తెలంగాణలో నారాయణపేట పేరు వినగానే అక్కడి చేనేత చీరలు కళ్లముందు నిలుస్తాయి. వాటి ఘనత గురించి కాసేపయినా మాట్లాడుకోకుండా ఉండలేం. మగువల మనసులను అకట్టుకునే విధంగా నేతకారులు మగ్గాల పై పట్టు, కాటన్ చీరలను నేయడంలో ప్రత్యేకత చాటుకుంటున్నారు. ఇక నుంచి నారాయణపేట చేనేతలకే కాదు, తమ ప్రాంత చిత్రకళా వైభవాన్ని చెప్పుకునేలా కృషి చేస్తూ తమ కలలకు కళానైపుణ్యాన్ని జత చేస్తున్నారు ఇక్కడి మహిళలు.
భారతీయ హస్తకళలో కలంకారీ చిత్రకళ ప్రాచీనమైనది. ఇప్పటి వరకు ఈ కళ గురించి ప్రస్తావన వస్తే ఆంధ్రప్రదేశ్ లోని మచిలీపట్నం, శ్రీకాళ హస్తి పేర్లు ప్రధానంగా వినిపిస్తాయి. ప్రపంచ మార్కెట్‌లో కలంకారీ వస్త్రాలకు మంచి డిమాండ్ ఉండడంతో తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి నారాయణపేటలో మహిళలు శిక్షణ పొందుతున్నారు. వస్త్రాలపై కలంకారీ పెయింటింగ్‌తో పాటు బ్లాక్ ప్రింటింగ్ కూడా రూపొందించేందుకు సిద్ధమయ్యారు.
మహిళల ప్రతిభ
ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినవారు నారాయణపేట జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన. నాబార్డు సహకారంతో, డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో కలంకారీలో 60 మంది మహిళలకు 80 రోజుల పాటు హైదరాబాద్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ శిక్షణ ఇస్తోంది. బ్లాక్ ప్రింటింగ్‌పై 30 మంది మహిళలు శిక్షణ పొందుతున్నారు. ఈ శిక్షణలో మహిళలు తమ ప్రతిభను చాటుతున్నారు.
రంగులు అద్దుతున్నారిలా...
వెదురు పుల్లలకు దూది చుట్టి బ్రష్‌లా చేసుకొని.. చింతపుల్లలను కాల్చి, నల్లబెల్లం వాడుతూ, పాలు, పటిక పొడి కలిపిన ద్రావణంలో వస్త్రాన్ని నానబెట్టి, జాడించి, సబ్బునీళ్లలో ఉతికి ఆరబెడతారు. తొలిసారి చిత్రణ పూర్తయ్యాక పారుతున్న నీళ్లలో ఆరవేసినట్టుగా ఆ వస్త్రాన్ని పట్టుకుంటారు. మొదటి దశలో ఎరుపు, నలుపు రంగులను వాడుతారు. ఆ తర్వాత డిజైన్‌కు సంబంధించిన రంగులన్నీ ఉపయోగిస్తారు.
అన్నీ సహజమైన రంగులే!
కలంకారీ డిజైన్‌లో ప్రధానంగా వాడే నలుపు, ఎరుపు, పసుపు, నీలం, ఆకుపచ్చ రంగుల కోసం తుమ్మజిగురు, కరక్కాకాయ, నల్లబెల్లం, తుప్పుముక్క, దానిమ్మ తొక్కల ద్వారా తీసిన సహజమైన రంగులను వాడుతున్నారు.
ఆకట్టుకుంటున్న వస్త్రాలు
యువతులు, మహిళలు ఎంతో ఉత్సాహంతో చేస్తున్న ఈ ప్రక్రియతో కలంకారీ పెయింటింగ్స్, బ్లాక్ ప్రింటింగ్ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఆర్థిక స్వావలంబన దిశగా సాగుతామని మహిళలు, యువతులు చెబుతున్నారు.
దుపట్టాలు, చీరలు, టేబుల్ క్లాత్స్, బ్యాగ్స్ పై ఈ పెయింటింగ్‌తో అందమైన డిజైన్లను రూపొందిస్తున్నారు. కలంకారీ పెయింటింగ్, బ్లాక్ ప్రింటింగ్‌లో శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలు, యువతులు సర్టిఫికేట్‌లను అందుకోవడంతో పాటు ఈ కళలో నిమగ్నమయ్యారు.
నారాయణపేట చేనేతలకు ప్రసిద్ది. ఇక్కడి చేనేత కార్మిక మహిళలు, యువతులు చదువుతో పాటు స్వయం ఉపాధి అవకాశాలు అందుకోవాలనే లక్ష్యంతో కలంకారీ పెయింటింగ్, బ్లాక్ ప్రింటింగ్‌పై శిక్షణ ఇస్తున్నాం. త్వరలోనే ఈ ప్రాంత మహిళల చేతుల్లో రూపుదిద్దుకున్న కలంకారీ, బ్లాక్ ప్రింటింగ్ చీరలు మార్కెట్‌లోకి వస్తాయి. ఆర్థికంగా మరింత పురోగతిని సాధించనున్నారు. – దాసరి హరిచందన, జిల్లా కలెక్టర్, నారాయణపేట
ఉపాధికి ఊతం
నేను మెహిందీ డిజైనర్‌ని. డ్రాయింగ్‌తో పాటు చీరలపై ఫ్యాబ్రిక్ పెయింట్ చేస్తుంటాను. దీంతో కలంకారీ చిత్రణ నేర్చుకోవడం నాకు చాలా సులభమైంది. ఇప్పటికే కలంకారీ కాటన్, పట్టు చీరల వ్యాపారం చేస్తున్నాను. ఈ డిజైన్ చీరలకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. స్వయంగా డిజైన్ చేసి నారాయణపేట చీరలంటే మరింత ఆదరణ పొందేందుకు కృషి చేస్తున్నాను. – అశ్విని కళ్యాణి, నారాయణపేట
మంచి భవిష్యత్తు
నేను డిగ్రీ చేస్తున్నాను. వస్త్రాలపై డిజైనింగ్‌కు అంతటా మంచి ఆదరణ ఉండటంతో చదువుతో పాటు కలంకారీ పెయింటింగ్ నేర్చుకుంటున్నాను. ఇది నా భవిష్యత్తును మరింత కళగా మార్చుతుందని ఈ పెయింటింగ్‌లో మెళకువలు తెలుసుకున్నాక అర్ధమైంది.– వైష్ణవి
ప్రత్యేకమైన డిజైన్
నేను పీజీ పూర్తిచేశాను. వస్త్రాలపై రకరకాల డిజైన్లు వేయడం కొన్నేళ్లుగా చేస్తున్నాను. నా ‘కళ’కు ఇప్పుడీ కలంకారీ శిక్షణ తోడవడంతో మెరుగైన ఫలితాలు పొందుతానన్న పూర్తి నమ్మకం వచ్చేసింది. ఇక్కడి నుంచి ప్రపంచమార్కెట్లోకి మరింత విస్తృతంగా వెళ్లగలం. – లత, నారాయణపేట
శిక్షణ ఇస్తున్నా!
నేను బీఎస్సీ చదివాను. బ్లాక్ పెయింటింగ్ నేర్చుకున్నా. కాటన్, పట్టు వస్త్రాలపై అద్దకం డిజైన్లు మరింత ఆకర్షణీయంగా రూపొందిస్తున్నాను. స్వయం ఉపాధి పొందుతూ నలుగురికి శిక్షణ ఇచ్చేవిధంగా సిద్ధమైనందుకు ఆనందంగా ఉంది. – శ్వేత, నారాయణపేట
– కలాల్ ఆనంద్ కుమార్ గౌడ్, నారాయణపేట, సాక్షి
చదవండి: Fashion Blouse Trend: డిజైన్‌లను బట్టి బ్లౌజ్‌కు రూ.600 నుంచి 5వేల వరకు చార్జీ! రోజుకు రూ. 1000 వరకు వస్తున్నాయి!
Comments
Please login to add a commentAdd a comment