందే. మనోహరాబాద్–సిద్దిపేట మధ్య విద్యుదీకరణ ప్రాజెక్టు మంజూరు కావటంతో వచ్చే నెలలో టెండర్లు పిలిచేందుకు రైల్వే శాఖ ఏర్పాట్లు చేస్తోంది. పనులు ప్రారంభమైన ఏడాదిలో అది కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. -
‘కృష్ణా’ వాసుల కష్టాలు.. ఆగని ఎక్స్‌ప్రెస్.. రాయచూర్ రైల్వేస్టేషన్‌కు వెళ్లాల్సిందే!
కృష్ణా (మహబూబ్‌నగర్): కృష్ణా రైల్వేస్టేషన్‌కు ఓ విశిష్టమైన చరిత్ర ఉంది. దేశంలో మొదటిసారి రైల్వేలైన్ ఏర్పాటు చేసిన సమయంలోనే ఈ రైల్వేస్టేషన్ ఏర్పడింది. అప్పటి నుంచి ఈ ప్రాంతంలోని కృష్ణానదిలో పూజ కార్యక్రమాలకు మహారాష్ట్ర, కర్ణాటక తదితర సూదూర ప్రాంతాల నుంచి ఇక్కడకు భక్తులు వచ్చేవారు. ఆ భక్తులకు ఉపయోగపడే విధంగా ఈ స్టేషన్లో అన్ని సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను నిలిపేవారు. కాగా కరోనా మహామ్మారి కారణంగా గత కొంత కాలంగా ఈ స్టేషన్లో ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఇక్కడ నిలపకుండగా రద్దు చేశారు. దీంతో కృష్ణానదికి వచ్చే భక్తులు చుట్టూ పక్కల గ్రామాలకు చెందిన ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ ప్రాంత ప్రజలు ఎక్స్‌ప్రెస్ రైళ్లకు గాను పక్కన ఉన్న కర్ణాటకలోని రాయచూర్ రైల్వేస్టేషన్‌కు వెళ్లాల్సి వస్తుందన్నారు. తక్షణమే గతంలో మాదిరిగా ఈ స్టేషన్లో రైళ్లను అన్నింటిని నిలిపే విధంగా తగు చర్యలు తీసుకోవాలని రైల్వే అధికారులకు, కేంద్ర రైల్వే మంత్రికి ప్రత్యేక విజ్ఞప్తులు చేశారు. ఎక్స్‌ప్రెస్ రైళ్లు నిలపాలని రైల్వేజీఎంకు విజ్ఞప్తి చేస్తున్న కృష్ణా గ్రామస్తులు (ఫైల్) అయినా అధికారుల్లో ఎలాంటి మార్పు రాకపోవడంతో ఈ విషయంపై రైల్వే స్టేషన్ ముందు అఖిల పక్షాల మద్దతుతో రిలే నిరాహార దీక్షలు చేపడుతామని అంటున్నారు. ఈ ప్రాంత నుంచి ప్రతి నిత్యం వందలాది మంది ప్రయాణికులు ముంబాయి, చెన్నై, బెంగుళూర్ ప్రాంతాలకు వెళ్తుంటారు. వారు ప్రస్తుతం ఇక్కడ రైళ్లను నిలపకపోవడంతో రాయచూర్ స్టేషన్‌కు వెళ్లాల్సి వస్తుంది. దీని మూలంగా కృష్ణాలోని చిన్న చిన్న వ్యాపారాలు, ఆటో డ్రైవర్లు నష్టపోతున్నారు. ఈ విషయంపై రైల్వే అధికారులు మరోమారు ఆలోచించి తమకు న్యాయం చేయాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. రిలే నిరాహార దీక్ష చేపడతాం.. స్టేషన్లో ఎక్స్‌ప్రెస్ రైళ్లు నిలపాలని అప్పటి కేంద్ర రైల్వే మంత్రిని ఒప్పించాం. అప్పటి నుంచి కృష్ణానదికి వచ్చే భక్తులకు చాల ఉపయోగకరంగా మారింది. అదే సమయంలో జిల్లాలోని అన్ని గ్రామాల ప్రజలకు ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ఉపయోగకరంగా ఉండేది. కరోనా కారణంగా రద్దు చేసిన రైళ్లను పునరుద్దరించినా ఈ స్టేషన్లో వాటిని నిలపడం లేదు. దీని మూలంగా ప్రయాణికులకు, భక్తులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించకపోతే రిలే నిరాహార దీక్షలు చేపడుతాం. – అమర్‌కుమార్ దీక్షిత్, పురోహితుడు. కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేస్తాం ఈ స్టేషన్లో ఎక్స్‌ప్రెస్ రైళ్లు నిలపాలని కోరుతూ త్వరలోనే అఖిల పక్షాల అధ్వర్యంలో కేంద్ర రైల్వే మంత్రిని, దక్షణ మధ్య రైల్వే ధ్యెంను కలిసి విజ్ఞప్తి చేస్తాం. అప్పటికి మా సమస్య పరిష్కారం కాకపోతే ప్రత్యక్ష ఆందోళనకు పూనుకుంటాం. – మహాదేవ్, కృష్ణా మాజీ సర్పంచ్ రాయచూర్‌కు వెళ్తున్నాం మా పిల్లలు ఉన్నత చదువుల నిమిత్తం బెంగుళూర్లో ఉంటున్నారు. మేము, మా పిల్లలు బెంగుళూర్‌కు వెళ్లాలంటే రాయచూర్ స్టేషన్‌కు వెళ్లాల్సి వస్తుంది. గతంలో కృష్ణాలోనే రైళ్లు నిలవడంతో ఇబ్బందులు ఉండేవి కాదు. ఇప్పుడు నిలపకపోవడంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. – విశ్వనాథ్‌గౌడ, గుర్జాల్ -
మినీ ఇండియా.. కృష్ణా
నారాయణపేట జిల్లా సరిహద్దులో ఉన్న కృష్ణాలో విభిన్న సంస్కృతులు, వివిధ ప్రాంతాలు, కులాలు, మతాలు, ఆచార అలవాట్లు, సంస్కృతి, వేషధారణలు ఉన్న వారు నివసిస్తుంటారు. ఇలాంటి వారు ఒకేచోట, ఒకే గ్రామంలో కనిపించడం చాలా అరుదు. ఈ గ్రామంలోని వారంతా వలస వచ్చిన వారే కావడం విశేషం. అందుకే ఈ గ్రామాన్ని ’మినీ ఇండియా’గా అభివర్ణిస్తారు. సాక్షి, కృష్ణా: ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం వరకు తమ వ్యాపార కార్యకలాపాల నిర్వహణకు 1907లో అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం కృష్ణానదిపై వంతెన నిర్మించింది. ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్రా నుంచి ఇటువైపు ఉన్న కర్ణాటక, తమిళనాడు వరకు రైలు సౌకర్యం ఏర్పడింది. అదే సమయంలో ఇటువైపు ఉన్న తెలంగాణలోనూ ఓ రైల్వేస్టేషన్ ఉండాలనే తలంపుతో నది పక్కనే ఏర్పాటుచేశారు. జిల్లాలోనే ఈ రైల్వేస్టేషన్ మొదటిది. ఉమ్మడి ఆంధ్రద్రదేశ్‌లో సికింద్రాబాద్ తరువాత రెండో అతిపెద్ద రైల్వేస్టేషన్, బ్రాడ్‌గేజ్ కలిగిన స్టేషన్‌గా గుర్తింపు పొందింది. ఈ ప్రాంతంలో అప్పట్లో ఊరు, ఇళ్లు లేదు. కేవలం రైల్వే ఉద్యోగులు మాత్రమే ఇక్కడ నివసిస్తుండేవారు. వారిలో గుజరాత్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, పంజాబ్ తదితర ప్రాంతాలకు చెందిన వారు ఉండటం, స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకోవడం, ఉద్యోగ విరమణ తరువాత కూడా ఇక్కడే ఉండటంతో కాలక్రమేణ అది ఓ గ్రామంగా, కృష్ణానది ఒడ్డున ఉండటంతో అది కాస్త కృష్ణా గ్రామంగా మారిందని ఈ ప్రాంత ప్రజలు చెబుతుంటారు. 1911లో హైదరాబాద్ మొదటి తాలుక్దార్ (కలెక్టర్) గోవింద్‌నాయక్ తన భార్య రంగుబాయి జ్ఞాపకార్థం తిరుపతి నుంచి ఓ వేంకటేశ్వరస్వామి విగ్రహాన్ని తీసుకొచ్చి కృష్నానది ఒడ్డున ప్రతిష్ఠించాడు. పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు మహదేవ్ దీక్షిత్, నారాయణభట్, రాఘవేంద్రచారి, గణపతిభట్, భీమాచారి అనే బ్రాహ్మణులను నియమించి వారి భృతి కోసం కొంత భూమిని కేటాయించారు. ఆ కుటుంబాలకు చెందిన వారే ఇప్పుడు వందల సంఖ్యలో ఇక్కడ నివసిస్తూ కర్మకాండలు, నిత్యకర్మ, సావత్రిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. వీరు నివసించే వీధిని ధర్మశాలగా పిలుస్తున్నారు. కర్మకాండలకు ప్రసిద్ధి చెందిన వాటిలో మొదటిది వారణాసి (కాశి) కాగా రెండోది కృష్నాగా చెప్పవచ్చు. రోజు వివిధ రాష్ట్రాల నుంచి వందల సంఖ్యలో కర్మకాండలు, అస్తికలు, చితాభస్మం నదిలో కలిపేందుకు ఇక్కడకు వస్తుంటారు. రాజీవ్‌గాంధీ, ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ అస్థికలను కూడా ఇక్కడే నిమజ్జనం చేశారు. జైనులు, రాజ్‌పుత్‌లు, మరాఠాలు.. 70 ఏళ్ల క్రితం జైనులు రాజస్థాన్ నుంచి ఇక్కడకు వ్యాపార నిమిత్తం వలస వచ్చారు. 25 ఏళ్ల క్రితం 100 మంది ఉంటే ఈ రోజు రెండు కుటుంబాలు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ వ్యాపారం పడిపోవటంతో తాము ఇతర రంగాల వైపు వెళ్లాల్సి వచ్చిందని ఆ కుటుంబాలవారు చెబుతున్నారు. రాజ్‌పుత్‌లు మహారాష్ట్ర నుంచి ఇక్కడకు రైల్వే ఉద్యోగులుగా 75 ఏళ్ల క్రితం వచ్చారు. ఒక్క కుటుంబం నుంచి సుమారు 10 కుటుంబాలు అయ్యాయి. 20 ఏళ్ల క్రితం 100కు పైగా ఉండగా ప్రస్తుతం 30 మంది మాత్రమే ఉన్నారు. మరాఠాలు కూడా రైల్వే ఉద్యోగులుగా వచ్చారు. కొందరు ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తుండగా మిగిలిన వారు కిళ్లి కొట్టు, సప్లయింగ్ కంపెనీ తదితర వ్యాపారాలు చేస్తున్నారు. అగర్వాల్స్, ముస్లింలు అగర్వాల్స్ ఉత్తరప్రదేశ్, ఢిల్లీ నుంచి 80 ఏళ్ల క్రితం వ్యాపార నిమిత్తం వచ్చారు. హోటల్స్, స్వీట్ దుకాణాలు, ధాన్యం కొనుగోలు తదితర వ్యాపారం చేసేవారు. 30 ఏళ్లుగా ఇక్కడ వ్యాపారం పడిపోవటంతో ఇతర ప్రాంతాలకు వెళ్లారు. ముస్లింలు రజకార్ల పాలనలో వ్యాపార నిమిత్తం ఇక్కడకు వచ్చారు. అప్పట్లో సుమారు 800 మంది ఉండగా ప్రస్తుతం 400 మంది మాత్రమే ఉన్నారు. ఇక్కడ వ్యాపారం పడిపోవటంతో కర్ణాటక, మహారాష్ట్రకు వెళ్లారని అంటున్నారు. -
కృష్ణా పుష్కరాలకు ప్రత్యేక రైలు
