మినీ ఇండియా.. కృష్ణా | Krishna Railway Station Special Story Narayanpet District | Sakshi
Sakshi News home page

మినీ ఇండియా.. కృష్ణా

Published Thu, Sep 24 2020 10:09 AM | Last Updated on Thu, Sep 24 2020 10:09 AM

Krishna Railway Station Special Story Narayanpet District - Sakshi

నారాయణపేట జిల్లా సరిహద్దులో ఉన్న కృష్ణాలో విభిన్న సంస్కృతులు, వివిధ ప్రాంతాలు, కులాలు, మతాలు, ఆచార అలవాట్లు, సంస్కృతి, వేషధారణలు ఉన్న వారు నివసిస్తుంటారు. ఇలాంటి వారు ఒకేచోట, ఒకే గ్రామంలో కనిపించడం చాలా అరుదు. ఈ గ్రామంలోని వారంతా వలస వచ్చిన వారే కావడం విశేషం. అందుకే ఈ గ్రామాన్ని ’మినీ ఇండియా’గా అభివర్ణిస్తారు.

సాక్షి, కృష్ణా: ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం వరకు తమ వ్యాపార కార్యకలాపాల నిర్వహణకు 1907లో అప్పటి బ్రిటీష్‌ ప్రభుత్వం కృష్ణానదిపై వంతెన నిర్మించింది. ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్రా నుంచి ఇటువైపు ఉన్న కర్ణాటక, తమిళనాడు వరకు రైలు సౌకర్యం ఏర్పడింది. అదే సమయంలో ఇటువైపు ఉన్న తెలంగాణలోనూ ఓ రైల్వేస్టేషన్‌ ఉండాలనే తలంపుతో నది పక్కనే ఏర్పాటుచేశారు. జిల్లాలోనే ఈ రైల్వేస్టేషన్‌ మొదటిది. ఉమ్మడి ఆంధ్రద్రదేశ్‌లో సికింద్రాబాద్‌ తరువాత రెండో అతిపెద్ద రైల్వేస్టేషన్, బ్రాడ్‌గేజ్‌ కలిగిన స్టేషన్‌గా గుర్తింపు పొందింది. ఈ ప్రాంతంలో అప్పట్లో ఊరు, ఇళ్లు లేదు. కేవలం రైల్వే ఉద్యోగులు మాత్రమే ఇక్కడ నివసిస్తుండేవారు. వారిలో గుజరాత్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, పంజాబ్‌ తదితర ప్రాంతాలకు చెందిన వారు ఉండటం, స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకోవడం, ఉద్యోగ విరమణ తరువాత కూడా ఇక్కడే ఉండటంతో కాలక్రమేణ అది ఓ గ్రామంగా, కృష్ణానది ఒడ్డున ఉండటంతో అది కాస్త కృష్ణా గ్రామంగా మారిందని ఈ ప్రాంత ప్రజలు చెబుతుంటారు.

1911లో హైదరాబాద్‌ మొదటి తాలుక్‌దార్‌  (కలెక్టర్‌) గోవింద్‌నాయక్‌ తన భార్య రంగుబాయి జ్ఞాపకార్థం తిరుపతి నుంచి ఓ వేంకటేశ్వరస్వామి విగ్రహాన్ని తీసుకొచ్చి కృష్నానది ఒడ్డున ప్రతిష్ఠించాడు. పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు మహదేవ్‌ దీక్షిత్, నారాయణభట్, రాఘవేంద్రచారి, గణపతిభట్, భీమాచారి అనే బ్రాహ్మణులను నియమించి వారి భృతి కోసం కొంత భూమిని కేటాయించారు. ఆ కుటుంబాలకు చెందిన వారే ఇప్పుడు వందల సంఖ్యలో ఇక్కడ నివసిస్తూ కర్మకాండలు, నిత్యకర్మ, సావత్రిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. వీరు నివసించే వీధిని ధర్మశాలగా పిలుస్తున్నారు. కర్మకాండలకు ప్రసిద్ధి చెందిన వాటిలో మొదటిది వారణాసి (కాశి) కాగా రెండోది కృష్నాగా చెప్పవచ్చు. రోజు వివిధ రాష్ట్రాల నుంచి వందల సంఖ్యలో కర్మకాండలు, అస్తికలు, చితాభస్మం నదిలో కలిపేందుకు  ఇక్కడకు వస్తుంటారు. రాజీవ్‌గాంధీ, ఇందిరాగాంధీ, ఎన్‌టీఆర్‌ అస్థికలను కూడా ఇక్కడే నిమజ్జనం చేశారు.

జైనులు, రాజ్‌పుత్‌లు, మరాఠాలు..
70 ఏళ్ల క్రితం జైనులు రాజస్థాన్‌ నుంచి ఇక్కడకు వ్యాపార నిమిత్తం వలస వచ్చారు. 25 ఏళ్ల క్రితం 100 మంది ఉంటే ఈ రోజు రెండు కుటుంబాలు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ వ్యాపారం పడిపోవటంతో తాము ఇతర రంగాల వైపు వెళ్లాల్సి వచ్చిందని ఆ కుటుంబాలవారు చెబుతున్నారు. రాజ్‌పుత్‌లు మహారాష్ట్ర నుంచి ఇక్కడకు రైల్వే ఉద్యోగులుగా 75 ఏళ్ల క్రితం వచ్చారు. ఒక్క కుటుంబం నుంచి సుమారు 10 కుటుంబాలు అయ్యాయి. 20 ఏళ్ల క్రితం 100కు పైగా ఉండగా ప్రస్తుతం 30 మంది మాత్రమే ఉన్నారు. మరాఠాలు కూడా రైల్వే ఉద్యోగులుగా వచ్చారు. కొందరు ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తుండగా మిగిలిన వారు కిళ్లి కొట్టు, సప్లయింగ్‌ కంపెనీ తదితర వ్యాపారాలు చేస్తున్నారు.  

అగర్వాల్స్, ముస్లింలు
అగర్వాల్స్‌ ఉత్తరప్రదేశ్, ఢిల్లీ నుంచి 80 ఏళ్ల క్రితం వ్యాపార నిమిత్తం వచ్చారు. హోటల్స్, స్వీట్‌ దుకాణాలు, ధాన్యం కొనుగోలు తదితర వ్యాపారం చేసేవారు. 30 ఏళ్లుగా ఇక్కడ వ్యాపారం పడిపోవటంతో ఇతర ప్రాంతాలకు వెళ్లారు.  ముస్లింలు రజకార్ల పాలనలో వ్యాపార నిమిత్తం ఇక్కడకు వచ్చారు. అప్పట్లో సుమారు 800 మంది ఉండగా ప్రస్తుతం 400 మంది మాత్రమే ఉన్నారు. ఇక్కడ వ్యాపారం పడిపోవటంతో కర్ణాటక, మహారాష్ట్రకు వెళ్లారని అంటున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement