నారాయణపేట: పల్లె ప్రకృతి వనం కోసం తన భూమిని లాక్కున్నారన్న మనస్తాపంతో ఓ దివ్యాంగ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన నారాయణపేట జిల్లాలో చోటు చేసుకుంది. గ్రామస్తులు, కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. శేర్నపల్లికి చెందిన జట్రం మల్లప్ప (55)కు గతంలో ప్రభుత్వం 2 ఎకరాల అసైన్డ్ భూమిని ఇచ్చింది. ఆయనకు మరో ఎకరా 35 గుంటల పట్టాభూమి కూడా ఉంది. ప్రభుత్వం ఇచ్చిన భూమి జాజాపూర్ పంచాయతీ శివారులో ఉండటంతో.. ఆ భూ మిలో పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేసేందుకు అధికారులు నిర్ణయించారు.
మంగళవారం ఆ భూమి చుట్టూ కంచె ఏర్పాటు చేశారు. అర ఎకరా తీసుకొని, మిగతాది వదిలిపెట్టాలని మల్లప్ప కాళ్లావేళ్లా పడినా వారు వినలేదు. మనస్తాపం చెందిన మల్లప్ప ఇంటికి వచ్చిన తర్వాత పురుగుల మందు తాగాడు. గ్రామస్తులు జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించేలోపే మృతి చెందాడు. దీంతో ఆగ్రహించిన శేర్నపల్లి గ్రామస్తులు, రైతులు జిల్లా కేంద్రానికి చేరుకుని రాస్తారోకో చేపట్టారు. బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని ఆర్డీఓ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
Comments
Please login to add a commentAdd a comment