రాజంపేట: కృష్ణ పుష్కరాల సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఇందులో భాగంగా తిరుపతి నుంచి జిల్లా మీదుగా కృష్ణా రైల్వేస్టేషన్‌కు జనరల్ బోగీలతో ప్రత్యేక రైలు(07054 నంబరు) నడుస్తోంది. పుస్కరాలకు తరలివెళ్లే రైతులు పుష్కర ఘాట్లకు సమీప దూరంలోని కృష్ట రైల్వేస్టేషన్ వరకూ రైలు వెళుతుంది. అక్కడి నుంచి ఘాట్లకు సులభంగా చేరుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈనెల 11 నుంచి ఈ రైలు నడుస్తోంది. ఆ నాలుగు రోజుల్లో రైలు లేనట్లే..! కృష్ణాపుష్కరాల రైలు ఈనెల 15, 20వ తేదీలలో ఇక్కడి నుంచి నడవదు. అలాగే 16, 21వ తేదీల్లో కృష్ణా రైల్వేస్టేషన్ నుంచి రైలు నడవదని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. ఈ స్టేషన్లలో స్టాపింగ్ తిరుపతి నుంచి బయలుదేరే రైలు రేణిగుంట, రైల్వేకోడూరు, రాజంపేట, నందలూరు, కడప, ఎర్రగుంట్ల, కొండాపురం, తాడిపత్రి, గుత్తి, గుంతకల్లు, ఆదోని, మంత్రాలయం, రాయచూరు మీదుగా కృష్ణాకు చేరుకుంటుంది. దీనికి రిజర్వేషన్ సౌకర్యం లేదు. రైలు నడిచే సమయం ఇలా.. తిరుపతిలో రైలు రాత్రి 11.10 గంటలకు బయలు దేరుతుంది. కడపకు 1.25కు చేరుకుంటుంది. మరుసటి రోజు ఉదయం 8.10 గంటలకు కృష్ణా రైల్వేస్టేషన్‌కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో కృష్ణా రైల్వేస్టేషన్ నుంచి ఉదయం 10 గంటలకు రైలు బయలుదేరి కడపకు 4.25కు, తిరుపతి 7.25 గంటలకు చేరుకుంటుంది. జయంతి, సూపర్పాస్ట్కు కృష్ణాలో స్టాపింగ్.. కృష్ణా పుష్కరాల సందర్భంగా కన్యాకుమారి నుంచి ముంబయికి నడిచే జయంతి ఎక్స్‌ప్రెస్(16381–16382) రైలుకు కృష్ణ రైల్వేస్టేషన్లో స్టాపింగ్ సౌకర్యం కల్పించారు. అలాగే చెన్నై ఎగ్మోర్ నుంచి ముంబయికి నడిచే సూపర్‌పాస్ట్ ఎక్స్‌ప్రెస్ (12154–12153) రైలుకు కూడా కృష్ణా రైల్వేస్టేషన్లో స్టాపింగ్ సౌకర్యం కల్పించినట్లు రైల్వేవర్గాలు తెలిపాయి. ఈ స్టాపింగ్ ఈనెల 23వ తేదీ వరకు కొనసాగించనున్నారు. రాయలసీమ ఎక్స్‌ప్రెస్ ద్వారా కూడా కృష్ణాకు చేరుకోవచ్చని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. -
నిఘా.. నిద్ర
ఓ వైపు రాయచూర్- హైదరాబాద్ జాతీయ రహదారి. మరోవైపు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలను కలిపే రైలుమార్గం. కృష్ణా, భీమా నదుల సంగమం. ఇంకేం అంతర్ రాష్ట్ర సరిహద్దులోని భౌగోళిక పరిస్థితులను ఆసరాగా చేసుకుని అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. పేలుడు పదార్థాలు, కల్లు రవాణా, మట్కా, జూదం వంటి అక్రమ కార్యకలాపాలకు అడ్డు లేకుండా పోయింది. నియంత్రించాల్సిన అధికార యంత్రాంగం మామూళ్ల మత్తులో మునిగి తేలుతోంది. రవాణా, వాణిజ్య పన్నుల శాఖ చెక్‌పోస్టులు లేకపోవడంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడుతోంది. సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో ఉన్న మాగనూరు మండలంలోని పలు గ్రామాలు కేంద్రంగా అక్రమ దందా జోరుగా సాగుతోంది. కృష్ణా రైల్వే స్టేషన్ అడ్డాగా కల్లు వ్యాపారం యథేచ్ఛగా కొనసాగుతోంది. కృష్ణా రైల్వే స్టేషన్‌కు సమీపంలో ఉన్న కల్లు విక్రయ కేంద్రానికి కర్ణాటక నుంచి మద్యం ప్రియులు రైళ్ల ద్వారా చేరుకుంటున్నారు. ఇక్కడ కల్లు సేవించడంతో పాటు ట్యూబులు, క్యాన్ల ద్వారా అక్కడకు కల్లు తరలిస్తున్నారు. ఈ వ్యాపారం పెద్ద ఎత్తున సాగుతున్నా ఎక్సైజ్ విభాగం అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. కల్తీ కల్లు తయారీలో వినియోగించే క్లోరల్ హైడ్రేట్ రైలుమార్గం ద్వారా మహారాష్ట్ర నుంచి స్థానిక వ్యాపారులకు సరఫరా అవుతోంది. కృష్ణా నదీ తీరం వెంట అనుమతి లేకుండా క్వారీలు నిర్వహిస్తున్నారనే పిర్యాదులున్నాయి. ఈ క్వారీల్లో వినియోగించే పేలుడు పదార్థారాలు కూడా మహా రాష్ట్ర నుంచి రైలుమార్గంలో తరలివస్తున్నాయి. టై రోడ్ పరిసర ప్రాంతాలు జూదం కేంద్రాలుగా విలసిల్లుతున్నాయి. పొరుగునే ఉన్న రాయచూరు థర్మల్ విద్యుత్ కేంద్రం పరిసర గ్రామాల నుంచి వచ్చే పేకాట రాయుళ్లకు స్థానికంగా కొందరు అడ్డా సమకూర్చుతున్నారు. ‘అందర్- బాహర్’ మొదటి పేజీ తరువాయి పేరిట లక్షల రూపాయల్లో జూదం కొనసాగుతుండగా స్థానిక ముఠాలకు రోజూ రూ.వేలల్లో ఆదాయం సమకూరుతోంది. కృష్ణా రైల్వే స్టేషన్ సమీపంలోనే ఓ రెండు దుకాణాలు కేంద్రంగా మట్కా కొనసాగుతోంది. బహిరంగంగానే బెట్టింగులు జరుగుతున్నా అరికట్టే దిశగా చర్యలు తీసుకున్న దాఖలా లేదు. కృష్ణానదికి అవతలి ఒడ్డున ఉన్న కర్ణాటక నుంచి మాగనూరు మండల పరిధిలోని గ్రామాలకు మద్యం సరఫరా అవుతోంది. పర్యవేక్షణ లేకపోవడంతో ఎంఆర్పీతో సంబంధం లేకుండా ఎక్కువ ధరలకు మద్యం అమ్మకాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ ఖజానాకు గండి రెండు రాష్ట్రాలకు అత్యంత కీలకమైన రాయచూర్- హైదరాబాద్ మార్గంలో కీలక వి భాగాలకు చెందిన చెక్‌పోస్టులు కనిపిం చడం లేదు. వ్యవసాయ, ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ చెక్‌పోస్టులు మాత్రమే ఉన్నా యి. కీలకమైన రవాణా, వాణిజ్య పన్నుల శాఖ చెక్‌పోస్టులు ఇంకా ఏర్పాటు చేయలేదు. దీంతో సరైన అనుమతి పత్రాలు లేకుండానే కర్ణాటక- తెలంగాణ రాష్ట్రాల నడుమ వాణిజ్య సరుకుల రవాణా యథేచ్ఛగా సాగుతోంది. సిమెంటు, ఇనుము, బొగ్గు, ఇసుక తదితరాలు ఎలాంటి అనుమతి లేకుండానే రాష్ట్ర సరిహద్దులు దాటుతున్నాయి. ప్రొహిబిషన్, ఎక్సైజ్ విభాగానికి చెందిన చెక్‌పోస్టున్నా అది శిథిలావస్తకు చేరింది. షెడ్డులో సరైన సౌకర్యాలు లేకపోవడంతో సిబ్బంది సతమతమవుతున్నారు.